Begin typing your search above and press return to search.

వైసీపీ సీనియర్లకు ఆ పార్టీయే శ్రీరామ రక్ష ?

ఏపీలో వైసీపీ నెమ్మదిగా వీక్ అవుతోందా అన్న ఆలోచనలు కూడా కలుగుతున్నాయట.

By:  Tupaki Desk   |   15 July 2024 2:45 AM GMT
వైసీపీ సీనియర్లకు ఆ పార్టీయే శ్రీరామ రక్ష ?
X

వైసీపీ సీనియర్లు గత నెలన్నరగా పూర్తి సైలెంట్ గా ఉన్నారు. ఏపీలో వైసీపీ ఘోరంగా ఓటమి పాలు కావడంతో ఎవరికీ దిక్కు తోచడం లేదు. వైసీపీతో దశాబ్దం పైగా ట్రావెల్ చేసిన వారు కూడా ఇపుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. ఏమి చేయాలన్న దాని మీద సీరియస్ గానే చర్చిస్తున్నారు.

ఏపీలో వైసీపీ నెమ్మదిగా వీక్ అవుతోందా అన్న ఆలోచనలు కూడా కలుగుతున్నాయట. ఎందుకంటే వైసీపీ అధినాయకత్వం ఒంటెద్దు పోకడలు అలాగే రాజకీయంగా మిత్రులు లేకపోవడం రాజకీయంగా సరైన దిశా నిర్దేశం లేకపోవడంతో ఆ పార్టీలో ఉంటే పుట్టె మునుగుతుందని భావిస్తున్న వారే ఎక్కువ.

అందుకే ఉత్తరాంధ్రా నుంచి అనంతపురం జిల్లా దాకా ఉన్న సీనియర్లు అంతా తమ పొలిటికల్ ఫ్యూచర్ గురించి అంతర్మధనం చెందుతున్నారని అంటున్నారు. ఇక చూస్తే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కేసులు పెడుతోంది. దానిని తట్టుకుని నిలబడాలంటే ఏదో ఒక బలమైన పార్టీ అండ ఉండాల్సిందే అన్న లెక్కకు వస్తున్నారుట.

ఇలా ఆలోచిస్తున్న వారికి ఆశాకిరణంగా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తన గ్రాఫ్ ఒక్కసారిగా పెంచుకుంది. అంతే కాదు తాజాగా వచ్చిన అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు సైతం కాంగ్రెస్ కి బూస్ట్ ఇచ్చాయి. దాంతో ఉత్తరాదిన తమకు బాగానే అనుకూలత ఉందని భావిస్తున్న కాంగ్రెస్ సౌత్ లో ఫోకస్ చేస్తోంది అని అంటున్నారు. అందులోనూ ఏపీలో కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది అని అంటున్నారు.

ఏపీలో రాజకీయ శూన్యత ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. వైసీపీని చూసేసిన సినిమాగా జనాలు భావిస్తున్నారు అంటున్నారు. కూటమి తప్పు చేస్తే వ్యతిరేక ఓటు వైసీపీకి ఎంతవరకూ పడుతుందో తెలియదు అని అంటున్నారు దాంతో ఆ అవకాశాన్ని వాడుకోవడానికి కాంగ్రెస్ తయారుగా ఉంది అని అంటున్నారు.

మరో వైపు వైసీపీలో ఉన్న సీనియర్ నేతలు అంతా ఒకపుడు కాంగ్రెస్ లో ఉన్న వారే. వారే ఆ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించిన వారే. వైఎస్సార్ కి అత్యంత సన్నిహితులుగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో వారి చూపు కాంగ్రెస్ వైపు ఉందని అంటున్నారు. అలాగే వారిని కాంగ్రెస్ వైపు తీసుకుని వచ్చేలా కేవీపీ రామచంద్రరావు లాంటి రాజకీయ చాణక్యుడు చేయాల్సింది అంతా చేస్తున్నారు.

వైఎస్సార్ జయంతి వేళ కేవీపీ ఒక బాంబు పేల్చారు వైసీపీ నుంచి బిగ్ షాట్స్ చాలా మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అని కూడా అన్నారు. ఆ జాబితాను తయారు చేసే పనిలో కాంగ్రెస్ ఉంది అని అంటున్నారు. కేంద్ర బడ్జెట్ సమావేశాల తరువాత రాహుల్ గాంధీ టూర్ ఏపీలో ఉంటుంది అని అంటున్నారు.

ఆయన సమక్షంలో ఒక బిగ్ నంబర్ వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరుతుందని అంటున్నారు. అదే జరిగితే వైసీపీ మరింత వీక్ కావడం ఖాయమని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఓటమి పాలు అయినా వైసీపీ ఆత్మ విమర్శ సరిగ్గా చేసుకోలేకపోవడం, మళ్ళీ తామే పొలిటికల్ ఆల్టర్నేషన్ గా ఉంటామని ధీమాగా ఉండడం వంటివి కూడా పార్టీలో చాలామందికి ఇబ్బందిగా ఉంది అంటున్నారు.

జగన్ పార్టీని సవ్య దిశలో నడపాలని కోరుకుంటున్న వారు ఉన్నారు. అయితే ఆయన మాత్రం టీడీపీ తప్పులే తమను గెలిపిస్తాయని భావిస్తున్నారు. అంతే కాదు తనదైన విధానాలతో ముందుకు సాగుతున్నారు అని అంటున్నారు. అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో మారుతున్న పరిణామాలను వైసీపీ అంచనా వేసుకోవడం లేదని అంటున్నారు.

వైసీపీ ఏర్పాటు టైం లో యూపీయే కేంద్రంలో రెండు సార్లు అధికారంలో ఉండడంతో వ్యతిరేకత పూర్తిగా ఉంది. దాన్ని సొమ్ము చేసుకుని వైసీపీ ఏపీలో రాజకీయంగా పరిపుష్టిని సాధించింది. అయితే పన్నెండేళ్ళు పై దాటినా పార్టీని సంస్థాగతంగా బలపరచుకోక పోవడంతో పాటు ఏక పక్ష విధానాలు వల్ల పార్టీకి ఇపుడు అదే కాంగ్రెస్ నుంచి సవాల్ ఎదురవుతోంది అంటున్నారు. పార్టీకి కీలకంగా ఉండే వివిధ జిల్లాల సీనియర్లు కాంగ్రెస్ వైపు మళ్ళితే మాత్రం వైసీపీకి కొత్త కష్టాలు వచ్చినట్లే అని అంటున్నారు.