ఐటీ రిటర్న్ వేయలేదా? మరో 15 రోజులు చాన్స్
డిసెంబర్ 31తో గడువు ముగుస్తుండగా, కేంద్రం ప్రకటనతో జనవరి 15 వరకు ఐటీఆర్ ఫైల్ చేయొచ్చని అధికారులు ప్రకటించారు.
By: Tupaki Desk | 31 Dec 2024 1:04 PM GMTట్యాక్స్ పేయర్స్ కి ఆదాయ పన్నుశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయని వారు మరో 15 రోజుల్లోగా రిటర్న్స్ వేయొచ్చని ప్రకటించింది. డిసెంబర్ 31తో గడువు ముగుస్తుండగా, కేంద్రం ప్రకటనతో జనవరి 15 వరకు ఐటీఆర్ ఫైల్ చేయొచ్చని అధికారులు ప్రకటించారు.
ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు జనవరి 15 వరకు గడువు పెంచుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) ఉత్తర్వులు జారీ చేసింది. బిలేటెడ్ ఐటీఆర్ లేదా రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువు పెంచుతూ కీలక ప్రకటన చేసింది. నిజానికి ఐటీఆర్ ఫైలింగ్ గడువు 2024 డిసెంబర్ 31. అయితే ఈ గడువును ఆదాయ పన్నుశాఖ 2025 జనవరి 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పొడిగింపు పన్ను చెల్లింపుదారులు వారి ఫైలింగులను పూర్తి చేయడానికి లేదా సవరించడానికి ఓ అవకాశం అని తెలుస్తోంది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 119 ప్రకారం బోర్డు అధికారాలను ఉపయోగించి ఈ మార్పు చేసింది.
వాస్తవానికి ఏటా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి జులై 31వ తేదీ వరకు మాత్రమే గడువు ఉంటుంది. ఆ తేదీలోగా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే డిసెంబర్ 31లోగా జరిమానా చెల్లించి రిటర్నులు ఫైల్ చేయొచ్చు. అయితే ఈ గడువును మరో 15 రోజులు పొడిగిస్తూ ఆదాయ పన్నుశాఖ నిర్ణయం తీసుకోవడంతో పన్ను చెల్లింపుదారులకు కొంత ఉపశమనం లభించినట్లైంది. జనవరి 15లోగా ఐటీఆర్ ఫైల్ చేయనివారే కాకుండా ఏదైనా తప్పుతో ఫైల్ చేసిన వారు కూడా తమ పొరపాటును సరిచేసుకునే చాన్స్ ఉంది. సో, ఎవరైనా ఉంటే ఈ 15 రోజుల్లోగా ఐటీఆర్ ఫైల్ చేసేయండి.