ఐటీ ఉద్యోగాల పేరుతో రూ.15 కోట్ల టోకరా
ఐటీ కంపెనీలో ఉద్యోగమని పేర్కొంటూ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయటం.. ఆ తర్వాత బోర్డు తిప్పేయటం లాంటివి తరచూ చోటు చేసుకుంటున్నాయి.
By: Tupaki Desk | 11 Oct 2024 4:28 AM GMTహైదరాబాద్ మహానగరంలో ఇటీవల కాలంలో ఒక మోసం పదే పదే చోటు చేసుకుంటూ ఉంటోంది. ఐటీ కంపెనీలో ఉద్యోగమని పేర్కొంటూ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయటం.. ఆ తర్వాత బోర్డు తిప్పేయటం లాంటివి తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే మరొకటి చోటు చేసుకుంది. మాదాపూర్ లోని ఒక సంస్థ ఈ తరహా మోసానికి పాల్పడి దాదాపు రూ.15 కోట్ల మేర మోసం చేసింది.
దీనిపై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు అందటంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మాదాపూర్ లోని కావూరి హిల్స్ లోని వీవీ ఛాంబర్స్ నాలుగో అంతస్తులో సినర్జీ యూనివర్సల్ పేరుతో ఒక సంస్థను ప్రారంభించారు. ఐటీ కంపెనీగా కలర్ ఇచ్చుకున్నారు. తమకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులు ఉన్నాయని చెబుతూ.. తమ వద్దకు వచ్చిన వారికి జాబ్ కావాలంటే ముందుగా కొంత డబ్బులు చెల్లించాలని పేర్కొన్నారు.
వీరి మాటల్ని నమ్మి.. డిపాజిట్ రూపంలో డబ్బులు కడితే మంచి ఉద్యోగం తమ సొంతమవుతుందన్న ఉద్దేశంతో దాదాపు 500 మంది రూ.3 లక్షల చొప్పున ఉద్యోగం కోసం డబ్బులు కట్టారు. తీరా చూస్తే.. రూ.15 కోట్ల మేర డబ్బులు వసూలు చేసిన సంస్థ.. వారికి ఆఫర్ లెటర్లు ఇచ్చింది. వర్కు ఫ్రం హోం పేరుతో ఇంటి నుంచి జాబ్ చేయాలని పేర్కొంది. జాబ్ ఇచ్చినట్లు చెబుతున్నా.. దానికి సంబంధించిన ఏ పని లేకపోవటం.. జీతాలు ఇవ్వకపోవటంతో ఆఫీసుకు వచ్చి చూడగా.. అక్కడేమీ లేదు. దీంతో మోసపోయినట్లుగా గుర్తించిన బాధితులు మాదాపూర్ పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో.. సంస్థపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.