నవీన్ తో కలిసి 'మైత్రీ' తలుపు తట్టిన అధికారులు.. డోర్ తీసిన రవిశంకర్!
ఆ సంగతి అలా ఉంటే.. మరోపక్క మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఇంటిలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన అనంతరం తమతో పాటు తీసుకుని ఆఫీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 24 Jan 2025 8:33 AM GMTతెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖుల ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం మొదలైన ఈ ఆదాయపు పన్ను శాఖ సోదాలు.. నాలుగో రోజు గురువారం కూడా కొనసాగుతుండటం గమనార్హం. ఈ క్రమంలో తాజాగా ‘మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులో ఐటీ అధికారులు’ అనే అంశం తెరపైకి వచ్చింది.
అవును... మంగళవారం మొదలైన తెలుగు సినీ ప్రముఖుల ఇళ్లల్లోని ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు గురువారం ఉదయం కూడా కొనసాగాయి. ఈ క్రమంలో.. గురువారం ఉదయం దిల్ రాజు నివాసంలో సోదాలు పూర్తి అయిన అనంతరం అతన్ని తమ కారులో ఎక్కించుకుని, శ్రీనగర్ లోని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీసుకు తీసుకెళ్లారు అధికారులు.
ఈ సమయంలో... దిల్ రాజు ఆఫీసులో ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. అప్పటికే ఆయన నివాసంలోనూ, అతని సోదరుడు విజయ సింహారెడ్డి నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి పలు పత్రాలను సీజ్ చేసినట్లు తెలుస్తోంది.
ఆ సంగతి అలా ఉంటే.. మరోపక్క మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఇంటిలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన అనంతరం తమతో పాటు తీసుకుని ఆఫీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే.. అప్పటికే ఆ మైత్రీ ఆఫీసులో నవీన్ భాగస్వామి రవిశంకర్ కూడా ఉన్నారని చెబుతున్నారు. ఈ సమయంలో.. ఇద్దరి సమక్షంలో మైత్రీ ఆఫీసులో సోదాలు జరుగుతున్నాయని సమాచారం.
కాగా... మైత్రీ మూవీ మేకర్స్ నిర్వాహకులు నవీన్, రవిశంకర్ లతో పాటు సీఈఓ చెర్రీ ఇళ్లల్లోనూ, ఆఫీసుల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన "పుష్ప-2" సినిమా ఇటీవల విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఐటి బృందాలు మైత్రీ ఆఫీస్ తలుపుతట్టినట్లు చెబుతున్నారు.