ఆర్జీవీపై తమ్ముళ్ల ఆగ్రహం పీక్స్... అంత మాట అనేశారేంటి?
ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మపై మరికొన్ని ఫిర్యాదులు అందయని తెలుస్తోంది. ఈ నేపథ్యలంలో తాజాగా మరోకేసు నమోదైంది.
By: Tupaki Desk | 21 Nov 2024 11:00 AM GMTసినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై ఇప్పటికే ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవ్వడం.. రెండు సార్లు నోటీసులివ్వడం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి 19నే విచారణకు హాజరవ్వాల్సి ఉండగా వర్మ టైం అడిగారు.. దీంతో ఈ నెల 25న విచారణకు రావాలంటూ మరోసారి వర్మకు నోటీసులు పంపించారు ఒంగోలు పోలీసులు.
మరోపక్క తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆర్జీవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు! దీంతో... ఈ నెల 25న వర్మ ఒంగోలు ప్రయాణంపై తీవ్ర ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి. అయితే అక్కడితో అయిపోలేదు! ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మపై మరికొన్ని ఫిర్యాదులు అందయని తెలుస్తోంది. ఈ నేపథ్యలంలో తాజాగా మరోకేసు నమోదైంది.
అవును.. ఆర్జీవీకి కూడా మొదలైపోయిందనే చర్చకు బలం చేకూర్చే ఘటనలు తాజాగా తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా.. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో కేసు నమోదవ్వడం, దానికి సంబంధించిన నోటీసులు అందించడం, విచారణ తేదీ ఫిక్స్ చేయడం తెలిసిందే. ఈ సమయంలో తాజాగా అనకాపల్లి, కడపలో ఆర్జీవీపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
ఇందులో భాగంగా... అనకాపల్లి జిల్లా రావికమతం పోలీసులకు ఆర్జీవీపై ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణకు రావాలంటూ వర్మకు నోటీసులు పంపించారు. దీనిపై స్పందించిన వర్మ తనకు వారం రోజుల సమయం కావాలంటూ తన తరుపు న్యాయవాదులతో పోలీసులకు కబురు పంపించారు!
ఇదే సమయంలో... కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లోనూ ఆర్జీవీపై ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఐటీడీపీ నేతలు ఆర్జీవీపై ఫిర్యాదులు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్, వంగలపూడి అనితలపై ఆర్జీవీ అసభ్యకరమైన పోస్టులు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళలను కించపరిచేలా అనేక పోస్టులు పెట్టారని పేర్కొన్నారు.
ఈ సమయంలో స్పందించిన ఐటీడీపీ నేతలు.. ఆర్జీవీని కఠినంగా శిక్షించాలని కోరుతూ, అతనిని జనజీవన స్రవంతిలో ఉంచవద్దని.. అరెస్ట్ చేసి అడవులకు తరలించాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేశారు!