Begin typing your search above and press return to search.

ఐటీ ఉద్యోగి దీప్తి కేసులో చెల్లెలు చందన పోలీసుల అదుపులో?

ఇలాంటివేళ.. ఈ కేసును ఛేదించే విషయంలో కీలకంగా మారిన చెల్లెలు చందనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   2 Sep 2023 5:40 AM GMT
ఐటీ ఉద్యోగి దీప్తి కేసులో చెల్లెలు చందన పోలీసుల అదుపులో?
X

సంచలనంగా మారిన ఐటీ ఉద్యోగిని దీప్తి అనుమానాస్పద మరణానికి సంబంధించిన ఉదంతంలో ప్రశ్నలే తప్పించి సమాధానాలు లభించని పరిస్థితి. ఇలాంటివేళ.. ఈ కేసును ఛేదించే విషయంలో కీలకంగా మారిన చెల్లెలు చందనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆమెతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్.. వారికి సహకరించిన కారు డ్రైవర్.. వారికి ఆశ్రయించిన వారిని అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. సంచలనంగా మారిన ఐటీ ఉద్యోగి దీప్తి అనుమానాస్పద మరణం షాకింగ్ గా మారింది.

కోరుట్లలోని భీమునిదుబ్బలో ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాసరెడ్డి.. మాధవి దంపతులు కొన్నేళ్ల క్రితం వచ్చి స్థిరపడిపోయారు. వీరికి 24 ఏళ్ల దీప్తి.. చందన.. సాయి ముగ్గురు సంతానం. దీప్తి ఐటీ ఉద్యోగిగా పని చేస్తున్నారు. వర్కు ఫ్రం హోంలో బాగంగా ఇంటి నుంచే పని చేస్తున్నారు. చందన బీటెక్ పూర్తి చేసి ఇంట్లో ఉండి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తోంది. సాయి బెంగళూరులో ఉంటున్నాడు. బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండటంతో హైదరాబాద్ కు వెళ్లిన దీప్తి తల్లిదండ్రులు.. తర్వాతి రోజు ఇంటికి ఫోన్ చేస్తే.. ఇద్దరు కుమార్తెలు ఫోన్ లిఫ్టు చేయకపోవటంతో ఇంటి దగ్గర ఉన్న వారికి ఫోన్ చేసి.. ఇంటికి వెళ్లి చూడాలన్నారు.

అయితే.. సోఫాలో దీప్తి అచేతనంగా పడిపోయిన వైనాన్ని చూసిన వారు.. దీప్తి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వటం.. పోలీసులు ఎంట్రీ ఇవ్వటం జరిగిపోయాయి. ఈ ఉదంతం సంచలనంగా మారింది. దీప్తి అనుమానాస్పద మరణం గురించి సమాచారం అందుకున్నంతనే.. డీఎస్పీ రవీందర్ రెడ్డి.. కోరుట్ల. మెట్ పల్లి సీఐలు .. ఎస్ఐ లు కలిసి కేసును ఛేధించే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా.. దీప్తి సోదరి చందన.. ఇంట్లో నుంచి ఒక వ్యక్తితో వెళ్లిపోయినట్లుగా సీసీ ఫుటేజ్ కారణంగా గుర్తించారు.

తెల్లవారుజామున 5.12 గంటల సమయంలో బస్టాండ్ కు చేరుకున్న వారు.. కాసేపటి తర్వాత నిజామాబాద్ వెళ్లే బస్సు ఎక్కి వెళ్లినట్లుగా రికార్డు అయ్యింది. మరోవైపు ఇంటిని పరిశీలించగా.. వంటగదిలో మద్యం సీసాలు ఉండటాన్ని గుర్తించారు. ఈ ఉదంతం సంచలనంగా మారిన వేళ.. చందన ఫోన్ నుంచి సోదరుడు సాయికి వాయిస్ మెసేజ్ లు వచ్చాయి. అందులోని అంశాలు మరింత సంచలనంగా మారాయి.

"అరేయ్ సాయి నేను చందక్కనురా. నిజమెంటో చెప్పాలారా. దీప్తిక్క నేను తాగుదామనుకున్నాం. కానీ.. నేను తాగలేదు. అక్కనే తాగింది. నేనునా ఫ్రెండ్ చేత తెప్పించా. అది నేను ఒప్పుకుంటా. కానీ.. అక్కనే తాగింది. తాగిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ ను పిలుస్తా అంది. నేను వద్దన్నా. అయినా పిలుస్తానంటే చివరకు నీ ఇష్టం అన్నా"

"నేను ఇంట్లో నుంచి వెళ్లిపోదామనుకున్నా. అది నిజం. అక్కడి చెప్పి వెళదామనుకున్నా. అక్క హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది. ఫోన్ మాట్లాడి.. సోఫాలో పడుకుంది. రెండుసార్లు లేపాను.. లేవలేదు. సరే పడుకుంది కదా డిస్ట్రబ్ చేయొద్దని వెళ్లిపోయా. ఛాన్స్ దొరికిందని వెళ్లిపోయా. నా తప్పేం లేదు సాయి. నాకు అక్కను చంపే ఉద్దేశం లేదు. నన్ను నమ్ము సాయి. నా తప్పేం లేదు. ప్లీజ్ రా నమ్మురా"

" మేం రెండు బాటిల్స్ తెప్పించుకున్నాం. నేను బ్రీజర్ తాగా. అక్క వోడ్కా తాగింది. తర్వాత ఏమైందో తెలీదు. నేనైతే వెళ్లిపోయిన. ఇట్లా అవుతదని అనుకోలేదు. నేనెందుకు చంపున సాయి.. నేనేందుకు మర్డర్ చేస్తా"

ఇలా దీప్తి చెల్లెలు చందన మాట్లాడిన మాటల ఆడియో క్లిప్ లు బయటకు వచ్చాయి. ఇదిలా ఉంటే.. దీప్తి అనుమానాస్పద మరణం నేపథ్యంలో పోస్ట్ మార్టం నిర్వహించగా.. ఆమె ఎడమ చేయి విరిగినట్లుగా గుర్తించారు. శరీరం మీద గాయాలు ఉన్నట్లుగా తేల్చారు. కిచెన్ లో వోడ్కా.. బ్రీజర్ బాటిళ్లు.. వెనిగర్.. నిమ్మకాయలు ఉండటంతో రాత్రి వేళ దీప్తి.. చందనలు కలిసి మద్యం సేవించారా? లేదంటే వారితో ఇంకెవరు ఉన్నారు? అన్నది ప్రశ్నలుగా మారాయి.

ప్రియుడితో కలిసి చందన ఇంట్లో నుంచి వెళ్లే క్రమంలో గొడవ జరిగిందా? ఆ పెనుగులాటలో తగలకూడని ప్లేస్ లో తగిలి.. ఆమె ప్రాణాల్ని కోల్పోయిందా? అన్నది ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రకాశం జిల్లాలోని ఒక చోట చందనతో పాటు.. మరో ఇద్దరిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించటం లేదు. చందన నోరు విప్పితే కానీ.. ఈ అనుమానాస్పద మరణ మిస్టరీ తీరుతుందని చెబుతున్నారు.