Begin typing your search above and press return to search.

పెళ్లై 15 రోజులు.. అలిపిరి మెట్లు ఎక్కుతూ గుండెపోటుతో మృతి

పెళ్లైన సంతోషం.. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా నడుస్తున్న వేళ.. అనూహ్యంగా గుండెపోటుకు గురయ్యారు.

By:  Tupaki Desk   |   24 Aug 2024 3:54 AM GMT
పెళ్లై 15 రోజులు.. అలిపిరి మెట్లు ఎక్కుతూ గుండెపోటుతో మృతి
X

విన్నంతనే అయ్యో అనిపించే ఉదంతం తిరుమల కాలి మెట్ల బాటలో చోటు చేసుకుంది. పెళ్లై పదిహేను రోజులు మాత్రమే అయిన నవవరుడు కాలిబాట మార్గంలో తిరుమలకు చేరుకోవాలన్న ఉద్దేశంతో కుటుంబసభ్యులతో కలిసి నడుస్తున్న వేళ.. విధి మరోలా తలిచింది. ఐటీ ఉద్యోగి అయిన అతడు గుండెపోటుతో మృత్యువాత పడ్డారు. పెళ్లైన ఆనందంలో ఉత్సాహంగా స్వామి దర్శనం కోసం వెళుతున్న అతడి కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.

తమిళనాడులోని తిరుత్తణి ప్రాంతానికి చెందిన నవీన్ కు 32 ఏళ్లు. ఐటీ ఉద్యోగిగా బెంగళూరులో పని చేస్తున్నాడు. అక్కడే స్థిరపడ్డాడు. పదిహేను రోజుల క్రితమే అతనికి పెళ్లైంది. ఈ నేపథ్యంలో కాలిబాటలో నడుచుకుంటూ వెళ్లి తిరుమలకు చేరుకోవాలన్న ఉద్దేశంతో కుటుంబ సభ్యులతో కలిసి అలిపిరి నుంచి మెట్ల మార్గంలో నడవటం మొదలుపెట్టారు.

పెళ్లైన సంతోషం.. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా నడుస్తున్న వేళ.. అనూహ్యంగా గుండెపోటుకు గురయ్యారు. అలిపిరిలోని 2350 మెట్టు వద్దకు చేరుకున్నంతనే నవీన్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.

దీంతో కంగారు పడిన వారు వెంటనే భద్రతా సిబ్బంది సాయం కోరగా.. అంబులెన్స్ ద్వారా తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. దీంతో.. ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.