అక్కడ ముగుస్తోంది.. ఇక్కడ మైకులు పగులుతాయ్!
అధికార పార్టీ బీఆర్ ఎస్, జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు ఇక్కడ తలపడుతున్నాయి. ఎవరికి ప్రజలు అధికారం ఇస్తారనేది తెలియాల్సి ఉంది.
By: Tupaki Desk | 15 Nov 2023 3:45 AM GMTదేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో ఇప్పటికే ఈశాన్య రాష్ట్ర మిజోరాంలో పోలింగ్ ముచ్చట ముగిసింది. ఇక, ఇప్పుడు నాలుగు రాష్ట్రాలపైనా ప్రధాన జాతీయ పార్టీలు కాన్‌సన్ ట్రేట్ చేశాయి. వీటిలోనూ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోరు తీవ్రంగా ఉంది. అయినప్పటికీ ఆయా రాష్ట్రాల్లో ద్విముఖ పోరే ఉండగా.. తెలంగాణలో అయితే.. త్రిముఖ పోరు కనిపిస్తోంది. అధికార పార్టీ బీఆర్ ఎస్, జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు ఇక్కడ తలపడుతున్నాయి. ఎవరికి ప్రజలు అధికారం ఇస్తారనేది తెలియాల్సి ఉంది.
ఈ క్రమంలో తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ ఎస్ దూకుడుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీలు కూడా ప్రచారంలో ఉన్నప్పటికీ.. ప్రాంతీయ నేతలే ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. దీనికి కారణం.. ప్రధానంగా మధ్య ప్రదేశ్, రాజస్థాన్‌లలో ఈ రెండు పార్టీలు తలపడుతున్నాయి. అధికారం ఇక్కడ కీలకంగా మారింది. మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకు ఈ నెల 17నే ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ప్రచారానికి చాలా తక్కువ సమయం ఉంది. ఈ నెల 15 సాయంత్రంతో ఇక్కడ ప్రచార పర్వానికి తెర పడనుంది. దీంతో కాంగ్రెస్, బీజేపీల అగ్రనాయకులు ఇక్కడే ఎక్కువగా తిష్టవేశారు.
ఇక, ఈ నెల 15 సాయంత్రంతో మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారం ముగిసిపోవడంతో రాజస్తాన్‌పై దృష్టి పెట్టనున్నారు. అయితే.. అదేసయమంలో తెలంగాణలోనూ ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించారు. బీజేపీ అగ్రనాయకులు, కేంద్ర మంత్రులు మధ్యప్రదేశ్‌లోనే ఉన్నారు. వీరంతా బుధవారం రాత్రికి తెలంగాణకు చేరుకునే అవకాశం ఉందని బీజేపీ వర్గాలుచెబుతున్నాయి. ఇక, గురువారం నుంచి వారం రోజుల పాటు.. తెలంగాణలో అవిశ్రాంతంగా బీజేపీ పెద్దలు ప్రచారం చేయనున్నారు. వీరిలో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షా, యూపీ సీఎం యోగి తదితరులు అటు రాజస్థాన్.. ఇటు తెలంగాణలపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టిన నేపథ్యంలో వీరి షెడ్యూల్ కూడా ఖరారు కానుంది.
మోడీ తెలంగాణ మరో 5 నుంచి 8 సభల్లో పాల్గొననున్నారు. ఇక, అమిత్ షా వీటికి రెట్టింపు సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే రాజస్థాన్‌లో బీజేపీ గెలుపు తథ్యమనే అంచనా లు వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో మాత్రం కాంగ్రెస్-బీజేపీల మధ్య అధికారం దోబూచులాడుతోంది. ఇక, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ మరోసారి విజయం దక్కించుకోవడం తథ్యమని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక, మిగిలిన తెలంగాణపైనే నేతలు ఎక్కువగా దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. మొత్తానికి గురువారం నుంచి తెలంగాణలో ప్రచారం హోరెత్తిపోతుందనే అంచనాలు వస్తున్నాయి.