నిజంగా సీపీఎంకు అవమానమేనా ?
అయితే ఎప్పుడైతే అధికారపార్టీతోనో లేకపోతే ప్రధాన ప్రతిపక్ష పార్టీతోనో పొత్తులు కుదుర్చుకోవటం మొదలుపెట్టాయో అప్పటి నుండే ప్రజాసమస్యల మీద ఉద్యమాలు చేయటం తగ్గిపోయాయి.
By: Tupaki Desk | 3 Nov 2023 4:43 AM GMTపొత్తుల పేరుతో సీపీఎంకి జరిగింది నిజంగా అవమానమనే చెప్పాలి. ఇన్నిరోజులు ఏ సంగతి చెప్పకుండా నాన్చి నాన్చి చివరకు గతంలో ఇస్తామని చెప్పిన సీట్ల విషయంలో కూడా కాంగ్రెస్ వెనక్కుపోయిందంటే సీపీఎంకు అవమానం కాక మరేమిటి ? అవమానం జరిగిందనటంలో సందేహంలేదు కానీ ఎందుకింత అవమానం జరిగిందన్నదే అసలు పాయింట్. తెలంగాణాలో అయినా ఏపీలో అయినా కమ్యూనిస్టులంటే ఇపుడు ఎవరికీ పెద్దగా గౌరవం లేదనే చెప్పాలి. కారణం ఏమిటంటే తమంతట తామే జనాల్లో కమ్యూనిస్టు పార్టీలు పలుచనైపోయాయి.
ఒకపుడు ఉభయ కమ్యూనిస్టు పార్టీలంటే జనాల్లో నమ్మకం ఉండేది, ఇతర రాజకీయ పార్టీల్లో ఒక భయం ఉండేది. అయితే ఎప్పుడైతే అధికారపార్టీతోనో లేకపోతే ప్రధాన ప్రతిపక్ష పార్టీతోనో పొత్తులు కుదుర్చుకోవటం మొదలుపెట్టాయో అప్పటి నుండే ప్రజాసమస్యల మీద ఉద్యమాలు చేయటం తగ్గిపోయాయి. దీనికి అదనంగా ప్రభుత్వంలో తమకున్న పలుకుబడిని ఉపయోగించుకుని వ్యక్తిగత ప్రయోజనాలు అందుకోవటం ఎక్కువైపోయాయి.
చాలామంది కమ్యూనిస్టు నేతలపై అవినీతి ఆరోపణలు విపరీతంగా వచ్చేశాయి. దాంతో జనాల్లో ఎర్రన్నలపై నమ్మకం పోయింది. ఏ పార్టీలనైతే బూర్జువా పార్టీలని ఆరోపిస్తున్నాయో ఆ పార్టీతోనే వివిధ కారణాలతో అంటకాగటం ఎక్కువపోయింది. అందుకనే ఉద్యమాలకు దూరంగా జరిగాయి. ఎప్పుడైతే ఉద్యమాలకు, ప్రజా సమస్యలపై ఆందోళనలకు వాపక్షాలు దూరంగా జరిగాయో జనాల్లో నమ్మకాన్ని కోల్పోయాయి. ఇదే సమయంలో రాష్ట్రవిభజన జరగటం మరో నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇలాంటి అనేక కారణాల వల్ల ఇపుడు కమ్యూనిస్టు పార్టీలు ప్రాభవం కోల్పోయాయి.
అందుకనే ప్రధాన పార్టీలకు బాగా చులకనైపోయాయి. ఈకారణంగానే మునుగోడు ఉపఎన్నికలో కమ్యూనిస్టు పార్టీలతో కేసీయార్ ఒప్పందం చేసుకుని కూడా తర్వాత కాదు పొమ్మన్నారు. ఇపుడు కాంగ్రస్ కూడా దాదాపు అదే దారిలో నడుస్తోంది. అందుకనే 17 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించింది సీపీఎం. ఇపుడు కమ్యూనిస్టు పార్టీల పరిస్ధితి ఎలాగైపోయిందంటే ఏ నియోజకవర్గంలోను సొంతంగా గెలిచేంత పరిస్ధితి లేదు. అయితే ప్రత్యర్ధుల్లో ఎవరినో ఒకళ్ళని ఓడగొట్టేందుకు మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో వాటి బలం సరిపోతుందని చెప్పాలి. పరిస్ధితి ఇలాగే కంటిన్యు అయితే ఓడగొట్టేంత సీను కూడా కోల్పోవటం ఖాయమనే అనిపిస్తోంది.