Begin typing your search above and press return to search.

జగన్ వాటిని మరచి పోవాల్సిందే !

ఆ మాటకు వస్తే ఏ రంగంలో అయినా గెలుపు ఓటముల మధ్య నిత్య పోరాటమే ఉంటుంది.

By:  Tupaki Desk   |   14 Jun 2024 3:30 PM GMT
జగన్ వాటిని మరచి పోవాల్సిందే !
X

మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ భవిష్యత్తు బాగుంటుందని నేతలకు హిత బోధ చేస్తున్నారు. అది మంచిదే సానుకూల దృక్పధం ఉండాల్సిందే. ఓటమి నుంచే ఎవరైనా విజయానికి బాటలు వేసుకోగలుగుతారు. పడి లేచిన కెరాటాలు జీవితంలోనూ రాజకీయాల్లోనూ ఎన్నో కనిపిస్తాయి. ఆ మాటకు వస్తే ఏ రంగంలో అయినా గెలుపు ఓటముల మధ్య నిత్య పోరాటమే ఉంటుంది.

ఇదిలా ఉంటే వైసీపీ ఆ పార్టీ చరిత్రలో కనీ వినీ ఎరగని విధంగా ఓటమి పాలు అయింది. 151 సీట్లు ఎక్కడ 11 సీట్లు ఎక్కడా అన్నది చూడాలి. ఆకాశ విహారం నుంచి పాతాళ కుహరానికి పడినట్లు అయింది. కనీసం ప్రతిపక్ష స్థితికి సరిపడా 18 ఎమ్మెల్యే సీట్లు రాలేదు. దాంతో వైసీపీ పరిస్థితి ఇపుడు రాజకీయంగా అత్యంత దయనీయంగా ఉందనే అంటారు. అటువంటి నేపధ్యంలో మళ్ళీ మొదటి నుంచి అడుగులు వేసుకోవాలి. ప్రయాణం ఒకటో అడుగు నుంచి మొదలెట్టాలి.

గతంలో చేసిన పొరపాట్లను వల్లె వేసుకుని తిరిగి వాటిని పునరావృత్తం కాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. దానికి లోతైన అధ్యయనం అవసరం. నిజాయితీతో కూడిన విశ్లేషణ ఇంకా అవసరం. నిష్పాక్షికంగా పోస్ట్ మార్టం జరగాలి. కానీ వైసీపీలో అటువంటిది జరుగుతోందా అన్నదే చర్చగా ఉంది. జగన్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. మళ్ళీ మనదే అధికారం అంటున్నారు. అంతవరకూ బాగానే ఉన్నా అధికారం ఊరకే రాదు. తప్పులు సరిదిద్దుకోకుండా జనం వద్దకు వెళ్తే ఉపయోగం ఉండదనే అంటున్నారు.

జగన్ తాజా సమీక్షలలో మాట్లాడుతున్న మాటలు మరీ ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్సీల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఓటమి నుంచి తగినంత సారాన్ని తీసుకున్నట్లుగా అనిపించదు అని అంటున్నారు.

టీడీపీ కూటమి వైఫల్యాల మీదన వైసీపీ అధికార సోపానాలు నిర్మించుకోవాలన్న ఆరాటమే కనిపిస్తోంది. చంద్రబాబు వరసగా పాపాలు చేస్తారు అవి పండిన నాడు వైసీపీకే అధికారం అని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. అంటే ప్రభుత్వ వ్యతిరేకత తనకు అందలం తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నారు.

నిజమే యాంటీ ఇంకెంబెన్సీ ప్రతిపక్షానికి కలసి వస్తుంది. కానీ అదొక్కటే చాలదు కదా పార్టీ పరంగా తగిన విధంగా చికిత్స అవసరం కదా అన్న మాట వినిపిస్తోంది. అది కూడా కాయకల్ప చికిత్స అవసరం అని అంటున్నారు. చంద్రబాబు వైసీపీ వ్యతిరేకతను తమ విజయానికి బాటలుగా మార్చుకున్నారు.అదే సమయంలో ఏ ఏ వర్గాలకు దూరం అయ్యామో వారిని తిరిగి చేరువ చేసుకున్నారు. పొత్తులు కలుపుకున్నారు. ఎన్నో ఎత్తులు వేసి మరీ అందలం ఎక్కారు.

మరి వైసీపీలో అలాంటి పరిస్థితి ఉంటుందా అన్నదే చర్చ. నలభై శాతం ఓటు బ్యాంక్ మన వైపే ఉందని పది శాతమే తేడా కొట్టి ఓటమి పాలు అయ్యామని జగన్ అంటున్నారు. ఒక్క ఓటు అయినా ఓటమిని డిసైడ్ చేస్తుంది. పది శాతం అంటే చిన్న విషయం కాదు. ఆ ఓటు బ్యాంక్ లోనే చాలా వర్గాలు ఉన్నాయి.

వారి విశ్వాసాన్ని తిరిగి పొందాలి. అంతే కాదు పార్టీ క్యాడర్ లో ధీమా కలిగించాలి. నాయకులకు అందుబాటులో ఉండాలి. పార్టీ మాది అన్న భావన అందరిలో కలిగేలా చూసుకోవాలి. కానీ జగన్ లో ఓటమి వల్ల వశ్చాతాపం ఎక్కడా కలిగినట్లుగా లేదని అంటున్నారు.

తప్పులు జరిగాయి. వైసీపీ హయాంలోనూ బోలెడు పాపాలు చోటు చేసుకోవడం వల్లనే 151 సీట్ల నుంచి 11 కి పడిపోయామని జగన్ గ్రహించడం లేదు అని అంటున్నారు. చంద్రబాబు పాపాలను లెక్కబెట్టే ముందు వైసీపీ అయిదేళ్లలో చేసిన పాపాలను కూడా చూసుకోవాలి కదా అన్న సూచనలు వస్తున్నాయి. వైసీపీ అధినేత ఎంతసేపూ 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు సంక్షేమం ఇచ్చామని చెబుతున్నారు. అలాగే తొంబై శాతం మ్యానిఫెస్టోని అమలు చేశామని చెబుతున్నారు.

ఇపుడు వాటి మీదనే కదా జనాలు తీర్పు ఇచ్చింది. అందువల్ల ఆ విషయాలను ఆయన మరచిపోవడం మంచిది. వైసీపీ కంటే టీడీపీ సంక్షేమం ఎక్కువ చేస్తానని అంటోంది. అందువల్ల ఆ నంబర్ ని వల్లించడం వేస్ట్ తప్ప మరేమీ కాదు. తమ పాలనలో ఒప్పు ఉంది అనుకున్న వారే ఓట్లేశారు కాబట్టే 40 శాతం ఓటు బ్యాంక్ వచ్చింది. తప్పు అనుకున్నందునే పది శాతం ఓటు షేర్ పోయింది. ఇపుడు ఆ తప్పు అనుకున్న అంశాల మీద దృష్టి పెట్టాలి తప్ప ఇంకా పాత విషయాలే చెబుతూ తాము ఎంతో చేశామని గొప్పలు చెప్పుకుంటే ఉపయోగం ఏమిటి అని అంటున్నారు.

వైసీపీ రాజకీయ భవిష్యత్తు బాగుండాలీ అంటే జగన్ పూర్తిగా మారాలని అంటున్నారు. అంతే కాదు ఓటమికి దారి తీసిన పరిస్థితులు పూర్తిగా విశ్లేషించుకుంటు ముందుకు సాగాలని కోరుతున్నారు. మరి ఆ దిశగా అడుగులు పడతాయా లేదా అన్నది కాలమే చెప్పాలని అంటున్నారు.