Begin typing your search above and press return to search.

ప్రముఖ దేవాలయాలకు ఐటీ షాక్‌!

ఈ మేరకు ఆదాయపు పన్ను కట్టాలంటూ కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి, వేములవాడ రాజరాజేశ్వరస్వామి, బాసర సరస్వతి ఆలయాలకు నోటీసులు ఇచ్చింది.

By:  Tupaki Desk   |   5 Oct 2023 10:51 AM GMT
ప్రముఖ దేవాలయాలకు ఐటీ షాక్‌!
X

ప్రతిసారీ వ్యక్తులు, కంపెనీలపై దృష్టి సారించే ఆదాయ పన్ను శాఖ ఈసారి దేవాలయాలపై పడింది. ఆదాయ పన్ను చెల్లించడం లేదంటూ వ్యక్తులు, ఆఫీసులపై సోదాలు చేసే ఐటీ అధికారులు ఈసారి ప్రముఖ దేవాలయాలకు షాక్‌ ఇచ్చారు.

తెలంగాణలోనే ప్రముఖ దేవాలయాలుగా కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి ఆలయం, బాసర సరస్వతి దేవీ ఆలయం, వేములవాడ శ్రీరాజరాజశ్వేర స్వామి దేవాలయాలు పేరుగాంచాయి. ఈ నేపథ్యంలో ఈ దేవాలయాలకు ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆదాయపు పన్ను కట్టాలంటూ కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి, వేములవాడ రాజరాజేశ్వరస్వామి, బాసర సరస్వతి ఆలయాలకు నోటీసులు ఇచ్చింది. దీంతో ఇప్పుడీ అంశం హాట్‌ టాపిక్‌ గా మారింది.

కాగా ఐటీ శాఖ జాబితాలో కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయం తొలి స్థానంలో ఉందని చెబుతున్నారు. రూ. 8 కోట్ల ట్యాక్స్‌ కట్టాలని, సకాలంలో పన్ను కట్టనందువల్ల మరో రూ. 3 కోట్ల జరిమానా కూడా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొనడం గమనార్హం.

ఐటీ రిటర్న్‌లు, 12ఏ రిజిస్ట్రేషన్‌ గడువు గత నెల 30వ తేదీతో ముగిసినా దేవాలయ అధికారులు స్పందించకపోవడంతో ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. రిటర్న్స్, 12ఏ రిజిస్ట్రేషన్‌ చేయించుకోకపోవడంతో ఈ నోటీసులను ఇచ్చారని సమాచారం.

1995 నుంచి ఇప్పటివరకు కొమురవెల్లి దేవస్థానం అధికారులు ఆదాయపు పన్ను శాఖకు ఐటీ రిటర్న్స్‌ సమర్పించలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో 1995 నుంచి ఐటీ రిటర్న్‌ లు, ఆడిట్‌ వివరాలు సమర్పించాలని ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ అధికారుల నిర్లక్ష్యంతోనే ఐటీ నోటీసులు జారీ అయినట్లు అధికారులు పేర్కొన్నారు.

అదే విధంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి కూడా ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. లెక్క ప్రకారం ఆదాయ పన్నును చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసింది. అలాగే బాసరలోని సరస్వతి దేవీ ఆలయంతో పాటు ఇంకా పలు దేవాలయాలకు కూడా నోటీసులు అందాయని చెబుతున్నారు.

మరోవైపు ఆలయాలకు ఐటీ నోటీసులు ఇవ్వడంపై భక్తులు మండిపడుతున్నారు. వ్యాపార సంస్థలు, వ్యక్తుల విషయంలో వ్యవహరించినట్టు ఆలయాలపైనా కఠిన వైఖరిని అవలంబించడం సరైన విధానం కాదని దుమ్మెత్తి పోస్తున్నారు. కోట్ల రూపాయలు పన్నులు ఎగ్గొట్టే వ్యాపారులను వదిలిపెట్టి ఆధ్యాత్మిక కేంద్రాలుగా భాసిల్లుతున్న దేవాలయాలకు పన్ను కట్టాలని నోటీసులు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.