ఆ పొగాకు కంపెనీ టర్నోవర్ రూ.20కోట్లు.. కార్ల విలువ రూ.50కోట్లు
దేశంలో అతి పెద్ద కంపెనీల్లో బంశీధర్ గ్రూప్ ఒకటిగా చెబుతారు. లెక్కకు మించిన ఆస్తులు ఉన్నట్లుగా చెబుతున్నారు.
By: Tupaki Desk | 2 March 2024 4:56 AM GMTసంచలనంగా మారింది ఒక టబాకో కంపనీలో జరిపిన ఐటీ దాడులు. భారీ ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారన్న ఆరోపణల్ని ఎదుర్కొంటోంది బంశీధర్ గ్రూపు. ఈ పొగాకు కంపెనీపై ఇటీవల ఐటీ దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. ఢిల్లీ.. ఉత్తరప్రదేశ్.. గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఈ సోదాల్ని నిర్వహించారు. ఈ గ్రూపు వారసుడు ఢిల్లీలోని వసంత్ విహార్ లో ఉంటారు. అతడి పేరు శివమ్ మిశ్రా. అతడి ఇంటిని అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఇంతకీ ఈ బంశీధర్ గ్రూప్ చేసే బిజినెస్ ఏమంటే.. పలు ప్రముఖ పాన్ మసాలా కంపెనీలకు అవసరమైన పొగాకు సరఫరా చేస్తుంది. దేశంలో అతి పెద్ద కంపెనీల్లో బంశీధర్ గ్రూప్ ఒకటిగా చెబుతారు. లెక్కకు మించిన ఆస్తులు ఉన్నట్లుగా చెబుతున్నారు. అధికారిక పత్రాల్లో ప్రస్తావించే లెక్కలకు.. వాస్తవానికి ఏ మాత్రం పొంతన లేదని తెలుస్తోంది. ఏక కాలంలో ఈ గ్రూప్ నకు సంబంధించి సంబంధాలు ఉన్న వారిపై 15-20 టీంలు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున బయటపడిన విలాసవంతమైన కార్ల కారణంగా జాతీయస్థాయిలో ఈ ఐటీ రైడ్లకు ప్రాధాన్యత లభించింది.
ఈ సందర్భంగా వారంతా అవాక్కు అయ్యేంత లగ్జరీ అతడి ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. పొగాకు కంపెనీ వార్షిక టర్నోవర్ రూ.20 నుంచి రూ.25 కోట్లు మాత్రమే అధికారిక లెక్కల్లో చెబుతుంటే.. సదరు కంపెనీ యజమాని వారసుడు వాడే విలాసవంతమైన కార్ల విలువ రూ.50కోట్లకు పైనే ఉండటం హాట్ టాపిక్ గా మారింది.
ఈ కార్ల జాబితాలో లంబోర్గిని.. మెక్ లారెన్.. రోల్స్ రాయిస్.. ఫాంటమ్.. ఫోర్షె లాంటి పలు లగ్జరీ కార్లు ఉన్నట్లుగా గుర్తించారు. అంతేకాదు.. అతడి నివాసంలో రూ.4.5 కోట్ల నగదు.. పలు పత్రాల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడిగా గ్రూప్ అధినేత కేకే మిశ్రా పేరు వినిపిస్తోంది. తాజా అంచనాల ప్రకారం చూస్తే సంస్థ వార్షిక టర్నోవర్ దాదాదాపు రూ.150 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు.