Begin typing your search above and press return to search.

తెల్లవారుజాము కలకలం.. పొంగులేటి ఇంట్లో ఐటీ.. ఈడీ సోదాలు

పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరటం తెలిసిందే. తాజాగా ఆయన నివాసంలో ఐటీ.. ఈడీ సోదాలు జరగటం కలకలాన్ని రేపుతోంది.

By:  Tupaki Desk   |   9 Nov 2023 4:08 AM GMT
తెల్లవారుజాము కలకలం.. పొంగులేటి ఇంట్లో ఐటీ.. ఈడీ సోదాలు
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార.. విపక్ష నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు.. విమర్శలు.. ప్రతి విమర్శలతో వాతావరణం వేడెక్కింది. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోడీ సైతం హాజరు కావటం.. వారం వ్యవధిలో రెండుసార్లు తెలంగాణలో పర్యటించేలా ఆయన షెడ్యూల్ సెట్ కావటం చూస్తే.. తెలంగాణపై బీజేపీ బలంగా ఫోకస్ చేసినట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఆ మధ్యన అధికార బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. పెద్ద ఎత్తున చర్చలు జరిపిన ఖమ్మం జిల్లా నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరటం తెలిసిందే. తాజాగా ఆయన నివాసంలో ఐటీ.. ఈడీ సోదాలు జరగటం కలకలాన్ని రేపుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా పాలేరు బరిలో నిలిచిన ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించటం ఇప్పుడు సంచలనంగా మారింది.

గురువారం తెల్లవారుజామున మూడు గంటల వేళలో పొంగులేటి ఇంటికి ఐటీ.. ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఖమ్మంలోని ఆయన ఇంటికి వచ్చిన అధికారులు.. పొంగులేటి ఇంట్లోకి ప్రవేశించారు. మొత్తం ఎనిమిది వాహనాల్లో వచ్చిన అధికారులు ముకుమ్మడిగా పొంగులేటి ఇంట్లోకి వెళ్లి.. వారి సెల్ ఫోన్లు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. పొంగులేటి ఈ రోజు నామినేషన్ వేయనున్నారు. ఇలాంటి వేళ.. ఇలాంటి పరిణామం చోటు చేసుకోవటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. తనపై ఐటీ దాడులు జరగొచ్చని బుధవారమే వ్యాఖ్యలు చేశారు. తన ఇంటికి ఐటీ అధికారులు వచ్చి.. సోదాలు నిర్వహిస్తారంటూ వ్యాఖ్యానించిన కొన్ని గంటల వ్యవధిలోనే.. గురువారం తెల్లవారుజాము ప్రాంతంలో ఇంత భారీగా అధికారులు ఇంట్లోకి ప్రవేశించి.. సోదాలు నిర్వహిస్తున్న వైనం తాజాగా పెను సంచలనంగా మారింది. దీనిపై పొంగులేటి ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.