Begin typing your search above and press return to search.

బాబుకు కాళింగ సెగలు...?

దాంతో ఇంతటి మెజారిటీ చూశాక ఎవరూ నోరెత్త లేని వాతావరణం ఉంది.

By:  Tupaki Desk   |   28 Jun 2024 3:38 AM GMT
బాబుకు కాళింగ సెగలు...?
X

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరూ అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేయడానికి సాహసించే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుచేతనంటే టీడీపీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతో ఇంతటి మెజారిటీ చూశాక ఎవరూ నోరెత్త లేని వాతావరణం ఉంది.

అందుకే చంద్రబాబు కూడా తన వ్యూహాలకు పదును పెట్టారు. ఇంతకు మించిన తరుణం వేరొకటి లేనేలేదని భావించారు. తనకు నచ్చిన తీరులో మంత్రివర్గం కూర్పు చేశారు. సీనియర్లను పక్కన చాలా ఈజీగా పెట్టగలిగారు. ఎవరూ కూడా బాబు నిర్ణయాలను బాహాటంగా ఎదిరించలేని పరిస్థితి నెలకొంది.

అయితే ఉత్తరాంధ్రాలో చంద్రబాబు సామాజిక తూకంలో కొంత తేడా ఉందని మొదటి నుంచి మాట వినిపిస్తోంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో తూర్పు కాపులు కాళింగులు అత్యధిక సంఖ్యలో ఉండగా కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి పదవులను కింజరాపు కుటుంబానికే బాబు ఇచ్చారు. దాంతో లోలోపల అసంతృప్తి అలా పెరిగిపోతోంది.

తూర్పు కాపులు కాళింగులు తమకు చాన్స్ ఇస్తారని ఆశించారు. అబ్బాయి కింజరాపు రామ్మోహన్ కేంద్ర మంత్రి అయ్యారు కాబట్టి బాబాయ్ అచ్చెన్నాయుడుని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉంచి ఈ రెండు సామాజిక వర్గాలకు న్యాయం చేస్తారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా అచ్చెన్నాయుడుకు మంత్రి పదవిని బాబు ఇచ్చారు.

దాంతో ఆనాటి నుంచి కాళింగ సామాజిక వర్గం రగిలిపోతోంది. వారు మీడియా ముందుకు వచ్చి మరీ ఉత్తరాంధ్రా జిల్లాలతో పాటు గోదావరి జిల్లాలకు విస్తరించి ఉన్న తమ సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాట్సప్ గ్రూపులలోనూ వారు ఏకంగా టీడీపీ అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరో వైపు తూర్పు కాపులూ మండిపోతున్నారు

ఈ నేపధ్యంలో కాళింగ సామాజిక వర్గానికి చెందిన ఆముదాలవలస సీనియర్ ఎమ్మెల్యే కూన రవికుమార్ తన అసమ్మతిని బాహాటంగానే వ్యక్తం చేశారు అని అంటున్నారు. ఆయన తనకు రక్షణగా ప్రభుత్వం ఇచ్చిన గన్ మెన్లను వెనక్కి పంపించేసారు. తనకు ఏ రకమైన భయాలూ లేవని తనను ఎవరూ ఏమీ చేయలేరని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

తాను ప్రతిపక్షంలో ఉన్నపుడూ ఎలాంటి బెదురూ లేకుండా పోరాడిన వాడిని అని ఆయన గుర్తు చేశారు. తనకు ఎవరూ శత్రువులు లేరని ఆయన అంటున్నారు. తాను ఒక సాధారణ ఎమ్మెల్యేగా ప్రజలకు ఇంకా దగ్గరగా ఉంటూ ప్రజా సేవ చేస్తానని కూన రవికుమార్ స్పష్టం చేశారు. కూన రవికుమార్ ఈ విధంగా తన బాధను ఆవేదనను వ్యక్తం చేసారు అని అంటున్నారు. మంత్రి పదవి దక్కనందుకు కూన ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇది టీడీపీలో రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. దీని మీద చంద్రబాబు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.