తెలంగాణలో ఐటీ పరుగులు.. బెంగళూరును దాటేశాం: కేటీఆర్
ఈ సందర్భంగా ఐటీ ఉద్యోగులను, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌ను, ఉన్నత తరగతి వ్యక్తులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు.
By: Tupaki Desk | 14 Nov 2023 1:00 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు బీఆర్ ఎస్ కీలక నాయకుడు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు అన్ని టీవీ చానెళ్లకు ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మరోవైపు సదస్సులకు కూడా హాజరువుతున్నారు. తాజాగా కేటీఆర్ టీబీఎఫ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీ ఉద్యోగులను, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌ను, ఉన్నత తరగతి వ్యక్తులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు.
ఐటీ రంగంలో తెలంగాణ దూకుడు ప్రదర్శిస్తోందని కేటీఆర్ చెప్పారు. నిన్న మొన్నటి వరకు సెకండ్ ప్లేస్‌లో ఉన్న తెలంగాణ ఇప్పుడు ముందంజలో ఉందన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరును కూడా ఈ రంగంలో అధిగమించామని చెప్పారు. ఐటీ ఎగుమతులు, ఉత్పత్తులు, ఉద్యోగ కల్పన వంటి కీలక రంగాలపై కేటీఆర్ నిశితంగా మాట్లాడారు. ప్రతి విషయాన్ని అంకెలు, వివరాలతో వెల్లడించారు. కేటీఆర్ చెప్పిన దాని ప్రకారం.. బెంగళూరు కంటే కూడా తెలంగాణ(హైదరాబాద్) ముందంజలో ఉంది.
గత ఏడాది దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో 4.50 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని కేటీఆర్ చెప్పారు. వీటిలో ఒక్క బెంగళూరు లో 1.46 లక్షల ఉద్యోగాలు లభించాయన్నారు. అయితే, అదేసమయంలో హైదరాబాద్‌లో 1.50 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని.. బెంగళూరుకన్నా 4 వేల మంది అధికంగా ఇక్కడ ఉద్యోగాలు పొందారని ఆయన వివరించారు.
ఇక, ఐటీ రంగం ఎగుమతుల్లో తెలంగాణ రికార్డు నెలకొల్పిందని కేటీఆర్ వెల్లడించారు. 2014లో తెలంగాణ ఆవిర్భావం వరకు అంటే.. గడిచిన 25 ఏళ్లలో 55 వేల కోట్ల రూపాయల ఎగుమతులు జరిగాయన్నారు. అయితే.. 2022-23 ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 57 వేల కోట్ల రూపాయల మేరకు ఐటీ ఎగుమతులు జరిగాయని వివరించారు. ఇదంతా కేసీఆర్ దూరదృష్టి, ఐటీ రంగానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం వల్లే సాకారమైందని కేటీఆర్ వివరించారు. 1989లోనే హైదరాబాద్‌కు తొలిఐటీ కంపెనీ `ఇంటర్ గ్రాఫ్` వచ్చినట్టు మంత్రి పేర్కొన్నారు. మొత్తానికి ఐటీ ఉద్యోగులను ఆకట్టుకునేందుకు కేటీఆర్ వెల్లడించిన గణాంకాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.