పాపం.. అంత సీనియర్ నేతను పక్కన పెట్టేశారే: కాంగ్రెస్‌లో లుకలుక!
ఇదే విషయాన్ని ముందుగానే చెప్పి ఉంటే.. తన దారి తాను చూసుకునేవాడినని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
By: Tupaki Desk | 7 Nov 2023 12:30 PM GMTఆయన సీనియర్ మోస్టు నాయకుడు, పైగా గతంలో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ కోసం.. అహరహం శ్రమించారు. అంతేకాదు, వివాద రహిత నాయకుడు కూడా. కానీ, ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఆయన ప్రస్తావన కూడా ఎక్కడా కనిపించడం లేదు. కనీసం ఆయనకు ప్రాధాన్యం కూడా దక్కలేదు. ఆయనే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దామోదర రాజనరసింహ.
ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు మూడు జాబితాలు విడుదల చేయగా.. ఈ మూడింటిలోనూ .. రాజనరసింహకు ఎక్కడా చోటు దక్కలేదు. పైగా ఆయన సూచించిన వారికి కూడా ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. దీంతో రాజనరసింహ పరిస్థితి దారుణంగా మారింది. ఇదే విషయాన్ని ముందుగానే చెప్పి ఉంటే.. తన దారి తాను చూసుకునేవాడినని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అని కూడా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌కు రిజైన్ చేయనున్నట్టు కొంతమంది చెబుతున్నారు.
ఏం జరిగింది?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ.. తనతో పాటు.. తన అనుచరులు ఇద్దరికి టికెట్ లు ఇవ్వాలని సూచించారు. కానీ, కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, పటాన్ చెరులలో సీట్ల కేటాయింపు విషయమై రాజనర్సింహ ముందుగానే కాంగ్రెస్‌ను కోరారు. నారాయణఖేడ్ నుండి సంజీవరెడ్డికి, పటాన్ చెరు నుండి శ్రీనివాస్ గౌడ్‌కు టిక్కెట్లు కేటాయించాలని కోరారు.
అయితే.. ఆయనకే కాకుండా.. ఆయన సూచించిన వారికి కూడా కాంగ్రెస్ టికెట్లు ఇవ్వలేదు. అంతేకాదు.. ఆయా స్థానాల్లో వేరే వారికి టికెట్లు ఇచ్చేసింది. పటాన్‌చెరు టిక్కెట్‌ను నీలం మధుకు కేటాయించింది. ఈయన ఇటీవల కాంగ్రెస్లో చేరారు. దీంతో రాజనర్సింహ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన ముఖ్య అనుచరులతో సమావేశానికి తెరదీశారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతుంది.