ఇదేం తొందర? చంద్రబాబును గుర్తుకు తెస్తున్న కేటీఆర్!
తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల సమయాన్ని తీసుకుంటే.. అవసరానికి మించి మాట్లాడిన కేటీఆర్ కారణంగా.. గులాబీ పార్టీలోని ఎంతో మంది నేతలు తలలు పట్టుకున్న పరిస్థితి.
By: Tupaki Desk | 14 Dec 2023 4:00 AM GMTఅన్నింటికి తొందరపాటు పనికి రాదు. అందునా టైం బాగోలేప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయాల్లో ఉన్న వారి నోటి నుంచి వచ్చే మాటకు ఉండే విలువ అంతా ఇంతా కాదు. ఆచితూచి అన్నట్లుగామాట్లాడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల సమయాన్ని తీసుకుంటే.. అవసరానికి మించి మాట్లాడిన కేటీఆర్ కారణంగా.. గులాబీ పార్టీలోని ఎంతో మంది నేతలు తలలు పట్టుకున్న పరిస్థితి. ఆయన మాటలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణమైందన్న మాట పలువురి నోట వినిపించింది.
అలాంటి కేటీఆర్.. అధికారం చేజారి.. మంత్రి కాస్తా మాజీ మంత్రిగా మారిన తర్వాత కూడా మార్పు రాలేదా? అంటే రాలేదనే మాట వినిపిస్తోంది. తాజాగా ఆయన మీడియాతో చిట్ చాట్ పెట్టారు.ఈ సందర్భంగా ప్రభుత్వం మీద అంతలా విమర్శల్ని సంధించాల్సిన అవసరం ఏముంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సరిగ్గా వారం కాలేదు. అప్పుడే.. ప్రభుత్వం మీద విమర్శలు సంధించటంలో అర్థం లేదన్న మాట వినిపిస్తోంది.
అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి గతంలో ఏడాది వరకు విపక్షాలు చూస్తుండేవి. మీడియా సైతం ఏడాది.. ఏడాదిన్నర వరకు ఘాటు విమర్శలకు పోకుండా.. వేచి చూసే ధోరణిని ప్రదర్శించేది. ఇప్పుడు అదంతాపోయి.. అధికారం చేజారిన వారానికే ప్రభుత్వం మీద విమర్శలు సంధించటం.. సరికాదన్న మాట వినిపిస్తోంది. కాస్త ఎదురుచూసే ధోరణిని కేటీఆర్ అలవర్చుకుంటే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది.
వారానికే ప్రభుత్వ నిర్ణయాల మీద విరుచుకుపడటంలో అర్థం లేదంటున్నారు. అప్పుల గురించి తాము అసెంబ్లీలో ఎప్పుడో చెప్పామంటున్న కేటీఆర్.. పౌరసరఫరాల శాఖలో ఇంత భారీగా అప్పు ఉందన్న విషయాన్ని ఎప్పుడు చెప్పారని ప్రశ్నిస్తున్నారు. రైస్ మిల్లర్లకు ధాన్యాన్ని ఎలాంటి గ్యారెంటీ తీసుకోకుండా లక్షల టన్నుల ధాన్యాన్ని ఉంచేసిన విషయాన్ని ప్రభుత్వం ఎప్పుడు చెప్పింది? అని ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు.. ధరణి కింద అప్లై చేసుకున్న డబ్బుల్ని ప్రైవేటు సంస్థకు వెళ్లిపోవటం.. ప్రభుత్వానికి కూడా తిరిగి రాకపోవటం వెనుకున్న మతలబు ఏమిటి? అన్న సందేహం గురించి కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడూ చెప్పలేదని.. మరి వాటి సంగతేమిటి? అంటూ కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. అందుకే తొందరపడి నాలుగు మాటలు అంటే.. నలభై మాటలు ఎదురు మాటలు పడాలన్న మాటను కేటీఆర్ ఎందుకు మిస్ అవుతున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.