Begin typing your search above and press return to search.

టీడీపీ - బీజేపీ పొత్తు.. ఐవైఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాజాగా ఇదే విషయంపై ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ఏపీ బీజేపీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు.

By:  Tupaki Desk   |   10 March 2024 6:12 AM GMT
టీడీపీ - బీజేపీ పొత్తు.. ఐవైఆర్  ఆసక్తికర వ్యాఖ్యలు!
X

టీడీపీ - బీజేపీ పొత్తు ప్రకటన చేసి ఇంకా 24 గంటలు కూడా గడవకముందే ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పొత్తుపై కమ్యునిస్టులు విరుచుకుపడుతుంటే... మాకొచ్చిన ఇబ్బందేమీ లేదు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నట్లుగా వైసీపీ నేతలు రియాక్ట్ అవుతున్నారు. ఇక ఈ పొత్తుకు గల కారణాలపై టీడీపీ, బీజేపీ లనుంచి వచ్చిన భిన్న స్టేట్ మెంట్స్ పై ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికరంగా స్పందించారు.

అవును... సుమారు దశాబ్ధ కాలం తర్వాత ఏపీలో మరోసారి టీడీపీ - బీజేపీ జతకట్టాయి. వాస్తవానికి ఆ రెండు పార్టీలూ జతకట్టడం ఇదే తొలిసారి కాదు. 1999లో జతకట్టి గెలవగా.. 2004లో ఓటమిపాలయ్యాయ్యి. ఇదే క్రమంలో 2014లో తిరిగి జతకట్టి గెలవగా... 2024లో ఏమవుతాదనేది వేచి చూడాలి! ఆ సంగతి అలా ఉంటే... ఈ పొత్తుకోసం ఎవరు ఎవరిని అడిగారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

తాజాగా ఇదే విషయంపై ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ఏపీ బీజేపీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఈ సందర్భంగా.. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు బంధం ఎంతకాలం కొనసాగుతుందనే విషయంపై ఆసక్తికరంగా స్పందించారు.. స్పష్టత ముఖ్యమని వెల్లడించారు. ఇదే సమయంలో ఈ బంధం సుదీర్ఘ కాలం నిలవాలనే రెండు పార్టీలూ కోరుకుంటే.. ఎటువంటి గందరగోలానికీ అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలని సున్నితంగా హెచ్చరించినంత పనిచేశారు!

ఈ సందర్భంగా... "ఎన్డీయే కుటుంబంలో చేరాలని.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని మనస్పూర్తిగా స్వాగతిస్తున్నాను. ప్రధాని మోడీ దార్శనిక నాయకత్వంలో బీజేపీ, టీడీపీ, జనసేనలు దేశ పురోగతి, రాష్ట్ర అభ్యున్నతి కోసం కట్టుబడి పనిచేస్తాయి" అని జేపీ నడ్డా వ్యాఖ్యానించినట్లు ఉన్న పేపర్ కటింగ్ ను ట్వీట్ చేసిన ఐవైఆర్ దానిపై రియాక్ట్ అయ్యారు.

ఇందులో భాగంగా... "మీ ప్రకటన ఎన్డీయే కుటుంబంలోకి వారంతట వారే చేరాలని నిర్ణయించుకున్నారని తెలుపుతున్నది. వారేమో మీ ఆహ్వానం మేరకే రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఎన్డీయేలో చేరామని చెప్పుకుంటున్నారు. ఏది నిజమో స్పష్టత అవసరం. బంధం ఎక్కువ కాలం నిలవడానికి స్పష్టత దోహదం చేస్తుంది" అని ఐవైఆర్ కృష్ణారావు ఆన్ లైన్ వేదికగా స్పందించారు.

దీంతో ఈ ట్వీట్ రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది. ఈ విషయంలో ఏపీ ప్రజలకు కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనే భావించాలని అంటున్నారు. "బీజేపీ కోరితే టీడీపీ-జనసేన వెళ్లి ఎన్డీయేలో చేరాయా... లేక, తాము ఎన్డీయేలో చేరతామని టీడీపీ-జనసేనలు బీజేపీ వెంటపడ్డాయా అనేది ఐవైఆర్ ప్రశ్న! దీనిపై స్పష్టమైన సమాధానం ఎంతనా అవసరం అనేదీ ఆయన అభిప్రాయం గా ఉంది!