రామోజీ, ఆర్కేతో నడ్డా భేటీ.. మాజీ సీఎస్ ట్వీట్స్ వైరల్!
ఈ భేటీలపైన మాజీ చీఫ్ సెక్రటరీ, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు ట్విట్టర్ లో స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఈ ట్వీట్లు వైరల్ గా మారుతున్నాయి.
By: Tupaki Desk | 7 Oct 2023 6:28 AM GMTతెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జాతీయస్థాయిలోని బీజేపీ నేతల దృష్టంతా ఇప్పుడు ఆ రాష్ట్రంపైనే పెట్టారు. పైగా కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం... బీజేపీకి దక్షిణాదిలో దారుపు మూసుకుపోతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో... ఈసారి తెలంగాణలో ఎలాగైనా జెండా పాతాలని బలంగా భావిస్తుంది.
మరోపక్క స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ వెనుక జగన్ కు కేంద్రంలోని బీజేపీ పెద్దల సహాయ సహకారాలు ఉన్నాయనే కామెంట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఏపీలో ఏమి జరుగుతుందో ఢిల్లీ పెద్దలకు తెలియదా అంటూ టీడీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో... బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా.. "ఈనాడు" రామోజీ రావు, "ఏబీఎన్" రాధాకృష్ణలతో సమావేశమయ్యారు. ఈ భేటీలపైన మాజీ చీఫ్ సెక్రటరీ, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు ట్విట్టర్ లో స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఈ ట్వీట్లు వైరల్ గా మారుతున్నాయి.
ఈ సందర్భంగా తన ట్విట్టర్ లో ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్ కటింగ్స్ ను పోస్ట్ చేసిన ఆయన... "ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి బీజేపీ గురించి చిలవలు పలవలుగా అబద్ధాలతో కథనాలు అల్లి, రాష్ట్రానికి బిజెపి అన్యాయం చేసిందని పెద్ద ఎత్తున విష పూరిత దుష్ప్రచారాన్ని సాగించిన మీడియా మొఘల్, మీడియా నవాబు, రామోజీ, ఆర్కే గార్లు." అని రాసుకొచ్చారు.
అనంతరం... "వీరిరువురి మూలంగా అకారణంగా బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోలుకోలేని నష్టాన్ని చవిచూచింది. అయినా అవేవీ మనసులో పెట్టుకోకుండా సహృదయంతో ఆ ఇరువురిని కలిసిన జేపీ నడ్డా గారు అభినందనీయులు. ఇకనైనా ఈ ఇరువురు వార్తలను వార్తలుగా అజెండా రహితంగా ప్రజలకు అందిస్తారని అందరం ఆశిద్దాం" అని మరో ట్వీట్ చేశారు ఐవైఆర్ కృష్ణారావు.
దీంతో.. ఆయన చెప్పాలనుకున్న విషయం స్పష్టంగా చెప్పారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ ట్వీట్లపై పొలిటికల్ పార్టీల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయి అనేది వేచి చూడాలి.
కాగా... రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐవైఆర్ కృష్ణారావు ఏపీ సీఎస్ గా పని చేసిన సంగతి తెలిసిందే. గతంలో పలు సందర్భాల్లో అమరావతితో సహా ప్రభుత్వాల నిర్ణయాలపైన ఆయన తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు.
ఏది ఏమైనా... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న సమయంలో... బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ వచ్చి.. రామోజీ రావు, రాధాకృష్ణలను కలవడం... ఈ సమావేశాలపై ఏపీ ప్రభుత్వ మాజీ సీఎస్, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు కీలకంగా స్పందించడం... ఆసక్తికరంగా మారింది!