కూటమి మేనిఫెస్టోపై బీజేపీ పెద్దాయన పెదవి విరుపు!
వైసీపీ మేనిఫెస్టోకు దీటుగా టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 1 May 2024 11:31 AM GMTవైసీపీ మేనిఫెస్టోకు దీటుగా టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ ల సమక్షంలో చంద్రబాబు, పవన్ ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశారు. వైసీపీ మేనిఫెస్టోతో పోలిస్తే టీడీపీ మేనిఫెస్టో ప్రజలను ఆకర్షించేలా ఉంది. కానీ, మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు లేకపోవడం అన్న ప్రచారం మాత్రం టీడీపీ, జనసేన నేతలను కలవరపెడుతోంది. జాతీయ స్థాయిలో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిందని, అందుకే రాష్ట్ర స్థాయిలో మేనిఫెస్టోలో వారి ప్రమేయం లేదని చంద్రబాబు అన్నారు.
ఇక, మేనిఫెస్టోను బీజేపీ నేత సిద్ధార్థ్ నాధ్ సింగ్ తీసుకోవడానికి నిరాకరరించడం కూడా హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ, జనసేన మేనిఫెస్టోతో బీజేపీకి సంబంధం లేదని, అందుకే ఆయన మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదని విమర్శలు వస్తున్నాయి. ఆ కామెంట్లు చాలవు అన్నట్లు పుండు మీద కారం చల్లిన రీతిలో తాజాగా కూటమి మేనిఫెస్టోపై బీజేపీ నేత, మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి.
దీన్ని ఉమ్మడి మేనిఫెస్టో అనలేమని, ఒక రకంగా ఉమ్మడి కాని ఉమ్మడి మేనిఫెస్టో అని ఐవైఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేనిఫెస్టోతో బీజేపీ అంటీముట్టనట్టుగా ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. ఇది ఆచరణ సాధ్యం కాని మేనిఫెస్టో అని ఐవైఆర్ అన్నారను. మేనిఫెస్టోలోని చాలా అంశాల్లో స్పష్టత లేదని ..టీడీపీ, జనసేన ఇచ్చిన హామీలకు...బీజేపీ విధానాలకు సారూప్యత కుదరడం లేదని చెప్పారు. అనేక అంశాల్లో బీజేపీ జాతీయ విధానం అవలంబిస్తోందని, అందుకే ఏపీలో మేనిఫెస్టోకు దూరంగా ఉంటామన్న రీతిలో బీజేపీ వ్యవహరించిందని చెప్పుకొచ్చారు.
ఈ మేనిఫెస్టోను టీడీపీ, జనసేన మేనిఫెస్టోగానే భావిస్తారని ఐవైఆర్ తెలిపారు. ఆ మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు ఉంటుంది అనేది పార్టీ మాట అని అన్నారు. మరి, ఐవైఆర్ కామెంట్లుపై టీడీపీ, జనసేన నేతల రియాక్షన్ ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.