Begin typing your search above and press return to search.

చంద్రబాబును అందుకే తెలంగాణలో నుంచి తరిమేశాం!

తాజాగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.

By:  Tupaki Desk   |   21 Feb 2025 10:21 AM GMT
చంద్రబాబును అందుకే తెలంగాణలో నుంచి తరిమేశాం!
X

చంద్రబాబు ఎందుకు తెలంగాణను వీడారు..? వీడేలా చేశారు? అంటే అందులో పాత్ర బీఆర్ఎస్ ది ఎంతో ఉంది. నాడు ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై కేసు పెట్టించి కేసీఆర్ ఆడిన రాజకీయ క్రీడతోనే చంద్రబాబు అమరావతికి వెళ్లాల్సి వచ్చిందన్నది విశ్లేషకుల మాట... అయితే ఇప్పుడు ఆ పాత పగలను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ మరోసారి రాష్ట్ర ప్రజలను ఆకట్టుకునే పనిలో పడింది. తాజాగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తమ పాలనలో టీఆర్‌ఎస్ తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉండగా, చంద్రబాబును తెలంగాణలో అడుగు పెట్టనివ్వలేదని, ఒకసారి వచ్చినప్పుడు 'తన్ని తరిమేశాం' అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు

- తెలంగాణపై కుట్రలు

తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై, ముఖ్యంగా కృష్ణా జలాల అంశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు టీడీపీ కూడా కుట్ర చేస్తున్నట్లు ఆరోపించారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబుకు, ప్రధాని మోదీకి తలొగ్గి, రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

- టీడీపీపై తీవ్ర విమర్శలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి అడ్డు తగిలిన పార్టీ తెలుగుదేశమేనని, చంద్రబాబు నాయుడు అప్పట్లో రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ప్రయత్నించారని జగదీశ్వర్ రెడ్డి గుర్తుచేశారు. విభజన అనంతరం కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉందని, ఇందులో చంద్రబాబు పాత్ర ఉందని ఆయన ఆరోపించారు.

- బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ భద్రత

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రత్యేకంగా సాగునీటి ప్రాజెక్టుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, రాష్ట్ర ప్రయోజనాలను ఎవరూ దెబ్బతీయలేరని జగదీశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. తమ హయాంలో రాష్ట్ర ప్రజలు మోసపోలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలతో నిండిపోయిందని విమర్శించారు.

-సమర శంఖారావం

బీఆర్ఎస్ మరోసారి తమ హయాంలో తీసుకున్న కఠిన నిర్ణయాలను, తెలంగాణ ప్రజల హక్కుల కోసం చేసిన పోరాటాలను ప్రస్తావిస్తూ, రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి, విపక్షాలకు గట్టి బుద్ధి చెప్పే సమయం వచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, త్వరలోనే తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని జగదీశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.