Begin typing your search above and press return to search.

జగన్ మాస్ ఎలివేషన్స్ !

దాదాపు తొమ్మిది నెలల తరువాత జగన్ బయటకు వచ్చారు. ఆయన వరసగా జిల్లాల టూర్లు చేస్తున్నారు. అధికార టీడీపీ కూటమి మీద హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   20 Feb 2025 2:30 PM GMT
జగన్ మాస్ ఎలివేషన్స్ !
X

దాదాపు తొమ్మిది నెలల తరువాత జగన్ బయటకు వచ్చారు. ఆయన వరసగా జిల్లాల టూర్లు చేస్తున్నారు. అధికార టీడీపీ కూటమి మీద హాట్ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ఏపీలో జగన్ కామెంట్స్ పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నాయి. వైసీపీ పని అయిపోయింది అన్న వారికి జగన్ కోసం వస్తున్న జనాలు చూస్తే ఆయనకు ఉన్న క్రేజ్ ఏంటో అర్ధం అవుతోంది.

అదే టైం లో వైసీపీలో కూడా ఒక రకమైన నిరాశ నిర్వేదం కనిపిస్తున్నాయి. వరసబెట్టి నాయకులు అంతా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు. వైసీపీ బతికి బట్ట కడుతుందా అన్న చర్చ సాగుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేతగా చాలా కాలానికి జనంలోకి వచ్చారు. అయితే జగన్ లో చాలా మార్పు కనిపిస్తోంది అన్నది ఆయన మీడియా ముందు చేస్తున్న కామెంట్స్ ఆయన కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేస్తున్న పదునైన విమర్శలు అన్ని చూస్తే అర్ధమవుతోంది.

సాధారణంగా జగన్ మాట్లాడేది తక్కువగానే ఉంటుంది. ఆయన మీడియా ముందుకు వచ్చినా పేపర్లను దగ్గర పెట్టుకుని ప్రభుత్వం ఏమి చేయలేదు, ఏ హామీలు ఇచ్చింది ఇలా వరసబెట్టి ఒక్కోటీ చెబుతూ వెళ్తారు. ఆ మీదట ఆయన విమర్శలు చేసినా అవి చిన్నగానే ఉంటాయి. పైన దేవుడు ఉంటాడు అన్నీ చూసుకుంటాడు, తప్పులు చేసిన వారికి మొట్టికాయలు వేస్తాడు అని జగన్ మాట్లాడడం జరుగుతూ ఉంటుంది.

దానిన్నే అంతా చూస్తూ వచ్చారు. కానీ జగన్ ఎందుకో 2.0 అవతార్ ఎత్తారా అన్న చర్చ అయితే పార్టీ లోపలా బయటా సాగుతోంది. ఈ మధ్యనే పార్టీ క్యాడర్ తో ఆయన మాట్లాడుతూ ఇక మామూలుగా ఉండదు, జగన్ వేరే లెవెల్ అన్నట్లుగా హింట్ ఇచ్చారు. దానికి తగ్గట్లుగానే ఆయన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించిన అనంతరం మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ చేసిన హాట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నిజానికి జగన్ అయిదేళ్ళ పాటు సీఎం గా పనిచేసి ఉన్నారు. అంతకు ముందు అయిదేళ్ళ పాటు ప్రధనా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఒక పార్టీకి అధినేతగా బాధ్యత వహిస్తున్నారు. ఆయన నోటి వెంట పోలీసులను ఉద్దేశించి అధికార పార్టీకి కొందరు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారు రిటైర్ అయినా లేక సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకుని వచ్చి మరీ బట్టలూడదీసి జనంలో నిలబెడతామని చెప్పడం మాత్రం తగినవి కావన్న చర్చ అయితే ఉంది.

కానీ ఈ తీవ్ర వ్యాఖ్యలే వైరల్ అయ్యాయి. అవే జగన్ లోని మాస్ ఎలివేషన్స్ ని బయటకు తెచ్చాయి. నిజానికి జగన్ ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉండకూడదు అని అంటున్న వారు సైతం ప్రస్తుతం వైసీపీ ఉన్న పరిస్థితి. ఆ పార్టీలో నిస్తేజంగా ఉన్న వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకునే ఆయన ఈ మాస్ కామెంట్స్ చేశారని అంటున్నారు. దాంతోనే అవి ఫుల్ ఫోకస్ కావడమే కాకుండా క్యాడర్ కి కొత్త బూస్ట్ ని ఇచ్చేయని అంటున్నారు.

ఒక విధంగా జగన్ క్యాడర్ ని దృష్టిలో ఉంచుకునే ఈ తరహా పదునైన కామెంట్స్ చేసి ఉంటారని కూడా భావిస్తున్నారు. పూర్తిగా క్యాడర్ కోసమే ఆయన తనలోని ఫైర్ మొత్తం మీడియా ముందు చూపించారు అని అంటున్నారు. దాంతో క్యాడర్ అయితే ఫుల్ జోష్ లో ఉందని అంటున్నారు. ఇక ఇదే విజయవాడ పర్యటనలో ఒక చిన్నారి పాప జగన్ తో సెల్ఫీ కోసం ఏడవడం జగన్ కూడా సెక్యూరిటీని దాటి మరీ ఆ పాపను పిలిచి నుదిటిన ముద్దు పెట్టి ఆమెను బుజ్జగించి పంపించడం ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆ విధంగా జగన్ విజయవాడకు వచ్చింది వెళ్ళింది అంతా హార్డ్లీ గంట నుంచి రెండు గంటల వ్యవధి అయినా ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గానే నిలిచాయంటే జగన్ ఈ విధంగా తనలోని బిగ్ చేంజ్ ని చూపించబట్టే అంటున్నారు. ఇక గుంటూరు మిర్చీ యార్డుకు జగన్ రావడం వరసగా రెండో రోజు జరిగింది.

అక్కడ కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో షేక్ అయ్యాయి. తాము తప్పకుండా అధికారంలోకి వస్తామని అపుడు చంద్రబాబుకు తాము కూడా సెక్యూరిటీ ఇవ్వమని జగన్ ఖరాఖండీగా చెప్పడం కూడా హాట్ టాపిక్ అయింది. ఇది కూడా జగన్ లోని మరో మాస్ యాంగిల్ ని బయటపెట్టింది. అంతే కాదు క్యాడర్ కూడా ఈ తరహా స్టేట్మెంట్స్ తో ఫుల్ హ్యాపీ అవుతున్నారు.

మొత్తానికి చూస్తే జగన్ లో 2.0 ప్రభావం ఏంటి అన్నది గత రెండు పర్యటనలూ రుజువు చేశాయని అంటున్నారు. ఆయన ఇదే తీరున హీటెక్కించే కామెంట్స్ తో తన రాబోయే టూర్లలో కూడా కూటమి మీద నిప్పులు చెరుగుతారని అంటున్నారు. ఇదంతా ఒక వ్యూహం ప్రకారమే జగన్ చేస్తున్నారని అది క్యాడర్ కో కొత్త ఉత్తేజం నింపడానికే అని అంటున్నారు. అలా జగన్ అయితే సక్సెస్ అవుతున్నారనే ఈ టూర్లు నిరూపించాయని అంటున్నారు.