అక్రమ ఆస్తులు అంటూ కేసు వేసి...ఇపుడు షర్మిలకు వకాల్తానా ?
ఇక బీజేపీ వామపక్షాలు ఆఖరుకు జనసేన కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ కావడం లేదు. సో ఇదంతా జగన్ వర్సెస్ షర్మిల మధ్యలో టీడీపీ అన్నట్లుగానే ఉంది.
By: Tupaki Desk | 26 Oct 2024 4:15 AM GMTఏపీలో జగన్ అక్రమాస్తులు సంపాదించారు అని 2012 మేలో సీబీఐ ఆయనను విచారణకు పిలిచి ఆ మీదట అరెస్ట్ చేసింది. ఇది పుష్కర కాలం క్రితం జరిగిన ఉమ్మడి ఏపీలో అతి పెద్ద సంచలనం. ఆనాడు జగన్ వి అక్రమ ఆస్తులు అని తండ్రి వైఎస్సార్ ముఖ్యమంత్రి త్వాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా సంపదను కూడబెట్టుకున్నారని ప్రధానమైన అభియోగం.
ఇక జగన్ అక్రమాస్తులు సంపాదించారు అన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు పిటిషన్ దాఖలు చేశారు. ఆయన హైకోర్టుకు దీని మీద పిటిషన్ వేస్తే టీడీపీ కూడా జత కలిసింది. అలా జగన్ అక్రమాస్తులు సంపాదించారు అని అవన్నీ ప్రభుత్వానికే చెందుతాయని కూడా పేర్కొన్నారు
ఆ రోజుల్లో లక్ష కోట్లు జగన్ సంపాదించారు అని కూడా టీడీపీ తరచూ విమర్శలు చేసింది. 2014 ఎన్నికల్లో అదే టీడీపీ ప్రధాన ప్రచార అస్త్రం అయింది. ఇక కాంగ్రెస్ కూడా జగన్ తన తండ్రిని అడ్డం పెట్టుకుని ఏపీని లూటీ చేశారు అని వీలైనప్పుడల్లా విరుచుకుపడుతూ వచ్చింది.
మరి ఆ అక్రమాస్తుల విషయంలోనే ఇపుడు అన్నా చెల్లెలు మధ్య సమరం సాగుతోంది. తనకు అన్న ఆస్తులలో వాటా కావాలని షర్మిల కోరుతున్నారని ప్రచారంలో ఉంది. దాని మీదనే రగడ స్టార్ట్ అయింది. ఇక ఈ విషయంలో టీడీపీ వకాలత్ పుచ్చుకున్నట్లుగా వ్యవహరించడమూ చర్చకు తావిస్తోంది
ఏకంగా తన అధికారిక ట్విట్టర్ ద్వారా జగన్ ని విలన్ గా షర్మిలను బాధితురాలిగా చూపించే ప్రయత్నం అయితే చేస్తోంది. జగన్ ధన దాహంతో వ్యవహరిస్తున్నారని చెల్లెలుకు ఆస్తిలో వాటా ఇవ్వడం లేదని కూడా అంటున్నారు.
నిజానికి ఈ ఆస్తి ఎవరిది ఎలా వచ్చింది అన్నది కూడా చూడాల్సి ఉంది కదా అన్న కొత్త చర్చ తటస్థుల నుంచి వస్తోంది. తన తండ్రి సీఎం గా ఉన్నపుడు చేసిన వ్యాపారాలు అన్నీ కుటుంబ వ్యాపారాలే అని వాటికి గార్డియన్ గా జగన్ ఉన్నారని షర్మిల అంటున్నారు.
అయితే ఆ వ్యాపారాలలో అక్రమం అవినీతి జరిగిందని సీఎం గా తండ్రి పలుకుబడిని ఉపయోగించుకుని జగన్ లక్షల ఓట్లు దోచేశారు అని కదా నిన్నటి దాకా టీడీపీ చెబుతూ వస్తోంది. ఇదే నిజమని నమ్మి కదా కాంగ్రెస్ తమ పార్టీ ఎమ్మెల్యే మీద హైకోర్టులో పిటిషన్ వేయించి జగన్ మీద సీబీఐ విచారణ జరిగేలా చూసింది. ఈ కారణంగానే కదా జగన్ పదహారు నెలల జైలు జీవితం అనుభవించారు.
మరి వైసీపీ అధినేత జగన్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మధ్య ఆస్తుల పంపకం వివాదంపై టీడీపీ ఈ విధంగా రియాక్ట్ కావడం పట్ల చర్చ అయితే సాగుతోంది. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందిస్తూ జగన్ ధనదాహంతో కుటుంబ వ్యవస్థను అగౌరవపరుస్తున్నాడని విమర్శించారు. తల్లిని, చెల్లిని బజారుకీడ్చిన జగన్ ఆస్తి కోసం వెంపర్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.
ఇలా ఆస్తి అంటూ టీడీపీ చేస్తున్న ప్రకటనలు ఏ ఆస్తి గురించి అన్నదే కదా ఇక్కడ ప్రశ్న. ఆ ఆస్తులు అన్నీ అక్రమం అని కదా టీడీపీ కోర్టులో కాంగ్రెస్ తో పాటు పోరాడింది. అందుకే కదా సీబీఐ ఈడీ వాటిని అటాచ్ చేసింది అని కూడా అంటున్నారు. మరి జగన్ వద్ద ఉన్న అక్రమ ఆస్తులు షర్మిలకు వాటా ఇస్తే సక్రమ ఆస్తులు అయిపోతాయా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
అంతే కాదు షర్మిల ఈ రోజున కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అక్రమ ఆస్తులు జగన్ సంపాదించారు అని ఏ కాంగ్రెస్ అయితే నాడు కేసులు వేసిందో ఇపుడు అదే కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న షర్మిల తనకు అవే ఆస్తులు కావాలని అంటున్నారు. మరి దీనికి కాంగ్రెస్ కూడా తగిన వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది కదా అని అంటున్నారు.
నిజానికి ఈ విషయంలో కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ రియాక్ట్ కావాలీ అంటే కనుక అక్రమ ఆస్తుల గురించే మాట్లాడాలి. ఈ కేసులను వేగవంతం చేసి అక్రమాస్తులను ప్రభుత్వానికి బదలాయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి. అలా కాకుండా షర్మిలకు మద్దతుగా మాట్లాడం అంటే 2012 నాటి పొలిటికల్ స్టాండ్ మారిందా అన్నదే చర్చ.
మరి ఇలా అయితే జగన్ సంపాదించినది సక్రమ ఆస్తులే అని వాటిని చెల్లెలుకు పంచమని కోరుకుంటున్నట్లే కదా అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కనుక జగన్ ఆస్తుల విషయంలో నాడూ నేడూ టీడీపీ రాజకీయమే చేస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే కాంగ్రెస్ లో షర్మిల తప్ప ఎవరూ మాట్లాడడం లేదు అది వేరే విషయం. ఇక బీజేపీ వామపక్షాలు ఆఖరుకు జనసేన కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ కావడం లేదు. సో ఇదంతా జగన్ వర్సెస్ షర్మిల మధ్యలో టీడీపీ అన్నట్లుగానే ఉంది.