'జగన్ ఆత్మ' స్థానంలో వైఎస్ భారతి.. సాధ్యమే.. ఎలాగంటారా.. ?
వైసీపీలో నానాటికీ కీలక నాయకులు హ్యాండిస్తున్నారు. మన అని అనుకుని భుజాలపైకి ఎత్తుకున్న వారు చాలా మంది జగన్‌ను వదిలేసి వెళ్లిపోతున్నారు.
By: Tupaki Desk | 29 Jan 2025 8:30 AM GMTవైసీపీలో నానాటికీ కీలక నాయకులు హ్యాండిస్తున్నారు. మన అని అనుకుని భుజాలపైకి ఎత్తుకున్న వారు చాలా మంది జగన్‌ను వదిలేసి వెళ్లిపోతున్నారు. ఆళ్ల నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, మోపిదేవి వెంకటరమణ వీరిలో కీలకం. వారంతా జగన్‌తో విభేదించి పొరుగు పక్షానికి జై కొట్టారు. ఇక, తాజాగా.. జగన్ ఆత్మగా పేరున్న వి. విజయసాయిరెడ్డి కూడా తాజాగా తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. అయితే.. ఇతర నేతలు పోయింది వేరు.. సాయిరెడ్డి పోవడం వేరు.
రాష్ట్ర స్థాయిలో ఉన్ననాయకులు జంప్ చేసినా.. వారిని ఏదో ఒక రకంగా భర్తీ చేసుకోవచ్చు. రాష్ట్ర రాజకీయాల్లో వారు లేని లోటును సరిదిద్దుకోవచ్చు కూడా. అయితే.. కేంద్రం స్థాయిలో.. ముఖ్యంగా కీలకమైన ప్రధాని, హోం మంత్రుల స్థాయిలో మంత్రాంగం నడిపిన సాయిరెడ్డి జంప్ చేయడం అంటే.. ఒకరకంగా .. వైసీపీకి కాళ్లు-చేతులు ఆడని పరిస్థితి తీసుకురావడమే. పైగా ఢిల్లీలో సాయిరెడ్డి వంటి బలమైన వైసీపీ గళం కూడా వినిపించకుండా పోతుంది.
ఒకరకంగా చెప్పాలంటే.. ఢిల్లీలో వైసీపీ కి ఉన్న గుర్తింపు వ్యక్తిగతంగా వచ్చింది కాదు.. జగన్ ఇచ్చిన చొరవతో సాయిరెడ్డి సంపాయించి పెట్టిన పరిచయాలు.. గుర్తింపే పార్టీకి వెన్నుదన్నుగా మారాయి. సో.. ఈ నేపథ్యంలో సాయి రెడ్డి వంటి నాయకుడు జంప్ చేస్తే.. ఆ ప్రభావం.. పార్టీపైనే కాకుండా వ్యక్తిగతంగా జగన్ పైనా ఉంటుంది. దీనిని గుర్తించిన జగన్.. తాజాగా తన సతీమణి భారతిని రంగంలోకి దింపాలని భావిస్తున్నారు అని ప్రచారం లా వినిపిస్తుంది . ఆమె ను రాజ్యసభకు పంపించడం ద్వారా ఢిల్లీలో ఏర్పడిన గ్యాప్‌ను భర్తీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు .
అయితే.. ఇప్పుడున్న పరిస్థితిలో వైసీపీ నుంచి రాజ్యసభకు నాయకులను పంపించే ప్రయత్నం సఫల మవుతుందా? అనేది ప్రశ్న. ప్రస్తుతం ఎమ్మెల్యేల సంఖ్య 11 మాత్రమే ఉన్న నేపథ్యంలో వైసీపీ నేరుగా రాజ్యసభకు ఎవరినీ ప్రమోట్ చేసే పరిస్థితి లేదు. కానీ, మరో రూపంలో భారతిని రాజ్యసభకు పంపించేం దుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. అదే నామినేటెడ్ దారిలో రాష్ట్రపతి సిఫారసు లేదా.. మీడియా రంగంలో ఉన్న వెసులు బాటు ద్వారా భారతిని రాజ్యసభకు పంపించడం ద్వారా.. సాయిరెడ్డి లేని లోటును భర్తీ చేసుకునే అవకాశం ఉందన్న చర్చ వైసీపీలో వినిపిస్తోంది. మరి ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.