గోరంట్లను మెచ్చి కీలక పదవి ఇచ్చిన జగన్!
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే ఈ సమావేశాలలో ఆయన కొన్ని నిర్ణయాలు అక్కడికక్కడే తీసుకుంటున్నారు.
By: Tupaki Desk | 20 Dec 2024 6:44 AM GMTవైసీపీని బలోపేతం చేసే పనిలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ బిజీగా ఉన్నారు. వరసగా ఆయన వివిధ జిల్లాలలోని పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే ఈ సమావేశాలలో ఆయన కొన్ని నిర్ణయాలు అక్కడికక్కడే తీసుకుంటున్నారు.
అధికార టీడీపీ కూటమి బలంగా ఉందని దానిని ఢీ కొట్టే స్థాయి నేతలు కావాల్సిన అవసరం ఉందని గుర్తించిన జగన్ ఆ దిశగా నాయకులను అన్వేషిస్తున్నారు. వైసీపీకి మౌత్ వాయిస్ గా పని చేయడానికి అవసరమయ్యే నేతలలను కూడా ఆయన ఎంపిక చేసుకుంటున్నారు.
అలా చూస్తే కనుక ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా గోరంట్ల మాధవ్ ని నియమించారు. గోరంట్ల మాధవ్ 2019 నుంచి 2024 వరకూ వైసీపీ తరఫున హిందూపురం నుంచి ఎంపీగా పనిచేశారు. ఆయనకు 2024లో టికెట్ ఇవ్వలేదు. ఈ నేపధ్యంలో ఆయనకు తాజాగా పార్టీలో ప్రముఖ స్థానం దక్కింది. ప్రత్యర్థుల మీద గట్టిగా విమర్శలు చేసే నేతలు ఇపుడు వైసీపీకి కావాల్సి ఉంది. అందుకే గోరంట్లను ఎంపిక చేశారని అంటున్నారు.
ఇక గోరంట్ల రాజకీయాల్లోకి రాక ముందు పూర్వాశ్రమంలో అనంతపురం జిల్లాలో సీఐ స్థాయి పోలీస్ అధికారిగా పనిచేసేవారు. అప్పట్లో రాయలసీమలో ప్రముఖ రాజకీయ నేతగా ఉంటూ అనంతపురం ఎంపీగా ఉన్న జేసీ దివాకరరెడ్డి మీదనే గోరంట్ల మీసం తిప్పి సవాల్ చేయడం వైరల్ గా మారింది.
దాంతోనే ఆయనకు స్టేట్ వైడ్ గా ఇమేజ్ వచ్చింది. ఆ తరువాత గోరంట్ల తన ఉద్యోగానికి స్వచ్చందంగా విరమణ ప్రకటించారు. రాజకీయాల్లోకి వచ్చి వైసీపీలో చేరడం తోనే హిందూపురం టికెట్ దక్కింది. ఆయన వైసీపీ ఊపులో గెలిచి పార్లమెంట్ మెంబర్ అయ్యారు.
బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల సేవలను పార్టీ కోసం వినియోగించుకోవాలని జగన్ భావించడంతో ఇపుడు ఆయనకు కీలక హోదా దక్కింది. గోరంట్లలో ఫైర్ బ్రాండ్ ఉన్నారు. ఆయన ప్రత్యర్థుల మీద గట్టిగానే విరుచుకుపడతారు.
వైసీపీలో ఒకపుడు చాలా మంది ఫైర్ బ్రాండ్ లీడర్స్ ఉండేవారు. ఇపుడు అయితే తగ్గిపోయారు. చాలా మంది సైలెంట్ అయ్యారు దాంతో పార్టీ వాయిస్ పెద్దగా జనాల్లోకి వెళ్ళడం లేదు అన్న భావన ఉంది. అంతే కాదు ప్రత్యర్ధుల విమర్శలకు ధీటుగా జవాబు చెప్పేవారు కూడా లేరన్న ప్రచారమూ ఉంది. దాంతో గోరంట్లని మెచ్చి మరీ జగన్ బాధ్యతలు అప్పగించారు అని అంటున్నారు. చూడాలి ఈ కొత్త పదవిలో గోరంట్ల ఎలా రాణిస్తారో. ఆయన అధికార టీడీపీ కూటమి మీద ఏ స్థాయిలో విమర్శలు చేస్తారో.