చంద్రబాబుపై వ్యతిరేకత.. జగన్ చెబుతున్నది నిజమేనా?
అంతేకాదు.. చంద్రబాబు చేస్తున్న పాపాలు పండుతున్నాయని కూడా అంటున్నారు
By: Tupaki Desk | 6 Oct 2024 4:52 PM GMTవైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ గత రెండు మాసాలుగా ఎక్కడ నోరు విప్పినా.. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయిం దని చెబుతున్నారు. అంతేకాదు.. చంద్రబాబు చేస్తున్న పాపాలు పండుతున్నాయని కూడా అంటున్నారు. ''శిశుపాలుడి పాపాల మాదిరిగా చంద్రబాబు పాపాలు కూడా పండుతున్నాయి. ఒక్కొక్కటిగా కాదు.. వందల సంఖ్యలో పాపాలు చేస్తున్నాడు'' అని ఇటీవల తిరుమల లడ్డూ వివాదంపై స్పందించాల్సిన పరిస్థితి వచ్చినా.. దీనికి ముందు గుంటూరు జైల్లో ఉన్నమాజీ ఎంపీ నందిగం సురేష్‌ను కలిసి పరామర్శించిన తర్వాత మాట్లాడినా జగన్ ఇదే చెప్పారు.
ఇంకా చిత్రం ఏంటంటే.. జూలైలో నిర్వహించిన(అప్పటి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులే) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేసిన సమయంలో జగన్ తన ఇంట్లోనే మీడియా మీటింగ్ పెట్టారు. ఈ సమయంలో కూ డా.. చంద్రబాబు చేస్తున్న పాపాలు పండుతున్నాయని.. ఈప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యానించారు. తాజాగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై విచారణకు సుప్రీంకోర్టు సీబీఐ-ఏపీ పోలీసులు-ఎఫ్ ఎస్ ఎస్ ఏఐ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించిన తర్వాత జగన్ నేరుగా మీడియాతో మాట్లాడారు.
ఈ సమయంలోనూ ``చంద్రబాబు పాపాలు పండుతున్నాయి. ప్రజలు అంతా గమనిస్తున్నారు. త్వరలోనే ప్రభుత్వం కూలిపో తుంది`` అని జగన్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అసలు జగన్ చెబుతున్నది నిజమేనా? ప్రజల్లో కూటమి సర్కారుపై వ్యతిరేకత పెరిగిపోయిందా? అనేది ప్రశ్న. ఏపీలో ఏ టీ కొట్టు దగ్గర ఇద్దరు కలిసినా.. ఈ విషయంపై మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అసలు వాస్తవం ఏంటి? అనేది ఆన్‌లైన్ చానెళ్లు.. ఔత్సాహిక పాత్రికేయులు కూడా ప్రజలను కలుస్తున్నారు. వాస్తవం ఏంటి? కూటమి సర్కారుపై వ్యతిరేకతలో నిజం ఎంత? అనేది తెలుసుకుంటున్నారు. దీనిలో ప్రజల నుంచి మిశ్రమ స్పందన రావడం గమనార్హం.
ఆన్‌లైన్ చానెళ్లు చేస్తున్న సర్వేల్లో ప్రజలు చెబుతున్నది గమనిస్తే.. ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
+ సామాజిక భద్రతా పింఛన్లు అందుతున్న 67 లక్షల పైచిలుకు మంది ఆనందంగానే ఉన్నారు. తమకు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పింఛన్‌ను ప్రతి నెలా 1నే ఇస్తున్నారని చెబుతున్నారు. సో.. ఇది చంద్రబాబు సర్కారుకు ప్లస్.
+ అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం ద్వారా పేదలకు, కార్మికులకు, దైనందిన కూలీలకు రూ.5కే భోజనం అందిస్తున్నారు. ఈ విషయం పట్ల కూడా ప్రజల్లో సానుకూలతే వస్తోంది. ఇది కూడా సర్కారుకు ప్లస్సే!
+ ఇక, వలంటీర్లను దూరం చేయడంపై మాత్రం ప్రజల్లో మెజారిటీ వర్గాలు హర్షించడం లేదు. తమకు ఏ అవసరం వచ్చినా.. ఎవరికి చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో వలంటీర్లను కొనసాగించాలన్నది మెజారిటీ ప్రజల డిమాండ్‌గా ఉంది.
+ ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్ సిక్స్‌పై మహిళల్లో ఆసక్తికర చర్చలు జోరుగా సాగుతున్నాయి. అమలు చేస్తారా? చేయరా? అని మొహం మీదే ప్రశ్నిస్తున్నారు. (ఇటీవల చంద్రబాబును స్వయంగా ఓ మహిళ అడిగేసిన విషయం తెలిసిందే)
+ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, నెలకు రూ.1500 ఆడబిడ్డ నిధి, రైతులకు ఇస్తామన్న రూ.20000 వంటివి ఇప్పుడిప్పుడే చర్చకు వస్తున్నాయి. అయితే.. జగన్ చెబుతున్న వ్యతిరేకత అయితే ఇంకా రాలేదు. ప్రస్తుతానికి లేదు కూడా.
+ అయితే.. గతంలో అమ్మ ఒడి పథకం కింద జూన్‌లో రూ.15 వేలు అందేది. కానీ, ఇప్పుడు మాతృవందనం పథకంపై సర్కారు ఏమీ స్పందించడం లేదు. నారా లోకేష్ సభలో చెప్పినా.. వచ్చే ఏడాది వరకు ఇవ్వకపోతే మాత్రం దీనిపై వ్యతిరేకత ప్రబలడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపైనే ఎక్కవ మంది మహిళలు ఆశలు పెట్టుకున్నారు.
+ నూతన మద్యం విధానంపై పురుషులు హ్యాపీగా ఉన్నారు. క్వాలిటీ సరుకు, తక్కువ ధరలకే లభిస్తుందని ఆశగా ఉన్నారు. సో.. ఇది పురుషుల కోణంలో చూస్తే భేష్‌గానే ఉంది.
+ చెత్త పన్ను రద్దు, మూడు వంట సిలిండర్లు.. వంటివి ప్రకటించిన దరిమిలా.. చంద్రబాబుపై ఎలాంటి వ్యతిరేకత లేకపోగా.. సానుకూలతే కనిపిస్తోంది.
+ అయితే.. అప్పులు పెరుగుతుండడం.. ప్రతి మంగళవారం ఆర్బీఐ ముందు క్యూకట్టడం మాత్రం మధ్యతరగతిని విస్మయానికి గురి చేస్తోంది.
ఏతావాతా ఎలా చూసుకున్నా కేవలం 100 రోజుల పాలనలో జగన్ అనుకున్నంత వ్యతిరేకత అయితే.. ఎక్కడా కనిపించడం లేదు. కేవలం ఇసుక విషయంలో మాత్రం ప్రజలు తిట్టిపోస్తున్న మాట వాస్తవం. ఇంతకు మించి కూటమిపై పెద్దగా వ్యతిరేకత అయితే లేదు.