బెంగళూరు పర్యటనలో జగన్... 'జగన్ 2.0'పై నెటిజన్ల కామెంట్లు!
ఇలాంటి పరిస్థితుల్లో జగన్ బెంగళూరు పర్యటనకు వెళ్లారనే విషయంపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారని అంటున్నారు.
By: Tupaki Desk | 8 Feb 2025 6:58 AM GMTఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఇటీవలే లండన్ ట్రిప్ ముగించుకుని ఆంధ్రకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. ఇకపై చంద్రబాబు పాలనలో మన పార్టీ కార్యకర్తల వేధింపులన్నీ చూస్తున్నానని.. వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ప్రకటించారు!
ఇదే సమయంలో... విజయసాయిరెడ్డి లాంటి కీలక వ్యక్తి పార్టీని వీడటంపైనా ప్రశ్నిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దీనిపై సాయిరెడ్డి నుంచి కౌంటర్ వచ్చేసిందనే చర్చ తెరపైకి వచ్చింది. మరోపక్క గత ప్రభుత్వలో అత్యంత కీలక నేతగా పేరొందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తుందనే చర్చ నడుస్తోంది.
ఇక తాజాగా విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పరిస్థితి ఇప్పుడు ఇరకాటంలో పడిందని అంటున్నారు. తాజాగా ఎంవీవీకి, ఆడిటర్ జీవీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. హయగ్రీవ ఫామ్స్ కు చెందిన రూ.44.74 కోట్ల ఆస్తులు జప్తూ చేసింది. మరోపక్క లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డి పేరు వినిపిస్తోందని అంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో జగన్ బెంగళూరు పర్యటనకు వెళ్లారనే విషయంపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారని అంటున్నారు. కార్యకర్తలకు అండగా ఉండటం జగన్ 2.0లో చూడొచ్చు కానీ.. ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్న వైసీపీ నాయకులకు అయినా అండగా ఉండకుండా బెంగళూరులోని యలహంకకు వెళ్లడం కరక్టేనా అని ప్రశ్నిస్తున్నారని అంటున్నారు.
దీంతో... చంద్రబాబు చేస్తోన్న వ్యవహారాలను ప్రజలకు వివరిస్తానని.. కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటానని చెప్పిన జగన్ ఇంతలోనే మళ్లీ బెంగళూరుకు వెళ్లడం ఏమిటనే చర్చ నెట్టింట తెరపైకి వచ్చిందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు హైదరాబాద్ లోనే ఉంటూ ఏపీకి అతిథులుగా వచ్చి వెళ్తున్నారంటూ చేసిన కామెంట్లను గుర్తు చేస్తున్నారని చెబుతున్నారు.
అయితే... ఈ బెంగళూరు పర్యటనలో భాగంగా జగన్ యలహంక ఎమ్మెల్యే విశ్వనాథ్ కుమార్తె వివాహానికి హాజరయ్యారు. త్రిపుర వాసిని ఫంక్షన్ హాల్ లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. వీటికి సంబంధించిన ఫోటోల్లో జగన్ తో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి ఉండగా... జగన్ సతీమణి భారతి కనిపించలేదు!