మాటిస్తున్నా.. జగన్ 2.0 పాలన వేరుగా ఉంటుంది
పార్టీ కార్పొరేటర్లకు.. నేతలకు కొత్త బలాన్ని తెచ్చేలా జగన్ మాటలు ఉండటం గమనార్హం.
By: Tupaki Desk | 6 Feb 2025 5:35 AM GMTసంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాజాగా విజయవాడ పార్టీ కార్పొరేటర్లు.. నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి. వైసీపీ బతుకుతుందని.. రాష్ట్రాన్ని ఏలుతుందన్న ఆయన.. మరో 30 ఏళ్లు ఏలుతామన్న జగన్మోహన్ రెడ్డి ‘‘జగన్ 2.0 పాలన వేరుగా ఉంటుంది. ఇంతకు ముందు ప్రజల గురించే పని చేశా. ఇప్పుడు కార్యకర్తలకు ఏం చేస్తానో చూస్తారు. వైసీపీ కార్యకర్త వెంట్రుకను కూడా ఎవరూ పీకలేరు’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు గూస్ బంప్స్ తెచ్చేలా చేశాయి. పార్టీ కార్పొరేటర్లకు.. నేతలకు కొత్త బలాన్ని తెచ్చేలా జగన్ మాటలు ఉండటం గమనార్హం.
పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు పెడుతున్న ఇబ్బందుల్ని తాను చూశానని.. కార్యకర్తల బాధలన్నింటినీ గమనిస్తున్నట్లుగా పేర్కొన్నారు. తనను పదహారు నెలలు జైల్లో పెట్టారని..అయినా బయటకు రాలేదా? అని ప్రశ్నించిన జగన్.. ‘‘నేను బయటకు రాలేదా? ముఖ్యమంత్రిని కాలేదా? మీపైనా కేసులు పెడతారు. మహా అయితే మూడు నెలలు లోపలేస్తారు. తర్వాత రెట్టించిన ఉత్సాహంతో బయటకు వస్తాం. మీకు చెడు చేసిన ప్రతి ఒక్కడినీ.. అలాగే మంచి చేసిన వాడినీ గుర్తు పెట్టుకోండి’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. విలువలు.. విశ్వసనీయతతోనే అఖండ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానన్న ధీమాను వ్యక్తం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ‘‘ఓడిపోయాం ఫర్లేదు. ప్రతిపక్షంలో కూర్చున్నాం. అదీ ఫర్లేదు. జమిలి అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం మనదే’’ అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు వాళ్ల కంటే వైసీపీ ఎమ్మెల్యేలు.. నాయకులే మంచివాళ్లుగా ప్రజలకు కనిపిస్తున్నారన్న జగన్.. చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు మోసమని.. తాను ఎన్నికల వేళలోనే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
‘వ్యవస్థలన్ని కుప్పకూలాయి. చంద్రబాబు ఇచ్చిన హామీలు పక్కకు పోయాయి. ఇసుక.. మద్యం అన్నింటా కుంభకోణాలే. వాళ్లకంటే వైసీపీ ఎమ్మెల్యేలు.. నాయకులే మంచివాళ్లుగా ప్రజలకు కనిపిస్తున్నారు. సంపద స్రష్టిస్తానంటూ ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు సంపద ఎలా క్రియేట్ చేయాలో చెవిలో చెప్పాలని అంటున్నారు. హామీలను అమలు చేయకపోతే కాలర్ పట్టుకోవాలని ఎన్నికలప్పుడు చెప్పాడు. ఇప్పుడు ప్రజలు కాలర్ పట్టుకొని ప్రశ్నిస్తారన్న భయంతో రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు’’ అంటూ కూటమి ప్రభుత్వ పాలనను తనదైన శైలిలో ఎండగట్టారు. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు కొత్త శక్తిని ఇవ్వటంతో పాటు.. భవిష్యత్తు పట్ల మరింత ధీమాను తీసుకొచ్చేలా చేసిందన్న మాట వినిపిస్తోంది.