జగన్ కేసులు మిలియన్ డాలర్ల ప్రశ్నలు.. ఈడీ, సీబీఐలు ఏం చెబుతున్నాయి
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కేసుల విచారణ అయితే.. తేలడం లేదు.. ఒక కొలిక్కి కూడా రావడం లేదు.
By: Tupaki Desk | 14 Dec 2024 11:30 AM GMTవైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై 2011-12 మధ్య కాలంలో నమోదైన ఆస్తుల కేసుల గురించి తెలిసిందే. ఈ కేసుల్లోనే ఆయన అరెస్టయి 16 నెలల పాటు జైల్లో కూడా ఉన్నారు. ఆ తర్వాత అతికష్టం మీద బెయిల్ పై బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కేసుల విచారణ అయితే.. తేలడం లేదు.. ఒక కొలిక్కి కూడా రావడం లేదు. దీంతో బెయిల్‌పై ఉంటూనే ఏపీలో అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రిగా చక్రం తిప్పారు. మరి పదేళ్లు దాటిపోయినా.. ఈ కేసులు ఎప్పుడు కొలిక్కి వస్తాయి?
ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈక్రమంలోనే ప్రస్తుతం ఏపీ ఉప సభాపతిగా ఉన్న రఘురామకృష్ణరాజు ఏడాది కిందట అసలు ఈ కేసుల సంగతేంటి? ఇన్నేళ్లు బెయిల్‌పై ఉన్న వ్యక్తి జగనేనని.. ఆయన కేసులు ఎప్పుడు తేలుస్తారని ప్రశ్నిస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసుల విచారణను వేరే కోర్టుకు బదిలీ చేయాలని కూడా అభ్యర్థించారు. ఈ క్రమంలో స్పందించిన సుప్రీంకోర్టు.. అసలు జగన్‌పై కేసులు ఎన్ని ఉన్నాయి? వాటి విచారణ వేగవంతం కాకపోవడానికి కారణాలు ఏంటి? అంటూ.. ఈడీ, సీబీఐలను నిలదీసింది.
వీటిపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆ రెండు సంస్థలను కూడా ఆదేశించింది. దీంతో ఈడీ, సీబీఐలు తాజాగా.. జగన్ కేసులు ముందుకు సాగకపోవడానికి, విచారణ పుంజుకోకపోవడానికి కారణాలను వివరిస్తూ.. సుదీర్ఘ నివేదికను సుప్రీంకోర్టుకు అందించాయి. ఈ నివేదిక ప్రకారం దాదాపు 125 డిశ్చార్జ్ పిటిషన్లు(తమను ఈ కేసుల నుంచి తప్పించాలని కోరుతూ) దాఖలు అయ్యాయని, వీటి విచారణ ముందుకు సాగకపోవడంతోనే అసలు కేసుల విచారణ పెండింగులో ఉందని గణాంకాలతో సహా వివరించాయి.
ఇవీ.. నివేదికలోని అంశాలు..
+జగన్‌పై నమోదైన మొత్తం కేసులు : 11
+ సీబీఐ, ఈడీ వేసిన చార్జ్ షీట్లు : 120
+ మొత్తం సాక్ష్యులు: 861 మంది
+ మొత్తం డిశ్చార్జ్ పిటిషన్లు : 125
+ జగన్ ఒక్కరే దాఖలు చేసిన పిటిషన్లు : 11
+ ట్రయల్ కోర్టుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు: 86
+ సుప్రీంకోర్టులో వేసిన డిశ్చార్జ్ పిటిషన్లు: 15
+ సుప్రీంకోర్టులోనే పెండింగులో ఉన్న పిటిషన్లు: 12