ఒకేసారి విదేశాలకు సీఎం, మాజీ సీఎం
ఈ నెల 20 నుంచి నాలుగు రోజులుపాటు ఇద్దరు నేతలు విదేశాల్లో పర్యటించనున్నారు.
By: Tupaki Desk | 10 Jan 2025 4:30 PM GMTఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ ఒకేసారి విదేశాలకు వెళ్లనున్నారు. సంక్రాంతి తర్వాత ఒకరు, పండగ ముందే ఇంకొకరు విదేశాల్లో పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబు అధికారిక పర్యటనలో భాగంగా దావోస్ వెళుతుంటే, మాజీ సీఎం జగన్ తన వ్యక్తిగత పనిపై బ్రిటన్ వెళ్లనున్నారు.
ఈ నెల 20 నుంచి నాలుగు రోజులుపాటు ఇద్దరు నేతలు విదేశాల్లో పర్యటించనున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆ నాలుగు రోజులు రాజకీయంగా ప్రశాంత వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. స్విట్జర్లాండులోని దావోస్ లో ఏటా వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో పెట్టుబడులపై పారిశ్రామిక వేత్తలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంటారు. చంద్రబాబు సీఎంగా ఉండగా, ఏటా ఈ సమావేశాలకు హాజరయ్యేవారు. ఇక వైసీపీ పాలనలో ఒక్క ఏడాది మాత్రమే ప్రభుత్వం తరఫున అప్పటి సీఎం జగన్, కొద్ది మంది మంత్రులు హాజరయ్యారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే విశాఖలో సుమారు 4 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో సుమారు రూ.2 లక్షల పెట్టుబడులకు ప్రధాని మోదీ శంకుస్థాపన కూడా చేశారు. ఇక దావోసులో జరిగే సదస్సులో కూటమి ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించి ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు.
అటు లండన్లో ఉంటున్న కుమార్తెల వద్దకు మాజీ సీఎం జగన్ ఈ నెల 20న పయనమవుతున్నారు. జగన్ కుమార్తె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో చదువుకుంటున్నారు. ఆమె గ్రాడ్యూయేషన్ కార్యక్రమానికి తల్లిదండ్రులు హాజరుకావాల్సివుంది. జగన్ కుమార్తె డిగ్రీ ఎప్పుడో పూర్తయింది. ఈమె పరీక్షల సమయంలోనే జగన్ వెళ్లాల్సివుండగా, అనివార్య కారణాల వల్ల రద్దు అయింది. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి కోర్టు అనుమతించి, పాస్ పోర్టు రెన్యువల్ కు అవకాశం ఇవ్వడంతో ఆయన లండర్ టూర్ ఖాయమైంది. 11వ తేదీ శనివారం బయలుదేరనున్న జగన్, తిరిగి 30వ తేదీన తిరుగు పయనవుతారని చెబుతున్నారు. అయితే జగన్ లండన్ పర్యటన షెడ్యూల్పై పూర్తిస్థాయి సమాచారం రావాల్సివుంది.