Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ Vs చంద్ర‌బాబు.. ఇక డైరెక్ట్ ఎటాక్‌...!

వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా నాలుగు మాసాల యోగ నిద్ర త‌ర్వాత‌.. ఇప్పుడు క‌ళ్లు తెరిచారు. తాజాగా ఆయ‌న ఉద్య‌మాల‌కు కూడా పిలుపునిచ్చారు.

By:  Tupaki Desk   |   4 Oct 2024 9:30 AM GMT
జ‌గ‌న్ Vs చంద్ర‌బాబు.. ఇక డైరెక్ట్ ఎటాక్‌...!
X

లేచింది మ‌హిళా లోకం! అన్న‌ట్టుగా వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా నాలుగు మాసాల యోగ నిద్ర త‌ర్వాత‌.. ఇప్పుడు క‌ళ్లు తెరిచారు. తాజాగా ఆయ‌న ఉద్య‌మాల‌కు కూడా పిలుపునిచ్చారు. రోడ్డెక్కాల‌ని క్షేత్ర‌స్థాయి నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు కూడా పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తమ పాల‌న‌.. ప్ర‌స్తుత కూట‌మి పాల న‌ల మ‌ధ్య ఉన్న తేడాను డోర్‌-డోర్ తెలియ జెప్పాల‌ని ఆయ‌న శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. ఈ క్ర‌మంలో కీల‌క‌మైన నాలుగు అంశాల‌ను జ‌గ‌న్ లేవ‌నెత్తుతున్నారు.

వీటిలో ప్ర‌ధానంగా వార్షిక బ‌డ్జెట్, సూప‌ర్ సిక్స్ వంటివి వున్నాయి. వీటిని బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల ని ఆయ‌న దిశానిర్దేశం చేశారు. వాస్త‌వానికి చంద్ర‌బాబు స‌ర్కారుజూలైలోనే వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టాల్సి ఉంది. కానీ, రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఏమాత్రం బాగోలేదంటూ.. అప్ప‌ట్లో బ‌డ్జెట్ స‌మావేశాలు అని పెట్టి కూడా.. వాటిని వెన‌క్కి తీసుకుని.. కేవ‌లం వైసీపీ పాల‌న‌లో జ‌రిగిన లోటు పాట్ల‌పై ప‌లు అంశాల‌కు సంబంధించి శ్వేత ప‌త్రాల‌ను చంద్ర‌బాబు విడుద‌ల చేశారు. వాటిపై చ‌ర్చ‌ల‌తోనే స‌రిపుచ్చారు.

ఇక, అక్టోబ‌రులో బ‌డ్జెట్ ప్ర‌వేశ పెడ‌తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. కానీ, ఇప్పుడు కూడా ఆ ఊసు ఎక్క‌డా వినిపించ‌డం లేదు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి బాగోలేద‌నే చంద్ర‌బాబు చెబుతున్నారు. దీంతో ఈ సారి బ‌డ్జ‌ట్ ఉండే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. దీనిని జ‌గ‌న్ త‌న‌కు అడ్వాంటేజ్‌గా తీసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నా రు. ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు క్షేత్ర‌స్థాయిలో వివ‌రించి.. ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టాల‌న్న‌ది ఆయ‌న వ్యూహంగా ఉంది. దీనిని కూట‌మి స‌ర్కారు ఎలా ఫేస్ చేస్తుందో చూడాలి.

ఇక‌, మ‌రో కీల‌క అంశం.. సూప‌ర్ సిక్స్‌. రాష్ట్ర ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైనా ఎన్నికల హామీలలో భాగంగా సూపర్‌ సిక్స్‌ హామీల అమల్లో విఫలం అయిందనేది జ‌గ‌న్ చెబుతున్న మాట‌. అయితే.. రాష్ట్రాన్ని ఊడ్చేశార‌ని.. కాబ‌ట్టి నిధులు ఎక్క‌డున్నాయ‌న్న‌ది చంద్ర‌బాబు చెబుతున్న మాట‌. ఈ రెండు వ్య‌వ‌హారాలు ప‌ర‌స్ప‌ర విరుద్ధ‌మే అయినా.. రాజ‌కీయంగా ఎదురు దాడి చేసుకునేందుకు రెండు పార్టీల‌కు క‌లిసి వ‌చ్చిన అంశాలుగా మారాయి. ఈ క్ర‌మంలో దీనిని కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు పెట్టాల‌నేది జ‌గ‌న్ వ్యూహంగా ఉంది. మ‌రి కూట‌మి ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.