బాబు మార్క్ విజన్ అదే అంటున్న జగన్!
విజన్ అంటే చంద్రబాబు ఆయన అంటేనే విజన్. ఆయన్ని అందుకే విజనరీ అని కూడా అంటారు.
By: Tupaki Desk | 16 Dec 2024 4:08 AM GMTవిజన్ అంటే చంద్రబాబు ఆయన అంటేనే విజన్. ఆయన్ని అందుకే విజనరీ అని కూడా అంటారు. 1995లో తొలిసారి సీఎం అయిన చంద్రబాబు 1998లో అప్పటికి 22 ఏళ్ళ ముందు భవిష్యత్తుని అంచనా చేస్తూ విజన్ 2020 అన్నారు. ఇక 2014లో ఆయన అధికారంలోకి వచ్చాక మళ్లీ ఏపీ విజన్ 2029 అంటూ స్లోగన్ ఇచ్చారు. ఇక నాలుగవ సారి 2024లో సీఎం కాగానే చంద్రబాబు విజన్ 2048 అన్నారు. దానికి స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ అని కూడా ట్యాగ్ ఇచ్చారు. ఈ విజన్ డాక్యుమెంట్ ని అట్టహాసంగా ఆయన విజయవాడలో జరిగిన భారీ సభలో విడుదల చేశారు.
అయితే ఈ విజన్ మీద విపక్షాలు అపుడే విమర్శలు చేయడం మొదలెట్టాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అయితే ముందు రైతులు పేదలు ఇతర వర్గాల గురించి చూడండని బాబుకు సలహా ఇచ్చారు. అంతే కాదు హామీల గురించి కూడా ఆలోచించాలని సూచించారు. అంతే తప్ప విజన్ అంటూ చెప్పడం వల్ల ఉపయోగం లేదని ఆయన విమర్శించారు.
ఇపుడు వైసీపీ వంతు అన్నట్లుగా జగన్ సీన్ లోకి వచ్చారు. ఆయన చంద్రబాబు విజన్ ని పూర్తి స్థాయిలో తప్పు పట్టారు. బాబు విజన్ అంటే డ్రామా తప్ప మరేమీ కాదని అన్నారు. ఆయన 1998లో విజన్ 2020 అన్నారు. ఏమి చేయగలిగారని ప్రశ్నించారు.
ఆయన ఎన్నికల హామీల నుంచి ప్రజలను మభ్యపెట్టడానికే విజన్ డాక్యుమెంట్ అని కొత్తగా తెర మీదకు తెచ్చారని విమర్శించారు. చంద్రబాబుకు సంపద సృష్టించే శక్తియుక్తులు లేవని కూడా జగన్ ద్వజమెత్తారు. ఆయన ఇప్పటికి నాలుగుసార్లు సీఎం గా చేసినా ఎనాడు అయినా రాష్ట్రంలో రెవిన్యూ మిగులు కనిపించిందా అని ప్రశ్నించారు. ఎపుడూ లోటు తోనే ఉందని ఇంకెక్కడ సంపద సృష్టి అని ఆయన నిలదీశారు.
చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ పేరుతో చెప్పేవన్నీ కట్టు కధలే అని ఆయన ఘాటు కామెంట్స్ విజన్-2047 డాక్యుమెంట్ ద్వారా ఏపీ ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్లు చేస్తానంటూ చెప్పడం పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించడమే అన్నారు.
సాధారణంగా నడిచే కాలంతో పాటు ఆదాయం కూడా పెరుగుతుందని దానిని చూపించే బాబు తాను సంపదను సృష్టించాను అని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో ఎపుడూ ప్రైవేట్ కే పెద్ద పీట వేస్తారని ప్రభుత్వ రంగ సంస్థలను పప్పు బెల్లాలుగా అమ్మేస్తారు అని ఫైర్ అయ్యారు.
పేదలను మరింత పేదలుగా తయారుచేయడమే బాబు మార్క్ విజన్ అని జగన్ ధ్వజమెత్తారు. విజన్ డాక్యుమెంట్ పూర్తిగా పబ్లిసిటీ స్టంట్ అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1998లో బాబు డాక్యుమెంట్ ని ప్రజలు వ్యతిరేకైంచారని, అప్పటి స్విట్జర్లాండ్ ఆర్థికమంత్రి పాస్కల్ హైదరాబాద్ వచ్చిన సమయంలో ఇలా విజన్ డాక్యుమెంట్ల పేరిట అబద్ధాలు చెబితే మా దేశంలో అయితే జైలుకు గానీ, ఆసుపత్రికి గానీ పంపిస్తామని తీవ్ర వ్యాఖ్యలే చేశారని జగన్ గుర్తు చేశారు. అంతే కాదు 2014లోనూ చంద్రబాబు విజన్-2029 అన్నారని అది కూడా ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయిందని హాట్ కామెంట్స్ చేశారు.