Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఐవీఆరెస్ పై జగన్ వెటకారం... సర్కార్ పై కీలక వ్యాఖ్యలు!

డోర్ డెలివరీతో ప్రతి పథకం ఇంటికి అందించే పాలన మనదైతే.. నేడు డోర్ డెలివరీ మాట సంగతి దేవుడెరుగు.. టీడీపీ కార్యకర్తల చుట్టూ తిరిగితే తప్ప వచ్చే పరిస్థితి కూడా లేదు.

By:  Tupaki Desk   |   5 Dec 2024 4:05 PM GMT
చంద్రబాబు ఐవీఆరెస్  పై జగన్  వెటకారం... సర్కార్  పై కీలక వ్యాఖ్యలు!
X

డోర్ డెలివరీతో ప్రతి పథకం ఇంటికి అందించే పాలన మనదైతే.. నేడు డోర్ డెలివరీ మాట సంగతి దేవుడెరుగు.. టీడీపీ కార్యకర్తల చుట్టూ తిరిగితే తప్ప వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే.. మళ్లీ పథకాలు ఎలా ఉన్నాయని "హలో" అని ఫోన్ చేసి అడుగుతామంటున్నారు.. అసలు పథకాలు అంటూ ఉంటే కదా! అంటూ జగన్ ఎద్దేవా చేశారు.

అవును... తాడేపల్లి క్యాంపు ఆఫీసులో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమైన జగన్... పార్టీ నేతలకు దిశనిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరు నెలల్లోనే కూటమి పాలనపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని అన్నారు.

కేవలం వైసీపీ ప్రభుత్వం మాత్రమే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేసిందని సగర్వంగా చెప్పగలమన్న వైఎస్ జగన్... మామూలుగా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో మేనిఫెస్టో అంటూ రంగు రంగుల కాగితాలు ఇచ్చి, ఎన్నికలు అయిపోగానే దాన్ని చెత్తబుట్టలో పడేసే పరిస్థితుల నుంచి.. తొలిసారి మేనిఫెస్టోను తూచ తప్పకుండా అమలుచేశామని అన్నారు.

వైసీపీ దృష్టిలో మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావిస్తూ.. అందులో 99శాతం వాగ్దానాలు అమలు చేశామని జగన్ తెలిపారు. బడ్జెట్ తో పాటు ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తామో సంక్షేమ కేలండర్ ను విడుదల చేశామని.. ఆ కేలండర్ ప్రకారం లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశామని.. కేవలం వైసీపీలో మాత్రమే ఇలా జరిగిందని తెలిపారు.

ఈ రకంగా మంచి చేసినా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చిందని.. అందుకు కారణాలు ఏవైనప్పటికీ, వాటిని పక్కనపెడితే.. మనకు గత ఎన్నికల్లో 50% ఓటు షేర్ వస్తే, ఈసారి 40 శాతం వచ్చిందని తెలిపారు.

తన దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యే, ఇన్ ఛార్జ్ లు... మీ దగ్గర అతీ మంచితనం, అతి నిజాయితీ ఈ రెండూ మనకు సమస్యలు అని అంటున్నారని.. కానీ, రేపు మరలా మనం ఈ గుణాలతోనే అధికారంలోకి వస్తామని.. ఆరు నెలల కూటమి పాలనలో టీడీపీ కార్యకర్తలెవరు ఏ ఇంటికీ గర్వంగా వెళ్లలేని పరిస్థితి అని.. మనం వెళ్తే ఇప్పటికీ చిక్కటి చిరునవ్వుతో స్వాగతం పలుకుతున్నారని అన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ లు, సూపర్ సెవెన్ లు మోసాలన్న విషయం ఇప్పటికే తేటతెల్లమైందని.. స్కూల్లో ఇంగ్లిష్ మీడియం లేదు, నాడూ-నేడు లేదు, 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్ లు గాలికి పోయిన పరిస్థితి, ఒక్కమాటలో చెప్పాలంటే ప్రభుత్వ పాఠశాలలన్నీ తిరోగమనంలోకి వెళ్లిపోయాయని జగన్ పేర్కొన్నారు.

ఈ సమయంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని.. తన జిల్లాల పర్యటన కార్యక్రమం సంక్రాంతి తర్వాత జనవరి మూడో వారం నుంచి ప్రారంభం అవుతుందని.. అక్కడే నిద్ర చేస్తానని.. ప్రతీ బుధవారం, గురువారం ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు రోజులు అక్కడే ఉంటానని జగన్ తెలిపారు.