Begin typing your search above and press return to search.

ఆ రెండే సీఎంగా చేస్తాయంటున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ అయితే 2024 ఎన్నికల ఫలితాల మీద భిన్నంగా వివిధ సందర్భాలలో స్పందిస్తున్నారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   30 Nov 2024 4:30 PM GMT
ఆ రెండే సీఎంగా చేస్తాయంటున్న జగన్ !
X

వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అయితే అతి విశ్వాసంతోనా లేక తనదైన ఆలోచనలతోనా ఏమో తెలియదు కానీ 2024లో వచ్చిన దారుణమైన ఫలితాలను పూర్తి స్థాయిలో సమీక్షించుకోవడానికి నిరాకరిస్తున్నారు అనే అంటున్నారు. ఒక రాజకీయ పార్టీ ఒక ఎన్నికలో 151 సీట్లు గెలిచి ఆ మరుసటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం అయితే దానికి డిజాస్టర్ రిజల్ట్ అనే అంటారు.

నూటికి 95 శాతం పైగా నియోజకవర్గాలలో వైసీపీ ఓటమి పాలు అయింది. ఇక టీడీపీ కూటమికి వచ్చిన మెజారిటీలు చాలా చోట్ల అత్యధికంగా ఉన్నాయి. వార్ వన్ సైడ్ అయింది. ల్యాండ్ స్లైడ్ విక్టరీ కూటమికి దక్కింది. చరిత్రలో అపూర్వమైన విజయంగా కూటమి దక్కించుకుంది.

ఈ నేపథ్యంలో ఎక్కడ పొరపాటు జరిగింది అన్నది పార్టీ అధినాయకత్వం పరిశీలించాలి. నిర్మొహమాటంగా ఆత్మ విమర్శ చేసుకోవాలి. జరిగిన పొరపాట్లను తిరిగి చేయకుండా జాగ్రత్త పడాలి. కానీ వైసీపీ అధినాయకత్వం తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉందని అంటున్నారు

వైసీపీ అధినేత జగన్ అయితే 2024 ఎన్నికల ఫలితాల మీద భిన్నంగా వివిధ సందర్భాలలో స్పందిస్తున్నారు అని అంటున్నారు. ఎన్నికల్లో ఓటమి తరువాత ఈవీఎంల మీద గతంలో వైసీపీ హై కమాండ్ విమర్శలు చేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు.

ఇపుడు చూస్తే తాడేపల్లిలో పార్టీ క్యాడర్ సమావేశంలో జగన్ మాట్లాడుతూ తనలోని అతి మంచితనం అతి నిజాయతీ వల్లనే ఎన్నికల్లో ఓటమి పాలు కావాల్సి వచ్చిందని ప్రకటించారు. ఇవే తనకు ఎక్కువగా ఎన్నికల్లో నష్టం కలిగించాయని ఆయన అంటున్నారు.

పార్టీ ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యాక ప్రజలు కొంతమంది తన వద్దకు వచ్చి ఇదే విషయం చెప్పారని జగన్ ఈ సమావేశంలో చెప్పారు. తాను ప్రతీ సంక్షేమ పధకాన్ని బటన్ నొక్కి ప్రజలకు చాలా సులువుగా చేరవేశాను అని ఆయన అన్నారు దానిని చూసిన తరువాత ఎవరైనా ఈ విధంగా చేయగలరని ప్రజలు భావించారు అని జగన్ అన్నారు. పైగా చంద్రబాబు తన కంటే ఎక్కువ హామీలు ఇచ్చారు కాబట్టి ఆయన వైపు మొగ్గారని కూడా ఆయన చెబుతున్నారు. ఇలా తన అతి మంచితనం నిజాయతీ వల్లనే ఓటమి పాలు కావాల్సి వచ్చిందని జగన్ అంటున్నారు.

అయితే ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అన్నది వైసీపీ హై కమాండ్ కూడా బేరీజు వేసుకుందా అన్నది మరో చర్చగా ఉంది. నిజానికి హామీలు టీడీపీ కూటమి ఎక్కువగా ఇవ్వడం వల్ల జనాలు ఆ వైపుగా మొగ్గు చూపారు అన్నది ఒక రకమైన సమీక్షగానే చూడాలి. కానీ అది ఒక్కటే కాదు వైసీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కూడా టీడీపీ కూటమికి అనుకూలంగా మారింది అన్న దానిని అధినాయకత్వం ఎందుకు గుర్తించలేకపోతోంది అని అంటున్నారు.

ఇంతటి స్థాయిలో ప్రజలు కూటమిని మాండేట్ ఇచ్చారు అంటే దానికి కారణం వైసీపీ అయిదేళ్ళ పాలనలో జరిగిన తప్పిదాలు అన్న సంగతిని ఈ రోజుకీ గుర్తించకుండా ఉంటే జగన్ భ్రమలలో ఉన్నారా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అలా ఫలితాల మీద తమకు అనుకూలంగానే సమీక్షలు చేసుకుంటే మాత్రం ఇబ్బంది వైసీపీ మొత్తానికి అని కూడా అంటున్నారు.

ఇదిలా ఉంటే జగన్ చేసిన వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో టీడీపీ మద్దతుదారులు రియాక్ట్ అయ్యారు. ఒక పార్టీ రాష్ట్రంలోని ఏకంగా 95 శాతానికి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలలో ఓటమి పాలు అయింది అంటే దానికి కారణాలు కేవలం ధర్మం న్యాయం వంటి పదాలతో పోల్చి తగ్గించలేమని అంటున్నారు. అనేక విషయాలు ఉండబట్టే కూటమి గెలిచింది వైసీపీ ఓడింది అన్నది అసలు సత్యమని అంటున్నారు. వైసీపీ విషయంలో చాలా తప్పుగా ఉన్నాయని వారు విశ్లేషిస్తున్నారు.

అయితే వీటిని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సిన వైసీపీ మాత్రం జనాలదే తప్పు అన్నట్లుగా ఆలోచిస్తోంది అని అంటున్నారు. పైగా టీడీపీ కూటమి హామీల వల్ల వారు అటు వైపు వెళ్లారు అని సర్దిచెప్పుకుంటోంది. అంతే కాదు జగన్ అయితే తన అతి మంచితనం, అతి నిజాయితి మళ్లీ సీఎంగా చేస్తాయని అంటున్నారు.

ఈ రకమైన ప్రకటనలు చేయడం ద్వారా గ్రౌండ్ లెవెల్ లో అసలు ఏమి జరిగింది వైసీపీని ఎందుకు జనాలు తిరస్కరించారు అన్న వాస్తవాలను అంగీకరించడానికి ఆయన నిరాకరిస్తున్నారని అంటున్నారు. మరి ఈ విధంగా చూస్తే కనుక జగన్ ఈ భ్రమలో ఎంత కాలం ఉంటే అంతలా నష్టం వైసీపీకి జరుగుతుందని అంటున్నారు.