Begin typing your search above and press return to search.

పవన్ మీద ఈగవాలనివ్వని టీడీపీ...లాజిక్ అదే !

పవన్ కళ్యాణ్ జనసేన అధినేత. ఏపీ ఉప ముఖ్యమంత్రి. అంతే కాదు ఆయన సినీ గ్లామర్ నిండుగా ఉన్న ప్రముఖ స్టార్.

By:  Tupaki Desk   |   7 March 2025 1:00 AM IST
పవన్ మీద ఈగవాలనివ్వని టీడీపీ...లాజిక్ అదే !
X

పవన్ కళ్యాణ్ జనసేన అధినేత. ఏపీ ఉప ముఖ్యమంత్రి. అంతే కాదు ఆయన సినీ గ్లామర్ నిండుగా ఉన్న ప్రముఖ స్టార్. బలమైన సామాజిక వర్గం ఆకాంక్షలకు ప్రతిరూపం. అందుకే ఆయన రాజకీయ జీవితం ఇపుడు పటిష్టంగా సాగుతోంది. పవన్ ని ఎవరైనా ఏమైనా అంటే జనసైనికులు భగ్గుమంటారు.

గట్టిగా కౌంటర్ ఇచ్చేంతవరకూ అసలు ఊరుకోరు. అది రాజకీయ పార్టీలలో సహజం. అయితే ఇపుడు ఏపీ రాజకీయాలలో మరో చిత్రం చోటు చేసుకుంది. పవన్ మీద ఈగవాలనివ్వమన్న ధోరణిలో టీడీపీ ఉంది. పవన్ ని ఎవరైనా ఏమైనా అంటే అసలు స్పేర్ చేయమని కూడా టీడీపీ గట్టి హెచ్చరికలను పంపిస్తోంది.

లేటెస్ట్ గా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ పవన్ ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్య ఒకటి చేశారు. పవన్ కార్పోరేటర్ కి ఎక్కువ. ఎమ్మెల్యేకి తక్కువ అని ఆయన గాలి తీసేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ పంచ్ పవన్ కి గట్టిగాన తగాలాలనే జగన్ వేశారు అనుకోవాలి.

పవన్ ని సీరియస్ పొలిటీషియన్ గా వైసీపీ ఎపుడూ గుర్తించడంలేదు అని అంటారు. దానికి కొనసాగింపు అన్నట్లుగానే ఈ పంచ్ ఉందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కి ఏమీ తెలియదు అన్న భావంతోనే జగన్ ఈ విధంగా వ్యాఖ్యానించారు అని అంటున్నారు. నిజానికి చూస్తే ఓటమి తరువాత వైసీపీ నేతలు పవన్ మీద విమర్శలు చేయడం లేదు.

పవన్ ని గత అయిదేళ్ళూ తామే అనవసరంగా విమర్శించి రెచ్చగొట్టి టీడీపీతో చేతులు కలిపేలా చేశామని చివరికి అదే తమకు ఓటమిని అందించింది అన్న చర్చ కూడా వైసీపీలో ఉంది. మరో వైపు చూస్తే పవన్ ని పక్కన పెట్టి టీడీపీ మీదనే వైసీపీ విమర్శలు చేస్తోంది. దీంతో 2029 ఎన్నికలలో ఏమైనా జరుగుతుందా అన్నది కూడా అంతా అనుకుంటున్న నేపధ్యమూ ఉంది.

కానీ సడెన్ గా జగన్ పవన్ మీద చేసిన ఈ హాట్ కామెంట్స్ వేసిన పంచులతో ఒక్కసారిగా ఏపీ పాలిటిక్స్ లో ప్రకంపనలు రేగాయి. పవన్ రాజకీయ రూపాన్ని ఆయన ఇమేజ్ ని తక్కువ చేసి జగన్ మాట్లాడారు అని జన సైనికులు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేశారు.

వారి సంగతి పక్కన పెడితే టీడీపీ విషయమే ఇపుడు రాజకీయంగా మరింత చర్చకు ఆస్కారం ఇస్తోంది. ఏకంగా నారా లోకేష్ మీడియా ముందుకు వచ్చి పవన్ కి అండగా నిలబడ్డారు. పవన్ ని ఊరకే అంటే తాము సహించమని వైసీపీకి ఆయన హెచ్చరికలు జారీ చేశారు. పవన్ ఉప ముఖ్యమంత్రి ఆయనకు వచ్చిన సీట్లూ ఓట్లు లెక్క చూసుకోండి అని వైసీపీకి సవాల్ విసిరారు

ఆయనను ఆయన పదవిని అవమానిస్తారా అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఇలా అనగానే లోకేష్ అలా కౌంటర్ ఇవ్వడం ఇపుడు ఏపీ పాలిటిక్స్ లో చర్చకు తావిస్తోంది. జనసైనికుల కంటే ఎక్కువగా టీడీపీ ఈ విషయమో స్పందిస్తోంది. లోకేష్ పవన్ మీద విమర్శలను ఖండించాక మొత్తం టీడీపీ వర్గాలు కూడా ఖండించాల్సిన అవసరం ఏర్పడుతోంది.

ఇంకోవైపు చూస్తే గతంలో 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ప్రకటించిన పవన్ ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కారకులు అయ్యారు. అయితే ఆయన టీడీపీ విధానాలను సైతం అప్పట్లో విమర్శించారు. దానికి టీడీపీ శ్రేణులు కౌంటర్లు ఇచ్చాయి. అదే సమయంలో వైసీపీ నుంచి కూడా భారీ విమర్శలు పవన్ ఎదుర్కొన్నారు.

అయితే పవన్ ని వైసీపీ నేతలు విమర్శించినపుడు టీడీపీ పూర్తి మౌనం వహించింది. తమకేమీ సంబంధం లేనట్లుగా వ్యవహరించింది. పవన్ మద్దతుతో అధికారంలోకి వచ్చి ఇలా ఆయనను వదిలేస్తారా అని జనసైనికులు గుస్సా అయిన సందర్భాలు ఉన్నాయి. దాంతో ఈసారి చాలా ముందుగానే అలెర్ట్ అయి వైసీపీని లోకేష్ నుంచి అంతా కలసి టార్గెట్ చేస్తున్నారు.

పవన్ ని ఏమైనా అంటే భరించలేమని గట్టి సందేశం ఇస్తున్నారు. ఆ విధంగా జనసేనను మరింత దగ్గరగా తీసుకోవడమే కాకుండా ఒక బలమైన సామాజిక వర్గం దన్ను కూడా తమ వైపు ఉండేలా చూసుకుంటోంది తెలుగుదేశం. ఒక విధంగా టీడీపీకి ఈ చాన్స్ ఇచ్చిన వైసీపీ అధినాయకత్వం వ్యూహాలు లేనితనాన్ని అంతా చర్చించుకుంటున్నారు.