Begin typing your search above and press return to search.

రెడ్ బుక్ మాటకు సరైన కౌంటర్ ఇచ్చిన జగన్.. ఆచరణ మాటేంటి?

రెడ్ బుక్ మీద ఇప్పటివరకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేసినా.. ఇటీవల చేసిన "గుడ్ బుక్" మాట సరైన కౌంటర్ గా అభివర్ణిస్తున్నారు.

By:  Tupaki Desk   |   12 Oct 2024 6:30 AM GMT
రెడ్ బుక్ మాటకు సరైన కౌంటర్ ఇచ్చిన జగన్.. ఆచరణ మాటేంటి?
X

గత ప్రభుత్వం తమను వేధింపులకు గురి చేసిందని.. అందుకు ప్రతిగా తమను ఇబ్బంది పెట్టిన వారి పేర్లను తన రెడ్ బుక్ లో రాసుకుంటున్నట్లుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కుమారరత్నం లోకేశ్ నోటి నుంచి వచ్చిన మాట అప్పట్లో ఒక సంచలనం. అందుకు తగ్గట్లే.. తన పాదయాత్ర వేళలోనూ రెడ్ బుక్ ప్రస్తావన తరచూ తెచ్చేవారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ రెడ్ బుక్ గురించి అప్పట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దగా పట్టించుకునే వారని చెప్పాలి. ఈ వాదనకు తగ్గట్లే.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ మీద సరైన కౌంటర్ పడింది లేదు.

ఎప్పుడైతే ఎన్నికల్లో దారుణ ఫలితాల్ని ఎదుర్కొన్నారో.. అప్పటి నుంచి ఆయన తరచూ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకురావటం.. కూటమి సర్కారు ఇమేజ్ ను డ్యామేజ్ చేసే వ్యాఖ్యల్ని చేయటం కనిపిస్తుంది. రెడ్ బుక్ మీద ఇప్పటివరకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేసినా.. ఇటీవల చేసిన ‘‘గుడ్ బుక్’’ మాట సరైన కౌంటర్ గా అభివర్ణిస్తున్నారు. రెడ్ బుక్ లో ఏముంటుంది? దాన్ని ఎలా వాడతామన్న దానిపై జగన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

రాజకీయాల ద్వారా కక్షలు.. కోపతాపాలకు చెక్ పెట్టి.. ప్రజల డెవలప్ మెంట్ మీద మాత్రమే తమ ఫోకస్ అన్న విషయాన్ని జగన్ నోటి నుంచి రావటం ఒక మంచి పరిణామంగా చెబుతున్నారు. అంతేకాదు.. గుడ్ బుక్ పేరుతో తాను రాసుకునే పుస్తకం గురించి చెప్పిన జగన్.. పార్టీ నేతలకు..ద్వితీయశ్రేణి నాయకులకు.. కార్యకర్తలకు ఒక మార్గదర్శకాన్ని ఇచ్చారని చెప్పాలి.

తమ చేతిలో అధికారం ఉన్నప్పుడు ప్రతి ఇంటికి మంచి చేయాలనే తాము చూశామని.. అందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వం మాత్రం రెడ్ బుక్ పాలన సాగిస్తుందన్న వాదనను వినిపించారు జగన్మోహన్ రెడ్డి. నిజమే.. జగన్ సర్కారులో రాష్ట్రంలోని 87 శాతం మంది ఏదో ఒక పథకం ద్వారా లబ్థి పొందిన వారే. ఇంత చేసిన తర్వాత కూడా ఘోర ఓటమికి కారణం ఏమిటన్నది చూస్తే..రాష్ట్రంలో డెవలప్ మెంట్ విషయంలో జగన్ సర్కారు అనుసరించిన విధానమే.

ప్రజలు అధికారాన్ని ఇచ్చేది పాలించేందుకే తప్పించి.. ప్రతిపక్షాలను టార్గెట్ చేసేందుకు కానే కాదన్న విషయాన్ని జగన్ ఇప్పటికే అర్థం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఆలోచనలే ఆయన చేత గుడ్ బుక్ మాటల్ని చెప్పించి ఉంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. తన గుడ్ బుక్ లో మంచి పని చేసే అధికారుల పేర్లు రాస్తామని.. పార్టీ కోసం పని చేసే వారి పేర్లు నమోదు చేస్తామని చెప్పటం ద్వారా నిరాశలో కూరుకుపోయిన వర్గాల్లో కొత్త ఆశల్ని చిగురించే ప్రయత్నం చేశారని చెప్పాలి.

మంచి ఫ్యూచర్ కోసం ఆలోచించే వారికి కొత్త ప్రోత్సాహకాన్ని గుడ్ బుక్ రూపంలో జగన్మోహన్ రెడ్డి తెర మీదుకు తీసుకొచ్చారని చెప్పాలి. అంతేకాదు.. రెడ్ బుక్ కు సరైన సమయంలో సరైన రీతిలో కౌంటర్ ఇచ్చారని చెప్పక తప్పదు. అదే సమయంలో.. తాను చెప్పిన మాటలకు తగ్గట్లే చేతలు కూడా ఉన్నాయన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చేయాల్సిన బాధ్యత కూడా జగన్ మీదనే ఉందన్న విషయాన్ని ఆయన మర్చిపోకూడదు. మరేం జరుగుతుందోకాలమే సరైన రీతిలో సమాధానం ఇస్తుందని చెప్పాలి.