మళ్లీ అదే మాట.. జగన్ మారేదెప్పుడు?
ఇప్పుడు తాజాగా తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించిన జగన్.. అక్కడి అరటి తోటల రైతులను పరామర్శించారు.
By: Tupaki Desk | 26 March 2025 7:49 AMరాజకీయ నాయకులకు మాటలు కొదవకాదు. సమయాన్ని బట్టి.. సందర్భాన్ని బట్టి.. వారు ఎన్ని మాటలై నా అల్లేయొచ్చు. జనాలను మెప్పించవచ్చు. కానీ, అదేం చిత్రమో .. వైసీపీ అధినేత జగన్ మాత్రం ఒకే మాటను పట్టుకుని వేలాడుతున్నారు. గతంలో ఎన్నికలకు ముందు కూడా.. క్షేత్రస్థాయిలో పార్టీ నాశనం అవుతోందని సమాచారం ఉన్నా.. 'వైనాట్ 175' అంటూ.. ఊరూ.. వాడా.. ప్రచారం చేశారు. ఇది వికటించింది. అయినా.. తన పంథాను జగన్ మార్చుకోలేదు.. తాను కూడా మారలేదు.
తాజాగా ఎక్కడ మాట్లాడినా.. ఆయన గత రెండు మాసాలుగా ``మళ్లీ మన ప్రభుత్వం వచ్చేస్తుంది`` అని వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే. విజయవాడ జైల్లో ఉన్న వంశీని పరామర్శించినప్పుడు కూడా మీడియాతో మాట్లాడుతూ.. ``మన ప్రభుత్వం వచ్చేస్తుంది.. అప్పుడు అండమాన్‌లో దాక్కున్నా తీసుకువచ్చి బట్టలు ఊడదీసి తంతాం`` అని జగన్ వ్యాఖ్యానించారు. దీనిపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత.. గుంటూరులో మిర్చి రైతులను పరామర్శించినప్పుడు కూడా సేమ్ టు సేమ్.. వ్యాఖ్యలు సంధించారు.
ఇక, ఇప్పుడు తాజాగా తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించిన జగన్.. అక్కడి అరటి తోటల రైతులను పరామర్శించారు. అకాల వర్షంతో ఇక్కడి అరటి తోటలు కుప్పకూలాయి. వీరిని పరామర్శించినప్పుడు.. ఒక పార్టీ అధినేతగా.. మాజీ సీఎంగా జగన్ తక్షణ ఉపశమనం పొందేలా రైతులను ఊరడించాలి. ప్రభుత్వంపై రైతుల తరఫున పోరాటం చేసి.. నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పాలి. లేదా.. ప్రతిపక్షంగా అక్కడికక్కడే ఎంతో కొంత రైతుల చేతిలో సొమ్ములు పెట్టాలి. కానీ, జగన్ తన తీరు మార్చుకోలేదు.
''మూడు ఏళ్లు ఓర్చుకోండి. మళ్లీ మన ప్రభుత్వం వచ్చేస్తుంది. మీ కష్టాలు తీరుస్తా.'' అని జగన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రత్యర్థుల మాట ఎలా ఉన్నా.. అక్కడే ఉన్న మహిళా రైతులు నవ్వుకున్నారు. ఆకలేస్తోందన్న వారికి ఇప్పుడు అన్నం పెట్టకుండా.. మూడేళ్లు ఆగండి! అన్నట్టుగా ఉంది.. అంటూ నవ్విపోయారు. అయినా.. జగన్ చెబుతున్నట్టు మూడేళ్లు కాదు.. ఎన్నికలు వచ్చేందుకు నాలుగు సంవత్సరాల సమయం ఉంది. అయినా.. అప్పటికి ఎవరు రాజో.. ఎవరు రెడ్డో ఎవరు చెప్పగలరు అని పలువురు రైతులు.. తర్వాత వ్యాఖ్యానించడం గమనార్హం.