Begin typing your search above and press return to search.

జగన్‌ కు మరో కష్టం!

ఇది చాలదన్నట్టు వరుసగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు పార్టీకి రాజీనామాలు ప్రకటిస్తున్నారు.

By:  Tupaki Desk   |   6 Sep 2024 11:17 AM GMT
జగన్‌ కు మరో కష్టం!
X

ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరం ఓడిన సంగతి తెలిసిందే. వై నాట్‌ 175 అంటూ ఘీంకరించి చివరకు 11 స్థానాలకే చాప చుట్టేసింది. ఆ పార్టీ సీనియర్‌ నేతలు, మహామహులైన నేతలంతా ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఇది చాలదన్నట్టు వరుసగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు పార్టీకి రాజీనామాలు ప్రకటిస్తున్నారు.

ఈ కష్టాలు చాలవన్నట్టు మరికొందరు నేతలు వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులకు జైలుపాలవుతున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ అరెస్టు అయ్యారు. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ మంత్రి జోగి రమేశ్, విజయవాడ నేత దేవినేని అవినాశ్‌ పరారీలో ఉన్నారని చెబుతున్నారు.

ఈ పరిస్థితుల మధ్య వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ విదేశీ యాత్రకు కూడా బ్రేక్‌ పడింది. వైఎస్‌ జగన్‌ కు ఉన్న డిప్లొమాటిక్‌ (దౌత్య) పాస్‌ పోర్టు రద్దయింది. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండటంతో ఆయనకు దౌత్య పాస్‌ పోర్టు ఉండేది. అయితే ఇప్పుడు ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమే. దీంతో దౌత్య పాస్‌ పోర్టు రద్దయింది. దీంతో వైఎస్‌ జగన్‌ సాధారణ పాస్‌ పోర్టు తీసుకోవాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో జగన్‌ సాధారణ పాస్‌ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఐదేళ్ల కాలానికి పాస్‌ పోర్టు ఇవ్వాలని హైదరాబాద్‌ లోని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టులో కూడా జగన్‌ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ ను విచారించిన న్యాయస్థానం జగన్‌ కు ఒక సంవత్సరం కాల వ్యవధితో సాధారణ పాస్‌ పోర్టు మాత్రమే జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

ప్రజా ప్రతినిధుల కోర్టు ఇచ్చిన తీర్పును జగన్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఈమేరకు ఆయన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ పై విచారణను హైకోర్టు సెప్టెంబర్‌ 9కి వాయిదా వేసింది. దీంతో జగన్‌ విదేశీ యాత్ర వాయిదా పడింది.

వాస్తవానికి సెప్టెంబర్‌ 3న జగన్‌ లండన్‌ బయలుదేరాల్సి ఉంది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు నుంచి అనుమతి కూడా తెచ్చుకున్నారు. లండన్‌ లో చదువుతున్న తన కుమార్తె పుట్టిన రోజు వేడుకల కోసం సెప్టెంబర్‌ 25 వరకు అక్కడే ఉండాలని భావించారు.

అయితే విజయవాడలో వరదలు, పార్టీ ఎంపీలు మోపిదేవి వెంకట రమణారావు, బీద మస్తాన్‌ రావు, ఇతర కీలక నేతలు పార్టీకి రాజీనామా చేయడం, మరికొందరు నేతలు వివిధ కేసుల్లో జైలుపాలు కావడం వంటి కారణాలతో వైఎస్‌ జగన్‌ తన లండన్‌ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని నిర్ణయించారని అంటున్నారు. అంతేకాకుండా ఆయన పాస్‌ పోర్టు విషయంలో ఇబ్బందుల వల్ల కూడా లండన్‌ యాత్ర ప్రస్తుతానికి వాయిదా పడిందని సమాచారం.

ఏపీ హైకోర్టులో జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ సెప్టెంబర్‌ 9న విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇస్తుందో, లేదో వేచిచూడాల్సిందే.