Begin typing your search above and press return to search.

ఇండియా కూటమి మద్దతు దక్కని జగన్?

జగన్ ఎన్నడూ లేనంతగా రాజకీయ ఆత్మ రక్షణ స్థితిలోకి వెళ్ళారు. చంద్రబాబు ఎంతటి చాణక్యుడో వైసీపీకి తెలిసి వచ్చింది అని చెప్పాలి.

By:  Tupaki Desk   |   22 Sep 2024 7:30 PM GMT
ఇండియా కూటమి మద్దతు దక్కని జగన్?
X

జగన్ ఎన్నడూ లేనంతగా రాజకీయ ఆత్మ రక్షణ స్థితిలోకి వెళ్ళారు. చంద్రబాబు ఎంతటి చాణక్యుడో వైసీపీకి తెలిసి వచ్చింది అని చెప్పాలి. ప్రతీ దానికీ జగనే కారకుడు అంటూ మూడు నెలలుగ తెగ విమర్శలు చేస్తూ వచ్చిన చంద్రబాబు అత్యంత సున్నితమైన అంశంగా ఉన్న శ్రీ వారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చేసిన ఆరోపణలతో వైసీపీ షేక్ అయిపోయింది.

దాని నుంచి ఎలా బయటపడాలో కూడా అర్థం కాని పరిస్థితి. వైసీపీ ఇలా పవిత్రమైన తిరుమలలో అపచారం చేసిందని టీడీపీ కూటమి ఒంటి కాలి మీద దండెత్తి వస్తూంటే జగన్ తప్ప మరొకరు ఎవరూ జవాబు చెప్పేందుకు లేకపోవడం విచిత్రమే. జగన్ ఏరి కోరి నియమించిన మాజీ టీటీడీ అధికారి ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నారో తెలియదు.

అలాగే మొదటి రెండు రోజులు మీడియా ముందుకు వచ్చిన వైవీ సుబ్బారెడ్డి కూడా సైలెంట్ అయ్యారు. మొత్తం వ్యవహారం జగన్ కే ఉచ్చు బిగిస్తోంది. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినది. ఇందులో నిజానిజాల వరకూ ఎవరూ ఆగరు. జరిగింది తప్పు అనే అంటున్నారు

దాంతో వైసీపీకి ఏమి పాలు పోక చివరికి ఎన్డీయే కూటమినే ఆశ్రయించింది. ప్రధాని నరేంద్ర మోడీకి లేఖను జగన్ రాయడం అందులో భాగమే అని అంటున్నారు. ఆ లేఖలో వాస్తవాలను బయటపెట్టాలని జగన్ కోరారు. అయితే బీజేపీకి చెందిన యువజన విభాగం బీజేవైఎం జగన్ ఇంటి ముందు ఆందోళన నిర్వహించింది. బీజేపీ నేతలు అంతా పెద్ద ఎత్తున జగన్ మీద విరుచుకు పడుతున్నారు

ఏపీలో చూస్తే కమలనాధులు గరం గరం అవుతున్నారు. మరి అదే పార్టీకి చెందిన మోడీ ఏ విధంగా వాస్తవాలు బయటకు తెస్తారు అని జగన్ అనుకుంటున్నారో అర్ధం కానిదే అంటున్నారు ఈ సమయంలో ఇండియా కూటమి నుంచి వైసీపీకి మద్దతు ఏదీ లభించడంలేదు. కేవలం తృణమూల్ కాంగ్రెస్ నుంచే లభించింది. అద్ని కూడా ఆ పార్టీ ఎంపీ సాకెత్ గోఖలే మాత్రం తిరుమల లడ్డూ వివాదం ఫేక్ కావచ్చు అని అన్నారు.

ఎందుకంటే కారణం చెబుతూ చంద్రబాబు కు ఉన్న హెరిటేజ్ సంస్థను ఆయన ఇందులోకి లాగారు. ఆ సంస్థ ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారు అని కూడా అన్నారు. హెరిటేజ్ షేర్లలో 1200 కోట్ల లాభం ఆ సంస్థకు వచ్చిందని అన్నారు. ఇక తిరుమల శ్రీవారి లడ్డూలో వాడిన నెయ్యి పైన అనుమానాలు ఉండడం అంటే ఆ ఆరోపణలు చేసిన సీఎం చంద్రబాబుకు డెయిరీ సామ్రాజ్యమే ఉందని ఆయన రెండింటికీ లింక్ పెట్టి వదిలారు.

నిజానికి ఈ కోణంలో ఎవరూ రియాక్ట్ కాలేదు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ చేసిన ఈ కామెంట్స్ మాత్రమే వైసీపీకి కొంత మద్దతుగా ఉన్నాయి. కాంగ్రెస్ సహా అనేక పార్టీలు ఇది తప్పు అనే అంటున్నాయి. విచారణను కోరుతున్నాయి. ఇక రాహుల్ గాంధీ అయితే అధికారులు తప్పు చేసి ఉండొచ్చు అని అంటున్నారు. దానికి రాజకీయంగా ఆయన ఎక్కడా ముందుకు తేలేదు. అది ఒకింత ఊరట అనుకోవాలి.

ఏది ఏమైనా తిరుమల శ్రీవారి లడ్డూ అంటేనే బలమైన సెంటిమెంట్. దాంతో హిందువుల మనోభావాలకు అనుగుణంగానే ఎవరైనా రియాక్టు కావాల్సిందే. అయితే వామపక్షాలు ఈ విషయంలో నిజాలు తేల్చమని అంటున్నాయి తప్ప రాజకీయ విమర్శలు చేయడం లేదు. మొత్తానికి చూస్తే మాత్రం ఇండియా కూటమి వైపు నుంచి వైసీపీకి మద్దతు అయితే దక్కడంలేదు.

అదే సమయంలో ఎన్డీయేలో పెద్దన్న అయిన బీజేపీని వైసీపీ నిజాలు నిగ్గు తేల్చమని కోరడం అంటే రాజకీయంగా వైసీపీ వ్యూహం ఏమిటి అన్నది కూడా అర్థం కావడం లేదు అని అంటున్నారు. ఈ విషయంలో వైసీపీకి మిగిలి ఉన్న మార్గం న్యాయ విచారణ మాత్రమే అని అంటున్నారు. అలా చేస్తేనే అనేక విషయాలు వెలుగు చూస్తాయని అంటున్నారు. అది కాకుండా సీబీఐ కోరినా అది సెంట్రల్ ఏజెన్సీ. అది ఏమి చెప్పినా వైసీపీకి అనుమానాలు ఉండనే ఉంటాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీ ఏపీలోనే కాదు జాతీయ స్థాయిలోనూ ఒంటరి అయిందా అన్న చర్చ అయితే వస్తోంది.