జగన్ ది వన్ సైడ్ లవ్...క్యాడర్ రెచ్చిపోవద్దు ?
వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చినా క్యాడర్ కి ఏమైనా చేస్తారా అన్న ఆశలు అయితే క్యాడర్ లో పూర్వంలా లేవా అంటే జవాబు వారి నిర్వేదంలోనే కనిపిస్తోంది.
By: Tupaki Desk | 16 Dec 2024 5:30 PM GMTజగన్ అంటే పడి చచ్చి చొక్కాలు చింపుకునే కాలం గతించింది. జగన్ అన్నా అని నోరారా పిలిచి తమ కంటే కూడా ఎక్కువగా ప్రేమించే తరమూ తగ్గిపోయింది. జగన్ అంటే ఒకప్పుడు ఉన్న మోజు క్రేజూ కావాలనే తగ్గించేసుకున్న క్యాడర్ కి మళ్లీ పిలుపులు వలపులు స్వాగతం పలుకుతున్నాయి.
మరోసారి అన్నను సీఎం గా చేద్దాం మన కష్టాలు అన్నీ ఆయన తీరుస్తారు. ఈసారి ఆయన ఉండేది క్యాడర్ పక్షమే అని హైకమాండ్ పెద్దలు ఊదరగొడుతున్నారు. గతంలో తప్పులు జరిగాయని ఒప్పుకుంటూనే ఈసారి అవి జరగనీయమని ఒట్టు వేయకుండానే గట్టిగా చెబుతున్నారు.
మరోసారి జగనన్నను సీఎం కానీయండి. కార్యకర్తలకు నచ్చేలా వారు మెచ్చేలా వారి కోసమే ఆయన పాలన చేస్తారు అని ఊరిస్తున్నారు అయితే ఇవన్నీ వింటున్న వారికి మాత్రం ఎంతో కొంత విస్మయం అయితే కలుగుతోంది. 151 సీట్లతో అయిదేళ్ల పాటు అద్భుతమైన అధికారం అందుకున్న తరువాత జగన్ క్యాడర్ కి చేసింది అయితే ఏమీ లేదని అంతా నిండు నిరాశలో మునిగితేలారు.
పైగా క్యాడర్ కంటే వాలంటీర్లే బలం అనుకుని వారిని తెచ్చి పెట్టి మరీ ఉన్న చోటనే క్యాడర్ ని నీడ విలువ లేకుండా చేశారు అన్నది నిన్ననే జరిగిన ముచ్చట. అయితే వారి కళ్ళు తెరచుకున్నాక వైసీపీ వైభవం మూసుకుపోయింది. 2024 ఎన్నికల్లో క్యాడర్ అంతగా పనిచేయలేదు అన్నది నిజమైన విశ్లేషణ. దానికి కారణాలు అందరికీ తెలుసు.
తప్పు జరిగిపోయింది అని ఈ రోజున హైకమాండ్ పెద్దలు లెంపలేసుకుని మళ్లీ గెలిపిస్తే మీకు అన్నీ చేస్తామంటూ ముందుకు రావడమే క్యాడర్ గమనిస్తున్న కొత్త ముచ్చట. ఇక 2019 సాధారణ ఎన్నికలకు ముందు జగన్ కార్యకర్తలు నా కుటుంబం అని చెప్పారు. ఆయన ప్రతీ మీటింగులో పాదయాత్రలో వారినే తలచారు. కానీ అధికారంలోకి వచ్చాక వైసీపీ క్యాడర్ పాత్ర కూరలో కరివేపాకు మాదిరిగా మారింది.
కార్యకర్తలు ఒక పార్టీ జెండా మోసి ఇంతలా నష్టపోయిన హిస్టరీ సమకాలీన దేశ రాజకీయాలలో లేదనే అంతా అంటారు. క్యాడర్ ఉంటేనే లీడర్ ఉంటేనే అధికారం ఇలా నిచ్చెనమెట్లుగా ఉండే రాజకీయ ముఖ చిత్రంలో క్యాడర్ అట్టడుగునే ఉండొచ్చు. కానీ వారే పునాది. వారి మీద నుంచే ఎవరికైనా దక్కేది అధికార సోపానాలు.
ఇలా అన్నీ తెలిసి కూడా కొత్త ప్రయోగం అంటూ చేయడం క్యాడర్ కి దూరం పెట్టడం వల్లనే ఈ రోజున వైసీపీ ఇలా చతికిలపడి పోయింది అన్నది కూడా అంతా అంటున్న మాటే. ఇక 2024 ఎన్నికలకు వచ్చేసరికి కార్యకర్తలు వద్దని వారి కంటే సంక్షేమ పధకాలు తీసుకునే కోట్లాది ప్రజలే తమకు ముద్దు అని, వారే తిరిగి మళ్లీ వైసీపీని గెలిపిస్తారని కూడా హైకమాండ్ చాలా పెద్ద ఆశలనే పెట్టేసుకుంది.
వాలంటీర్ల వ్యవస్థ బహు గొప్పగా ఉందని సచివాలయం వ్యవస్థ అదుర్స్ అని వీటిని సృష్టించిన జగన్ గ్రేట్ అంటూ కోటరీ వల్లించిన మాటలకే భ్రమించి అందులోనే మునిగి తేలారు. కేవలం నాలుగు సిద్ధం సభలతో ఎన్నికల ప్రచారం ముగిస్తే ఫలితం దారుణంగా వచ్చి 11 నంబర్ దగ్గర కూర్చుంది.
ఇక వైసీపీ పెద్దలు అయితే కార్యకర్తల రక్తంలో భయం అన్నది లేదని అంటూ ఇపుడు ప్రసంగాలు చేస్తున్నారు. ఒక విధంగా వారిని ఉబ్బి తబ్బిబ్బు చేస్తూనే కూటమి ప్రభుత్వం మీద రెచ్చగొడుతున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది.
ఈ విధంగా క్యాడర్ ని పొగిడి మునగ చెట్టు ఎక్కించి వారిని రోడ్డు మీదకు తెస్తే ఆ మీదట కూటమికి ఎదురు నిలిచి కేసులలో చిక్కేది అడ్డంగా బుక్ అయ్యేది వారే అంటే సందేహం ఏముంది అన్న ప్రశ్నలూ ప్రచారంగా ఉన్నాయి.
మరో వైపు చూస్తే సోషల్ మీడియా కేసులలో జైలుకు వెళ్ళిన వారి కడు దైన్యంగా ఉన్నారని అంటున్నారు. వారి కుటుంబాలు అల్లల్లాడుతున్నాయి. వారిది నిజంగా అభిమానంతో కూడిన పోరాటమే. కానీ వారే ఇపుడు కార్నర్ అయ్యారు.
రేపటి రోజున ఇదే తీరున మిగిలిన వారు కూడా అవుతారా అన్న భయాందోళనలు అయితే క్యాడర్ లో ఉన్నాయని అంటున్నారు. జగన్ ని అందరూ ప్రేమించాలని ఆయన మాత్రం ఎవరినీ ప్రేమించలేరా అన్న సందేహాలూ వ్యక్తం చేస్తున్న వారూ ఉన్నారు.
వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చినా క్యాడర్ కి ఏమైనా చేస్తారా అన్న ఆశలు అయితే క్యాడర్ లో పూర్వంలా లేవా అంటే జవాబు వారి నిర్వేదంలోనే కనిపిస్తోంది. కార్యకర్తలు అధినాయకుడు మధ్య బంధం కడు పవిత్రమైనది.అది ఒకనాడు అనుమానంగా మారితే తిరిగి గట్టిపడడం కష్టమే అన్నది జనాంతికమైన రాజకీయ మాట. వైసీపీ క్యాడర్ లో ఇపుడు దీని మీదనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.