Begin typing your search above and press return to search.

కూట‌మి ప్ర‌భుత్వంపై జ‌గ‌న్ పోరుబాట‌.. ఎప్పుడెప్పుడు ఎలా ఎలా?

ఈ నెల నుంచే త‌మ పోరు ప్రారంభ‌మ‌వుతుంద‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు.

By:  Tupaki Desk   |   4 Dec 2024 9:30 PM GMT
కూట‌మి ప్ర‌భుత్వంపై జ‌గ‌న్ పోరుబాట‌.. ఎప్పుడెప్పుడు ఎలా ఎలా?
X

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. జ‌న‌వ‌రి నుంచి ప్ర‌జ‌ల్లోకి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న తాజాగా కూట‌మి స‌ర్కారుపై పోరుబాట పేరుతో షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. గ‌త ఆరు మాసాల్లో కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు చేసింది ఏమీ లేద‌న్న జ‌గ‌న్‌.. అన్నివిధాలా ప్ర‌జ‌ల‌ను ముంచార‌ని వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలో కూట‌మి ప్ర‌భుత్వంపై పోరు చేసేందుకు త‌మ పార్టీ సిద్ధ‌మైంద‌ని వెల్ల‌డించారు. ఈ నెల నుంచే త‌మ పోరు ప్రారంభ‌మ‌వుతుంద‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలో ఆయ‌న వైసీపీ పోరుబాట‌పై షెడ్యూల్ విడుద‌ల చేశారు.

ఈ పోరుబాట కార్య‌క్ర‌మాల్లో వైసీపీ ముఖ్య నాయ‌కులు, జిల్లా ఇంచార్జులు, మాజీ మంత్రులు, పార్టీకార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున పాల్గొనాలని జ‌గ‌న్ పిలుపునిచ్చారు. ఈ నెల నుంచి ద‌శ‌ల వారీగా క‌రెంటు చార్జీల పెంపు స‌హా విద్యార్థుల‌కు ఫీజు రీయింబ‌ర్స్‌మెంటు నిధులు విడుద‌ల చేయాల‌ని కోరుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద ఆందోళ‌న చేయ‌నున్న‌ట్టు జ‌గ‌న్ చెప్పారు. అదేరోజు.. రైతుల స‌మ‌స్య‌ల‌పైనా పోరుకు సిద్ధ‌మవుతున్న‌ట్టు చెప్పారు. ఎన్నిక‌ల‌కు ముందు 20 వేల రూపాయ‌ల ఇన్ పుట్ స‌బ్సిడీ ఇస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చార‌ని.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ వూసు కూడా ఎత్త‌డం లేద‌ని జ‌గ‌న్ ఈ సంద‌ర్భంగా విమ‌ర్శించారు.

త‌మ పాల‌న‌లో రైతుల‌కు అమలు చేసిన ఉచిత పంటల బీమా పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. ఇక‌, ఈ నెల 27న విద్యుత్ చార్జీల పెంపుద‌ల‌కు నిర‌స‌న‌గా ఆందోళ‌న చేయ‌నున్న‌ట్టు జ‌గ‌న్ చెప్పారు. ఎన్నిక‌ల‌కు ముందు విద్యుత్ చార్జీలు త‌గ్గిస్తా మ‌ని .. రూపాయి కూడా పెంచ‌బోమ‌ని హామీ ఇచ్చిన చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక మాట త‌ప్పుతున్నార‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌కు ముందు హామీని నిల‌బెట్టుకోవాల‌ని డిమాండ్ చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్యాల‌యాల‌కు ర్యాలీగా వెళ్లి విజ్ఞాపన పత్రాలు అందించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు చెప్పారు.

ఇక‌, విద్యార్థుల‌కు వ‌స‌తి దీవెన‌, విద్యాదీవెన నిధులు స‌హా ఫీజు రీయింబ‌ర్స్ మెంటు నిధులు విడుద‌ల చేయాల‌ని కోరుతూ.. జ‌న‌వ‌రి 3 న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌ను చేప‌ట్ట‌నున్న‌ట్టు జ‌గ‌న్ చెప్పారు. దీనికి అన్ని ప‌క్షాలు క‌లిసి రావాల‌ని కూడా ఆయ‌న పిలుపునిచ్చారు. వైసీపీ నాయ‌కులు ప్ర‌తి ఒక్క‌రూ ఈ ఆందోళ‌న‌లో పాల్గొనాల‌ని ఆయ‌న కోరారు. విద్యార్థులతో కలిసి కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని విజ‌యవంతం చేసి.. ప్ర‌భుత్వం క‌ళ్లు తెరిచేలా చేయాల‌న్నారు. మ‌రి ఏమేర‌కు ఈ కార్య‌క్ర‌మాలు స‌క్సెస్ అవుతాయో చూడాలి.