Begin typing your search above and press return to search.

మీ నాయకులకు ఇదే గతి చంద్రబాబు.. జ‘గన్’ ఫైర్!

రెడ్ బుక్ ఏదో ఘనకార్యం కాదని.. పాలనను గాలికి వదిలేసి రెడ్ బుక్ మీదనే ఫోకస్ చేశారంటూ విరుచుకుపడ్డారు.

By:  Tupaki Desk   |   12 Sep 2024 4:26 AM GMT
మీ నాయకులకు ఇదే గతి చంద్రబాబు.. జ‘గన్’ ఫైర్!
X

విమర్శలు కాదు ఏకంగా హెచ్చరికలు జారీ చేశారు వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం మీద ఆయన ఘాటుగా రియాక్టు అయ్యారు. తమ పార్టీ నేతల్ని అరెస్టు చేసి జైల్లో పెట్టిన తీరును తప్పు పట్టటమే కాదు.. సూటిగా.. సుత్తి లేకుండా వార్నింగ్ ఇచ్చేశారు. ‘‘చంద్రబాబు.. తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నావ్. మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. మీ నాయకులకు ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లో ఉంటారు’’ అంటూ తీవ్రంగా హెచ్చరించారు.

అక్రమ కేసులో అరెస్టు అయి గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను జగన్మోహన్ రెడ్డి పరామర్శించి.. ధైర్యం చెప్పిన అనంతరం జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి.. నందిగం సురేష్ కు పార్టీ అండగా ఉంటుందన్నారు. నాడు జరిగిన ఘటనలో నందిగం సురేష్ ఉన్నాడా? అని ప్రశ్నించిన జగన్.. సీసీ ఫుటేజ్ లో ఎక్కడైనా కనిపించారా? అని జగన్ ప్రశ్నించారు. ఎల్లప్పుడూ మీ ప్రభుత్వమే ఉండదన్న ఆయన.. ‘‘మీ నాయకులకు ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లో ఉంటారు’’ అంటూ సీరియస్ అయ్యారు.

రెడ్ బుక్ ఏదో ఘనకార్యం కాదని.. పాలనను గాలికి వదిలేసి రెడ్ బుక్ మీదనే ఫోకస్ చేశారంటూ విరుచుకుపడ్డారు. ప్రజా సమస్యలపై చంద్రబాబు పని చేయటం లేదన్న ఆయన.. తుపాను వస్తుందని ముందే చెప్పిన పట్టించుకోలేదన్నారు. తన ఇంటిని రక్షించుకునేందుకు విజయవాడను ముంచారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘బుడమేరు గేట్లు ఎత్తి విజయవాడను ముంచేశారు. చంద్రబాబు తప్పుడు పనికి అరవై మందికి పైగా చనిపోయారు. 60 మందిని పొట్టన పెట్టుకున్న చంద్రబాబుపై కేసు ఎందుకు పెట్టరు?’’ అంటూ ప్రశ్నించారు.

చంద్రబాబు నిర్లక్ష్యంతోనే విజయవాడ అతలాకుతలమైందన్న వైఎస్ జగన్.. బాబు తప్పిదాలను డైవర్టు చేసేందుకే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. నాలుగేళ్ల క్రితం నాటి కేసును తెర మీదకు తెచ్చారని.. సిట్టింగ్ ముఖ్యమంత్రిని టీడీపీ నేత దారుణంగా దూషించారన్నారు. ‘‘ముఖ్యమంత్రిగా నన్ను దూషించినా బాబులా కక్ష సాధింపునకు దిగలేదు. 41ఏ కింద నోటీసులు ఇచ్చి కోర్టులో ప్రవేశ పెట్టాం’’ అని గుర్తు చేశారు. ఎన్నికల వేళ ఇచ్చిన సూపర్ సిక్సు హామీలు మోసమని ఇప్పుడు తేలాయన్నారు.

సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేశారని.. ఇంటింటికి సేవల్ని నిలిపేశారన్నజగన్.. ‘‘ఈ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి సాయం అందలేదు. అమ్మఒడి పథకాన్ని గాలికి వదిలేశారు. బడుల్లో తిండి తినలేక విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు. ఆసుపత్రుల్లో మందులు.. నర్సుల కొరత ఉంది. మెడికల్ కాలేజీల్ని అమ్మేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు రాష్ట్రంలో పాలన ఉందా?’’ అంటూ నిప్పులు చెరిగారు. కూటమి సర్కారు మీద నిప్పులు చెరగటమే కాదు.. సూటిగా హెచ్చరించిన వైనం రాజకీయ సంచలనంగా మారింది. జగన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఏ రీతిలో కౌంటర్ ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.