"సీబీఎన్ గారూ ఇంతటి బరి తెగింపా?"... ఏకేసిన జగన్!
ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 4 Jan 2025 6:44 AM GMTఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి హనీమూన్ పిరియడ్ ముగిసినప్పటికీ ఎన్నికల వేళ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలుకు నోచు కోవడం లేదంటూ వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మైకుల ముందుకు వచ్చిన ప్రతీసారీ జగన్ ఇదే విషయంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సమయంలో మరోసారి బాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జగన్.
అవును... ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. గతంలో జగన్ అమలు చేసిన హామీలకు ఇవి డబుల్ ఉన్నాయనే చర్చ జరిగింది. ఈ సమయంలో కూటమి అధికారంలోకి రావడంలో ఈ హామీలు కీలక భూమిక పోషించాయని అంటారు. అయితే అవి అమలుకు నోచు కోలేదంటూ తాజాగా జగన్ నిప్పులు చెరిగారు.
ఈ మేరకు ఎక్స్ లో సుధీర్ఘ పోస్ట్ పెట్టిన జగన్... ‘ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలపై ఇంతటి బరి తెగింపా, ఇంతటి తేలిక తనమా చంద్రబాబూ... ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుంటారా’ అని ప్రశ్నించారు. ‘లక్షలాది మంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా’ అని నిలదీశారు.
ఈ సందర్భంగా... అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని.. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15,000 చొప్పున ఇస్తామని చెప్పి, అధికారంలోకి రాగానే అంతక ముందు తాము ఇస్తున్న "అమ్మ ఒడి" పథకాన్ని సైతం ఆపేశారని.. ఎన్ని కేబినెట్ మీటింగ్స్ జరిగినా "తల్లికి వందనం" ఎప్పుడు అమలు చేస్తారో చెప్పలేదని మండిపడ్డారు.
తీరా ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్లో తేల్చి చెప్పేశారు.. ఇంతకంటే మోసం ఏమైనా ఉంటుందా.. ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా అంటూ జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు.
ప్రధానంగా... ఎన్నికల ఇంటింటికీ తిరిగి, కనిపించిన ప్రతీ పిల్లాడిని పట్టుకుని.. నీకు రు.15 వేలు, నీకు రూ.15 వేలు, నీకు రు.15 వెలు అని అన్నారని.. ఇద్దరుంటే రూ.30 వేలు అని చెప్పారని.. ముగ్గురుంటే రూ.45 వేలు ఇస్తామన్నారని.. నలుగురు ఉంటే రూ.60 వేలు ఇస్తామన్నారని ఈ సందర్భంగా వైఎస్ జగన్.. చంద్రబాబుకు గుర్తు చేశారు.
వైసీపీ హయాంలో 44.48 లక్షల మంది తల్లులకు, సుమారు 84 లక్షల మంది పిల్లలకు రూ.26,067 కోట్లను తాము అందించి.. అత్యంత సక్సెస్ ఫుల్ గా ‘అమ్మ ఒడి’ని అమలు చేశామని తెలిపారు. అయితే.. మీరు ఇస్తామన్న పథకం వస్తుందేమోనని బడికి వెళ్లే ఆ పిల్లలు, వారి తల్లులు ఈ 7 నుంచి 8 నెలలుగా ఎదురుచూస్తూనే ఉన్నారని జగన్ వెల్లడించారు.
అయితే... చివరికి వారి ఆశలపై నీళ్లు జల్లి.. ఈ ఏడాదికి ఇవ్వమని నిస్సిగ్గుగా చెప్తున్నారు.. ప్రజలకు ఒక మాట ఇచ్చి, దాన్ని నమ్మించి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి సంకోచం లేకుండా ఇవ్వలేమని చెప్తున్నారు.. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది చంద్రబాబు గారూ అంటూ జగన్ విరుచుకుపడ్డారు.
ఇదే సమయంలో... రైతు భరోసా ను ప్రస్థావించిన జగన్... ఈ ఏడాది ఖరీఫ్, రబీ రెండు సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారని.. అదిగో, ఇదిగో అంటూ లీకులు ఇస్తున్నారు కానీ.. ఇప్పటి వరకూ రైతుకు పెట్టుబడి సాయం కింద ఒక్క పైసా కూడా ఇవ్వలేదని జగన్ ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి వచ్చిన 2019 నుంచే క్రమం తప్పకుండా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు!
ఈ విధంగా... ప్రతీ పిల్లాడికి రూ.15 వెలు చొప్పున ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు అని చెప్పిన "తల్లికి వందనం" మోసమే.. రైతులకు పెట్టుబడి సాయంగా ఇస్తామన్న రూ.20 వేల హామీ మోసమే.. 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు రూ.18 వెలు అని చెప్పిందీ మోసమే.. నిరుద్యోగ భృతి కీంద ఏడాదికి రూ.36 వేలు మోసమే.. 50 ఏళ్లు నిండిన ప్రతీ అక్కకూ రూ.48 వేలు మోసమే అంటూ జగన్ ఏకేశారు!
ఈ క్రమంలో... రోజులు గడుస్తున్న కొద్దీ మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటికీ బయటకు వస్తూనే ఉన్నాయని.. ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీస్తున్నాయని.. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైసీపీ ప్రజల పక్షాన నిలబడి, వారి గొంతుకై నిలుస్తుందని.. ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్ధానాల అమలు కోసం వారి తరుపున నిలబడుతుందని జగన్.. చంద్రబాబుకు తెలిపారు!