జగన్ 'వ్యూహం' .. సక్సెస్ అయ్యేనా ..!
వైసీపీ అధినేత జగన్.. రాజకీయ అడుగులు నెమ్మదిగా పడుతున్నాయి. అయితే.. అడుగులు నెమ్మదిగా పడినప్పటికీ.. వ్యూహం మాత్రం జోరుగానే ఉందన్న ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Desk | 14 Feb 2025 2:30 PM GMTవైసీపీ అధినేత జగన్.. రాజకీయ అడుగులు నెమ్మదిగా పడుతున్నాయి. అయితే.. అడుగులు నెమ్మదిగా పడినప్పటికీ.. వ్యూహం మాత్రం జోరుగానే ఉందన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల సమయంలో సామాజిక వర్గాల చూసుకుంటే.. కాపులు వైసీపీకి దూరమయ్యారు. వీరు దూరం అవకుండా జగన్ అనేక ప్రయత్నాలు చేశారు. కాపు ఉద్యమ నాయకులను తనవైపు తిప్పుకొన్నారు. అంతేకాదు.. వారితో జనసేన పార్టీపై విమర్శలు కూడా చేయించారన్న వాదన ఉంది.
అదే సమయంలో ముద్రగడ పద్మనాభం వంటి కాపు ఉద్యమకారులను పార్టీలో చేర్చుకున్నారు. ఎన్నికల ప్రచారం బాధ్యాతలను కూడా అప్పగించారు. అదేసమయంలో కాపు సంక్షేమ సేన అధ్యక్షులు మాజీ ఎంపీ హరిరామ జోగయ్య కూడా.. పరోక్షంగా వైసీపీకి సహకరించారన్న విమర్శలు వచ్చాయి. ఇక, ఇంత చేసినా కాపుల ఓటు బ్యాంకు మాత్రం వైసీపీ వైపు పడకపోవడం గమనార్హం. ఇక, ఆ తర్వాత.. కాపు నాయకులు కూడా. పార్టీకి రాంరాం చెప్పారు.
కొందరు దూరంగా ఉండగా.. మాజీ మంత్రి ఆళ్ల నాని వంటి వారు వైసీపీకి దూరమయ్యారు. తాజాగా ఆళ్ల టీడీపీ కండువా కప్పుకొన్నారు. కట్ చేస్తే.. మరోవైపు కాపు ఓటు బ్యాంకు పూర్తిగా జనసేనకు అనుకూలంగా మారిందన్న వాదన కూడా బలపడుతోంది. ``ఇప్పటికిప్పుడు పవన్ పై వ్యతిరేకత పెరగదు. ఇప్పటి వరకు వచ్చింది ఒక్క చాన్సే కదా!`` అనే పాజిటివ్ టాక్ పవన్ విషయంలో వినిపిస్తోంది. అంటే.. ఎలా చూసుకున్నా.. జగన్ కు కాపుల మద్దతు దూరమవుతోందని స్పష్టంగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే కాపులను మచ్చిక చేసుకునేందుకు జగన్ ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిలో భాగం గానే కాపులకు పదవులు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారన్న చర్చ తెరమీదికి వచ్చింది. దాడిశెట్టి రాజా, కురసాల కన్నబాబు వంటివారికి తాజాగా పదవులు ఇవ్వడం.. వారికి పార్టీలో ప్రాధాన్యం పెంచడం వంటివి కాపులను బుజ్జగించేందుకేనని అంటున్నారు పరిశీలకులు. కానీ, గ్రౌండ్ లెవిల్లో చూసుకుంటే.. కాపుల మనసులో పవన్ గూడుకట్టుకుని ఉండడం.. ఆయనపై ఎక్కడా వ్యతిరేకత లేకపోవడం.. వంటివి జగన్ వ్యూహానికి బెడిసి కొడుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.