జిల్లా పాలిటిక్స్: చిత్తూరులో గత వైభవం కోసం జగన్ ఆరాటం ..!
అయితే.. గత ఎన్నికల్లో ఇది రివర్స్ అయింది. పెద్దిరెడ్డి సోదరులు మినహా.. ఎవరూ విజయం దక్కించుకో లేదు. ఇక, ఎంపీ స్థానం మాత్రం నిలబడింది.
By: Tupaki Desk | 16 April 2025 2:45 AMరాష్ట్రస్థాయి పాలిటిక్స్ ఎలా ఉన్నా.. జిల్లాల స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చిత్తూరు జిల్లా నాయకులకు ఫ్రీహ్యాండ్ కూడా ఇచ్చారు. వారు ఏం చేసినా.. వారిష్టం.. అన్నట్టే వదిలేశారు. దీనికి కారణం.. 2019లో ఇక్కడ 14 స్థానాలకు గాను.. 13 స్థానాల్లో వైసీపీ నాయకులు విజయం దక్కించుకున్నారు. ఒక్క కుప్పంలో మాత్రమే టీడీపీ విజయం సాధించింది.
అయితే.. గత ఎన్నికల్లో ఇది రివర్స్ అయింది. పెద్దిరెడ్డి సోదరులు మినహా.. ఎవరూ విజయం దక్కించుకో లేదు. ఇక, ఎంపీ స్థానం మాత్రం నిలబడింది. ఇలా.. ఒక్కసారిగా పైకెగిరి.. మళ్లీ ఒక్కసారిగా కిందకు ప డడం ఈ జిల్లాలోనే జరిగింది. పైగా ఇది చంద్రబాబు సొంత జిల్లా కావడంతో జగన్‌కు నిద్రపట్టడం లేదట. దీంతో ఈ జిల్లాలో మళ్లీ 2019 నాటి రిజల్ట్ వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, జగన్‌కు ఇంత కోరిక ఉన్నా.. నాయకులకు కూడా ఉండాలికదా!?
జిల్లాలో కీలక నాయకులుగా ఉన్న వారిలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, మిధున్ రెడ్డి, రోజా, నారాయణ స్వామి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మధుసూదన రెడ్ఢి, ద్వారకా నాథ్‌రెడ్డి లాంటి నేతలు జగన్‌కు సన్నిహితంగా మెలిగే వారే. గతంలో విజయందక్కించుకున్న వారే. పైగా టీడీపీని టార్గెట్ చేయడంలోనూ.. వీరు ముందువరుసలో ఉన్నారు. అయితే.. ఇది వికటించిందో.. లేక ప్రజలు వీరి రాజకీయాలను కాదనుకున్నారో.. మొత్తానికి పెద్దిరెడ్డి ఫ్యామిలీ తప్ప.. అందరూ పక్కన కూర్చున్నారు.
2019 ఎన్నికల తర్వాత నేతలు గ్రూపులుగా విడిపోతే…మరికొందరు నేరుగానే ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించారు. గత ఐదేళ్లుగా నగరి కేంద్రంగా జరిగిన రచ్చ అంతా కాదు. వాటి వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారంటూ రోజా బహిరంగంగానే ఆరోపణలు చేశారు. పెద్దిరెడ్డితో పాటు నారాయణస్వామితోనూ రోజాకు గొడవలు ఉండేవి. ఇక చెవిరెడ్డి. భుమన కరుణాకర్ రెడ్డి…సెపరేట్ టీమ్‌గా వ్యవహరించేవారు. ఫలితంగా గత ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు వచ్చాయి. కంచుకోట లాంటి చిత్తూరు జిల్లాలో ఇంతటి పరిస్థితి వచ్చినా.. ఇప్పుడైనా కలిసి నడవాలని జగన్ చెబుతున్నారు. మరి నాయకులు ఏం చేస్తారో చూడాలి.