Begin typing your search above and press return to search.

క్యాడర్ కోసం జగన్ ఆ పని చేస్తారా ?

దాంతో జగన్ జనంలోకి ఎపుడు వెళ్ళినా పార్టీ క్యాడర్ ని నష్టపోయిన బాధితులను పరామర్సించడం అన్నది ముఖ్యమైన అజెండాగా పెట్టుకున్నారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   12 Oct 2024 1:30 PM GMT
క్యాడర్ కోసం జగన్ ఆ పని చేస్తారా ?
X

వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తన పార్టీ క్యాడర్ మీదనే ఇపుడు ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆయన చూపు కూడా మెయిన్ లీడర్స్ మీద లేదు అని అంటున్నారు. పార్టీలో ద్వితీయ తృతీయ శ్రేణి నేతలతో పాటు పార్టీకి ప్రాణం బెట్టే క్యాడర్ ని కాపాడుకోవాలని చూస్తున్నారు. వారు తన వెంట ఉంటే చాలు విజయం తధ్యమని ఆయన భావిస్తున్నారు

మూడు పార్టీలతో ఏర్పడిన కూటమి పట్ల జనంలో అపుడే వ్యతిరేకత మొదలైందని జగన్ అండ్ కో అభిప్రాయపడుతున్నారు. ఇది అంతకంతకూ పెరిగేదే తప్ప తగ్గేది కాదని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరైన టైం చూసి రంగంలోకి దిగాలని కూడా ఆలోచిస్తున్నారు

గేర్ మార్చి స్పీడ్ పెంచాలని అపుడే ఫ్యాన్ హై రేంజిలో గిర్రున తిరుగుతుందని అని తలపోస్తున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ గద్దె దిగాక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ క్యాడర్ చిన్న నాయకులు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా గ్రామాలు మండలాలు చిన్న పట్టణాలలో ఉన్న నాయకులు క్యాడర్ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది అని అంటున్నారు.

వారి వ్యాపారాలు అన్నీ ఆగిపోయాయి. వారి ఉపాధి కూడా లేకుండా పోయింది. పైగా వారి మీద కేసులు పడ్డాయి. వారి ఆత్మ స్థైర్యం మీద దెబ్బ కొట్టేలా లోకల్ గా ఉండే ప్రత్యర్ధి వర్గాలు గట్టిగానే చేస్తున్నాయి. దీంతో వారంతా డీలా పడ్డారు. వారికి రాజకీయం కాదు ఇపుడు కావాల్సింది, వారికి ఇపుడు ఉపాధి బతుకు కావాలి.

మళ్ళీ తమ కాళ్ళ మీద తాము నిలబడడం కావాలి. తమకు వెనక ఒకరు ఉన్నారు అని ధైర్యం చెప్పి భోరోసా ఇచ్చేవారు కావాలి. దాంతో వారు వైసీపీ అధినాయకత్వం వైపే చూస్తున్నారు. అధినేత జగన్ వారికి గట్టిగానే ధైర్యం చెబుతున్నారు. మళ్ళీ మన రోజులే అని అంటున్నారు, మంచి రోజులు వస్తాయని కూడా అంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే పార్టీ కోసం నిలబడి అదే పార్టీ మూలంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని జగన్ ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. నిజంగా ఇది వైసీపీకి మంచి పరిణామం అని అంటున్నారు. పార్టీ వైపు ఉండి పోరాడిన వారు బాధితులుగా మిగిలారని వారే కూటమికి టార్గెట్ అయ్యారని భావిస్తున్న జగన్ వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

దాంతో జగన్ జనంలోకి ఎపుడు వెళ్ళినా పార్టీ క్యాడర్ ని నష్టపోయిన బాధితులను పరామర్సించడం అన్నది ముఖ్యమైన అజెండాగా పెట్టుకున్నారు అని అంటున్నారు. వారికి అధికంగా సాయం చేయాలని కూడా జగన్ ఆలోచిస్తున్నారు అని చెబుతున్నారు. అలాగే వారితోనే తాను అంటూ ఫుల్ ధీమాను వారిలో కలిగిస్తారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే జగన్ జనంలోకి ఎపుడు వెళ్తారు అంటే దానికి రెండు ముహూర్తాలు ఉన్నాయని అంటున్నారు. మొదటి ముహూర్తం సంక్రాంతి తరువాత అని చెబుతున్నారు. అంటే పండుగ దాటించి జనంలోకి వెళ్తే ఎలా ఉంటుంది అన్నది పార్టీలో ఒక చర్చ సాగుతోంది.

అలా కాకుండా మార్చి దాకా చూసి ఏప్రిల్ నుంచి టూర్ ని మొదలెడితే ఎలా ఉంటుంది అన్నది రెండో ఆలోచన. ఎందుకంటే 2025 మార్చిలో టీడీపీ కూటమి ప్రభుత్వం బడ్జెట్ ని ప్రవేశపెడుతుంది. అందులో ఏ పధకాలు ఇస్తారు ఏమిటి వాటికి ఎంత కేటాయిస్తున్నారు అన్నది తెలుస్తుంది. దానిని ఆసరా చేసుకుని జనంలోకి వెళ్తే కూటమి మీద విమర్శలు చేయడానికి విరుచుకుపడడానికి బోలెడన్ని అస్త్రాలు దొరుకుతాయని అంటున్నారు.

ఇక అప్పడికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాదికి దగ్గర అవుతుంది కాబట్టి జనాలలో వ్యతిరేకత వస్తుంది, జగన్ ఏమి చెప్పినా వారు వినే అవకాశం ఉంటుందని అంటున్నారు. మొత్తానికి జగన్ క్యాడర్ ని కాపాడుకోవడానికి అలాగే వైసీపీ పట్ల పూర్తి ప్రేమను చూపించే జనాలకు అండగా నిలిచేందుకు సమాయత్తం అవుతున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఆయన జనం టూర్ ప్రొగ్రాం డిజైన్ ఎలా ఉంటుందో.