Begin typing your search above and press return to search.

ఆ నినాదాలు జగన్ ని ఇరిటేట్ చేస్తున్నాయా ?

అయితే ఆనాడు లేని అసహనం ఇపుడు ఆయనలో కనిపిస్తోంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   24 Oct 2024 6:17 PM GMT
ఆ నినాదాలు జగన్ ని ఇరిటేట్ చేస్తున్నాయా ?
X

జగన్ మాజీ సీఎం, వైసీపీ చీఫ్ గా ఉన్నారు. ఆయన గతంలో కూడా అయిదేళ్ళ పాటు విపక్ష నేతగా వ్యవహరించారు. అయితే ఆనాడు లేని అసహనం ఇపుడు ఆయనలో కనిపిస్తోంది అని అంటున్నారు. అప్పట్లో వైసీపీకి 67 సీట్లు దక్కాయి. ఇపుడు కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి.

ఆ బాధ చాలా తీవ్రంగా ఉంది. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం కొలువు తీరి అయిదు నెలలు అవుతున్నా జగన్ మాత్రం 2024 ఎన్నికల ఫలితాలు మిగిలిచిన చేదు అనుభవాన్ని మరచిపోలేకపోతున్నారు అని అంటున్నారు.

ఇక జగన్ కి ఒకనాడు ఎంతో ఇష్టమైన మాట అందమైన నినాదంగా చెవులకు తాకినది ఇపుడు వినడానికే ఇబ్బందికరంగా ఉందా అని అంటున్నారు. 2014 నుంచి 2019 దాకా జగన్ ఎక్కడికి వెళ్ళినా ఆయన అభిమానులు సీఎం అంటూ నినాదాలు చేస్తూ వచ్చేవారు. జగన్ దానిని చిరునవ్వుతో స్వీకరించేవారు.

అయితే ఇపుడు మాత్రం అదే సీఎం నినాదాలను ఆయన వద్దు అనుకుంటున్నారా అన్న చర్చ వస్తోంది. ఇక అయిదేళ్లు సీఎం గా పనిచేసిన జగన్ కి అప్పట్లో ఇవే నినాదాలు ఎంతో హుషార్ ని ఇచ్చాయి. కానీ ఇపుడు మాత్రం అదోలాగ ఉన్నాయా అని అంటున్నారు

విజయనగరం జిల్లా గుర్లలో అతిసార బాధితులను జగన్ పరామర్శించారు. అనంతరం మీడియాను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూండగా సీఎం అని అభిమానులు అదే పనిగా నినాదాలు చేస్తూ వచ్చారు. దాంతో ఒక దశలో అసహనానికి లోను అయిన జగన్ మైకు వదిలేసి వెళ్లిపోయారు. ఆయనను జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ మజ్జి శ్రీనివాసరావు వెనక్కి తీసుకుని వచ్చారు.

ఆ తరువాత ఆయన ప్రజలకు అభిమానులకు నచ్చచెబితే జగన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే జగన్ ఈ తరహాలో వ్యవహరించడం పట్ల మాత్రం చర్చ సాగుతోంది. విపక్ష నేతగా రెండోసారి ఈ స్థానంలోకి మారాక జగన్ ఈ నాలుగైదు నెలలలో ఇలా బాహాటంగా అసహనం వ్యక్తం చేయడం ఇది రెండవసారి అని అంటున్నారు.

ఆ మధ్య గుంటూరులోని జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ని జగన్ పరామర్సించారు. అపుడు జగన్ బయట మీడియాతో మాట్లాడుతూండగా మీడియా వారు ఆయన ప్రసంగం ముగియకముందే ప్రశ్నలు అడగడంతో జగ్న కి కోపం వచ్చేసింది. నేను మాట్లాడడం ఇక ఎందుకు అంటూ ఆయన అపుడు కూడా మీడియా మీట్ నుంచి వెళ్ళబోయారు.

ఇలా తరచూ జగన్ ఎందుకు అసహనానికి గురి అవుతున్నారన్న చర్చ అయితే వస్తోంది. నిజానికి జగన్ మీడియా మీటింగ్స్ కూడా చిత్రంగా ఉంటాయని అంటున్నారు. ఆయన తన వెంట తెచ్చుకున్న కాగితాలను మీడియా సమావేశంలో చదువుతూ మాట్లాడుతారు. అది అయిపోగానే ఆయన మీటింగ్ క్లోజ్ చేస్తారు. మీడియా అడిగే ప్రశ్నలకు బదులు పెద్దగా ఇవ్వరని ఆ ఇంటరాక్షన్ ఉండదని అంటూంటారు.

ఇపుడు ఏకంగా జనాలు తోసుకుని వస్తున్నారని మీడియా మీటింగ్ కూడా నిర్వహించుకోనీయరా అని ఆయన పోలీసుల మీద కూడా కోపం ప్రదర్శించారు. మొత్తానికి చూస్తే సీఎం పదవి నుంచి దిగిపోయి ఘోరమైన ఓటమిని మూటకట్టుకున్న జగన్ కి ఇపుడు ఆ పదమే ఇబ్బందిగా మారిందని అంటున్నారు.