Begin typing your search above and press return to search.

జగన్ మాజీ సీఎం కాదా కేంద్ర మంత్రీ ?

దాని వల్ల మర్యాదగా హుందాగా నడపాల్సిన రాజకీయం కాస్త మొరటుగా ఎబ్బెట్టుగా మారుతోంది.

By:  Tupaki Desk   |   4 Sep 2024 5:30 PM GMT
జగన్ మాజీ సీఎం కాదా కేంద్ర మంత్రీ ?
X

వైఎస్ జగన్ ని పట్టుకుని జస్ట్ ఎమ్మెల్యే అంటూ గత మూడు నెలలుగా టీడీపీ పొలిటికల్ ర్యాగింగ్ చేస్తోంది. రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. కానీ ఏపీలో మాత్రం వ్యక్తిత్వ హననాలే ఉంటాయి. అంటే క్యారెక్టర్ ని పూర్తిగా నాశనం చేయడం, అవతల వారిని పూచిక పుల్లల మాదిరిగా చూడడం, ప్రత్యర్ధులను లైట్ తీసుకోవడం చేస్తూంటారు. అది వారూ వీరూ అన్న తేడా లేదు అందరూ అలాగే ఉన్నారు.

దాని వల్ల మర్యాదగా హుందాగా నడపాల్సిన రాజకీయం కాస్త మొరటుగా ఎబ్బెట్టుగా మారుతోంది. రచ్చబండ వద్ద పంచాయతీ తగవులు కూడా దీని కంటే బెటర్ అని అనేలా ఉంది. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక జగన్ విషయంలో కొత్తగా ర్యాగింగ్ చేస్తోంది. దీని మీద వైసీపీ నుంచి కూడా స్ట్రాంగ్ గా డిఫెన్స్ చేసుకోవడం అనేది లేకపోవడం కూడా టీడీపీ దూకుడుకు కారణం అవుతోంది.

ఒక్క ఓటమితో వైసీపీ జగన్ ఏమీ కానట్లు తమకే శాశ్వతంగా జనాలు అధికారం కట్టబెట్టినట్లుగా టీడీపీ కూటమి మంత్రులే కాదు కేంద్ర మంత్రి, సహాయ మంత్రి కూడా ఇదే తీరున మాట్లాడుతున్నారు. జగన్ చేసే విమర్శలను ఖండించవచ్చు. కానీ ఆయన హోదాను ఎకసెక్కం చేయడం తప్పు కదా. జగన్ అయిదేళ్ల పాటు ఏపీకి సీఎం గా ఉన్నారు.

మరి అలాంటి లీడర్ గురించి మాట్లాడేటప్పుడు పులి వెందుల ఎమ్మెల్యే అనడమేంటి అన్న ప్రశ్న వస్తోంది. మాజీ సీఎం అని జగన్ ని సంభోదించవచ్చు. కానీ అలా కాకుండా జగన్ ని జనంలో తేలిక చేయాలనుకుని ఈ స్ట్రాటజీ వాడుతున్నారు. మొదట్లో అంటే ఏదో సరదాగా అన్నారు అనుకున్నారు. కానీ రాను రానూ అదే అలవాటుగా అంటున్నారు అంటే ఇది పక్కా వ్యూహంతోనే అని అంటున్నారు

జగన్ ఒకసారి మాజీ అయినా కూడా మాజీ సీఎం అనే ఎప్పటికీ పిలుస్తారు అని తెలియకపోవడమే చిత్రం. కేవలం నెల రోజుల పాటు ఉమ్మడి ఏపీకి సీఎం గా చేసిన నాదెండ్ల భాస్కరరావుని మాజీ సీఎం అనే కదా గౌరవిస్తున్నారు. ఇక తెలంగాణాలో పదేళ్ల పాటు అధికారంలో ఉంటూ గత ఏడాది ఎన్నికల్లో ఓటమి పాలు అయిన కేసీఆర్ ని పట్టుకుని గజ్వేల్ ఎమ్మెల్యే అని అనడం లేదు కదా.

ఆయన రెస్పెక్ట్ ని ఆయనకు ఇస్తున్నారు కదా. మరి పొరుగునే ఉన్న తెలంగాణాలో పాటిస్తున్న సంప్రదాయం ఏపీలో ఎందుకు పాటించడం లేదు అన్న చర్చ సాగుతోంది. ఇక అయిదేళ్ల వెనక్కు వెళ్తే 2019లో చంద్రబాబు కూడా ఓటమి పాలు అయ్యారు కదా ఆనాడు ఆయనను కుప్పం ఎమ్మెల్యే అని వైసీపీ ఎద్దేవా చేయలేదు కదా, మాజీ సీఎం అనే సంబోధించేవారు కదా అన్నది కూడా తమ్ముళ్ళు గుర్తు పెట్టుకోవాలని అంటున్నారు.

జగన్ ని జనంలో తక్కువ చేసి చూపించాలని ప్రయత్నం చేస్తే అది ఆయన గౌరవానికి ఏమీ కాదు, కానీ జనాలు తెలివైన వారు. వారు ఆలోచిస్తారు. ఎవరిని ఎలా ప్రభుత్వ పెద్దలు ట్రీట్ చేస్తున్నారు అన్నది బాగా గమనిస్తారు. టీడీపీ నాయకులకు అధికారం దక్కడం తోనే గర్వం తలకెక్కిందని అనుకుంటారు. ఇది టీడీపీకే మంచిది కాదు అని అంటున్నారు. దీని వల్ల టీడీపీకే నష్టం అని కూడా అంటున్నారు.

ఇక టీడీపీ పెద్దలు మరచిపోతోంది ఏంటి అంటే జగన్ ఓడిపోయినా ఆయనకు 40 శాతం ఓటు షేర్ వచ్చిందన్న సంగతి. ఇదే ఓటు షేర్ 2019లో చంద్రబాబుకూ వచ్చింది. అయిదేళ్ళు గిర్రున తిరగకుండా బాబు సీఎం అయ్యారు. ఇక పోతే బాబు తన మొత్తం పొలిటికల్ కెరీర్ లో వరసగా రెండోసారి గెలిచిన దాఖలాలు అయితే లేవు. అంటే ఒకసారి గెలిస్తే మరో ఎన్నికల్లో బాబు ఆయన పార్టీ ఓడిపోతూ వచ్చాయి.

ఏపీలో చూస్తే ఆల్టర్నేషన్ పాలిటిక్స్ కి జనాలు మొగ్గు చూపుతూ ఉంటారు. ఎవరు ఎంత బాగా పాలించారు అన్నది పక్కన పెడితే అయిదేళ్లకు ఒక మార్పుని జనాలు కోరుకుంటున్నారు. మరి అలా చూసుకుంటే ఈ రోజు ఓడలు రేపు బళ్ళు అవుతాయన్నది తమ్ముళ్లు గుర్తించకపోతే ఎలా అని అంటున్నారు. అంతా మేమే అన్నీ మేమే అని ఎవరు అనుకున్నా అది మొదటికే మోసం అని అంటున్నారు.

జగన్ ని ర్యాంగింగ్ చేయాలాని చూస్తే అది బూమరాంగ్ అవుతుంది అన్నది కూడా గమనించాలి. పాలన పరంగా తాము మరింత మెరుగ్గా పని చేయడం ఎలా అన్న దాని మీదనే కూటమి పెద్దలు దృష్టి సారించాలని అంటున్నారు. జస్ట్ ఎమ్మెల్యే అని జగన్ ని అంటున్న వారు అంతా ఎమ్మెల్యే అంటే అంత విలువ లేనిదా అని కూడా ఆలోచించాలని కోరుతున్నారు.

ఎవరైనా ముందు ఎమ్మెల్యేగా గెలిస్తేనే మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా అయ్యేది అన్నది కూడా ఆలోచించాల్సి ఉంది. పైగా రెండు లక్షల మంది జనాలు ఓటేసి గెలిపించిన వారిని జస్ట్ ఎమ్మెల్యే అంటే మంత్రి పదవులు దక్కని అధికార పార్టీ వారి సంగతేంటి, వారు అంతా జస్ట్ ఎమ్మెల్యేలు అని లైట్ తీసుకోవాల్సిందేనా అన్న చర్చ కూడా సాగుతోంది. ప్రజలు ఇచ్చే ప్రతీ పదవీ గొప్పదే. ప్రతీ హోదా గొప్పదే. విధానాల పరంగా విమర్శలు ఉంటే జనాలు హర్షిస్తారు తప్ప సెటైర్లు పేల్చాలనుకోవడం బాధ్యత గల పదవులలో ఉన్న వారికి తగని పని అన్న సూచనలు కూడా వస్తున్నాయి.