Begin typing your search above and press return to search.

పవన్ - జగన్... తిరుపతిలో 'సమరసింహారెడ్డి' తరహా సన్నివేశం!

బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ ఎంత బ్లాక్ బాస్టర్ అనేది చాలా మందికి తెలిసిన విషయమే.

By:  Tupaki Desk   |   10 Jan 2025 5:11 AM GMT
పవన్ - జగన్... తిరుపతిలో సమరసింహారెడ్డి  తరహా సన్నివేశం!
X

బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ ఎంత బ్లాక్ బాస్టర్ అనేది చాలా మందికి తెలిసిన విషయమే. ఇందులో భాగంగా... ఢిల్లీ నుంచి ట్రైన్ లో దిగిన బాలకృష్ణ.. అదే సమయానికి ఆయన కూతురును ట్రైన్ ఎక్కించడానికి వచ్చిన విలన్ జయప్రకాశ్ రెడ్డి ఎదురుపడే సన్నివేశం అది. ఇద్దరూ ఎదురుపడేసరి వాతావారణం ఒక్కసారిగా వేడెక్కిపోతుంది.

అయితే.. అది సినిమా కాబట్టి పలు డైలాగులు, ఫైట్లు గట్రా ఉన్నాయి. ఆ సినిమా సినిమా మొత్తానికే హైలెట్ అని చెబుతారు. అయితే... ఆ స్థాయిలో కాకపోయినా అంత హాట్ సందర్భం, సన్నివేశం తిరుపతిలో చోటు చేసుకుందని అంటున్నారు. ఈ విషయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అవును... ఏపీ రాజకీయాల్లో వారిద్ధరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అనే స్థాయిలో ఒకరిపై ఒకరు విరుచుకుపడే నేతల్లో జగన్ – పవన్ జోడీ ఒకటనే చెప్పాలి! గడిచిన సార్వత్రిక ఎన్నికల సమయంలో జగన్ పై పవన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తే.. దత్తపుత్రుడు, నాలుగు పెళ్ళిళ్లు అంటూ జగన్ విరుచుకుపడేవారు.

ఆ ఇద్దరూ గురువారం సాయంత్రం తిరుపతిలో ఎదురుపడినంత పనిచేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన క్షతగాత్రులు సిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పోందుతున్న సంగతి తెలిసిందే. వారిని పరామర్శించడానికి సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో పవన్ కల్యాణ్ వెళ్లారు. వారిని పరామర్శించారు.

దాదాపు అదే సమయానికి బాధితులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా సిమ్స్ కు చేరుకున్నారు. ఆ సమయంలో పవన్ మీడియాతో మాట్లాడుతుండగా.. జగన్ రావడంతోపాటు ఆయన వెంట పెద్ద ఎత్తున అభిమానులు గుమిగూడారు. దీంతో... అది చూసిన జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు నినాదాలు చేయడం మొదలుపెట్టారు.

దీంతో... అది చూసిన జగన్ అభిమానులు "జై జగన్", "సీఎం.. సీఎం.." నినాదాలతో హోరెత్తించేశారు. దీంతో.. పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కిందని చెబుతున్నారు. ఇదే సమయంలో.. పోలీసులను టెన్షన్ కలిగించిందని అంటున్నారు. ఈ సమయంలోనే ఫ్యాన్స్ పై పవన్ మండిపడ్డారు. సమయం సందర్భం లేకుండా ఏమిటీ నినాదాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ను పోలీసులు వేరే మార్గం గుండా పంపీంచారు. దీంతో.. పవన్ మీడియా సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించి వెనుదిరగాల్సి వచ్చిందని అంటున్నారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. ఏది ఏమైనా.. ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది. అయితే.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు!

ఈ నేపథ్యంలోనే... హీరో ఎవరు, విలన్ ఎవరు అనే సంగతి కాసేపు పక్కనపెడితే... దీన్ని 'సమరసింహారెడ్డి' సినిమాలోని సన్నివేశంతో పోలిస్తున్నారు పలువురు నెటిజన్లు!