వైసీపీ 'ఘర్ వాపసీ'.. ఫలించేనా ..!
దీంతో ఇప్పుడు ఘర్ వాపసీపై పార్టీ నాయకుల మధ్య ఆసక్తికర చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 24 Feb 2025 5:33 AM GMTఏపీ ప్రతిపక్షం వైసీపీలో 'ఘర్ వాపసీ'(సొంతింటికి తిరిగి రండి!) నినాదాలు వినిపిస్తున్నాయి. తాజాగా పార్టీ అధినేత జగన్ కూడా ఈ దిశగా కీలక సూచనలు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇప్పుడు ఘర్ వాపసీపై పార్టీ నాయకుల మధ్య ఆసక్తికర చర్చ సాగుతోంది. గత ఏడాది ఎన్నికల తర్వాత.. వైసీపీకుదేలైన విషయం తెలిసిందే. తర్వాత.. కొన్నాళ్లు వేచి చేసినా.. పార్టీ అధినేత జగన్ వైఖరిలో మార్పురాలేదని.. తమకు కనీసం దర్శన భాగ్యం కూడా కల్పించడం లేదని ఆరోపిస్తూ.. పలువురు నాయకులు పార్టీకి దూరమయ్యారు.
వీరిలో సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే.. బీసీలు ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా కాపు నాయకులు కూడా జెండా మార్చేశారు. ఎమ్మెల్సీలుగా ఉన్నవారు సైతం తమ పదవులు వదులుకుని..పార్టీకి రాం రాం చెప్పారు. వీరంతా తలా ఓ పార్టీలో చేరిపోయారు. ఇదిలావుంటే.. మరింత మంది పార్టీ మారుతున్నారన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. అయితే.. ఇప్పటి వరకు ఎవరూ పార్టీ మారలేదు. ఈ నేపథ్యంలో ఇక, జంపింగులు ఆగిపోయాయన్న భావన వైసీపీ అధినేత నుంచి వినిపి్స్తోంది. అంతేకాదు.. వెళ్లిన వారు కూడా.. అంతర్మథనం చెందుతున్నారని.. వారు ఎందుకు వెళ్లామా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని జగన్ చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీని కాదని వెళ్లి పోయిన వారిలో సగానికిపైగా నాయకులు తిరిగి వైసీపీ గూటికి చేరడం త్వరలోనే జరుగు తుందని జగన్ అంచనా వేస్తున్నారని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా ఆదివారం ఆయన పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జంపింగుల గురించి.. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి జగన్ దగ్గర ప్రస్తావించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ''కొందరు మనల్ని కాదని వెళ్లిపోయారు. అయితే.. వారికి ఆ పార్టీల్లో ప్రాధాన్యం లేకుండా పోయింది. ఇలాంటి వారికి మన తిట్టొద్దు. వారు తొందర పడ్డారు. తిరిగి వస్తే.. తప్పకుండా ఆహ్వానిద్దాం'' అని జగన్ చెప్పుకొచ్చారు.
ఇదేవిషయాన్ని మాజీ మంత్రి, వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జ్ కన్నబాబు కూడా ధ్రువీకరించారు. వెళ్లిపోయిన నాయకులు తిరిగి రావడం ఖాయమని, వారిని పార్టీ కూడా ఆహ్వానించి అక్కున చేర్చుకుంటుందని కన్నబాబు చెప్పుకొచ్చారు. ఇక, వాస్తవ పరిస్థితిని గమనిస్తే.. పార్టీని వీడిన వారిలో మహిళా నాయకులకు ప్రాధాన్యం లేదన్నది వాస్తవం. వాసిరెడ్డి పద్మ, పోతుల సునీత, కిల్లి కృపారాణి వంటివారు వైసీపీలో ఉన్నప్పుడు.. బాగానే ఉన్నారు. కానీ, పార్టీని వదిలేసిన తర్వాత.. వారి ప్రాధాన్యం లేకుండా పోయింది. అదేవిధంగా కొందరు పురుష నాయకుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్ ఇలా ఘర్ వాపసీకి పిలుపునిస్తున్నట్టు తెలుస్తోంది.